Friday, May 3, 2024
Friday, May 3, 2024

నేను తిన్నది మూడు మామిడి పండ్లే

కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్‌… తీర్పు రిజర్వు

న్యూదిల్లీ : మామిడి పండ్లు, స్వీట్లు విచ్చలవిడిగా తింటున్నట్లు ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడిరచారు. 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే తాను తెలిపారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని చెప్పారు. అది కూడా నవరాత్రి ప్రసాదమని శుక్రవారం దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడిరచారు. తీహారు జైల్లో తనకు ఇన్సులిన్‌ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తన వాదన వినిపించారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దిల్లీ సీఎం అభ్యర్థనను గురువారం వ్యతిరేకించిన ఈడీ… ఆయనపై ఆరోపణలు చేసింది. ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉందని, దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని చెప్పింది. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారని ఆరోపించింది. ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్‌ పెరుగుతాయని కేజ్రీవాల్‌కు తెలుసునని, అయితే ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసమే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. జైల్లో రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ను వైద్యులు పరీక్షిస్తున్నారని ఈడీ వెల్లడిరచింది. ఈడీ ఆరోపణలను సీఎం తరపు న్యాయవాది ఖండిరచారు. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. దీనిపై రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై నివేదిక ఇవ్వాలని తీహారు జైలు అధికారులను నిన్న ఆదేశించింది. శుక్రవారం మరోసారి వాదనలు విన్న కోర్టు… రెండు పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌ చేసింది.
కేజ్రీవాల్‌ అంతానికి కుట్ర: ఆప్‌
న్యూదిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్‌ జైలు అధికారులపైనా ఆయన అరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆయనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌ సింగ్‌ చెప్పారు. కేజ్రీవాల్‌ మధుమేహం వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సకాలంలో ‘ఇన్సులిన్‌’ ఇవ్వడం లేదని సింగ్‌ తెలిపారు. పైగా కేజ్రీవాల్‌ అస్వస్థతతో బాధపడుతుంటే బీజేపీ నేతలు ‘అపహాస్యం’ చేస్తూ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జైలులో ఉన్న వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం షేర్‌ చేయడానికి జైలు నిబంధనలు అంగీకరించనప్పుడు… కేజ్రీవాల్‌ నకిలీ డైట్‌చార్ట్‌ను మీడియా ముందు ఈడీ ఎలా ప్రదర్శించిందని సంజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. ఆయనకు విషం ఇచ్చే కుట్ర జరుగుతోందా అని నిలదీశారు. కేజ్రీవాల్‌కు జైలులో ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ముఖ్యమంత్రిని జైలులోనే చంపేందుకు కుట్ర జరుగుతోందని దిల్లీ మంత్రి అతిశి సైతం గురువారం ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img