Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

తొలి విడతప్రశాంతం

. 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌
. అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా…
. మణిపూర్‌, అరుణాచల్‌లో స్వల్ప హింసాత్మక ఘటనలు
. కొన్నిచోట్ల ఈవీఎంల ధ్వంసం ` ఓటు వేసిన ప్రముఖులు… సినీ నటులు
. సాయంత్రం 5 గంటలకు 60 శాతం పోలింగ్‌ నమోదు

న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. అనేక చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిరచారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. తొలి విడతలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో 66.94 శాతం, సిక్కింలో 67.95 శాతం చొప్పున ఓటింగ్‌ నమోదయింది. తొలివిడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను కోరారు. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ‘గణనీయమైన’ ఓటింగ్‌ శాతం నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. అసోంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో 11.15 శాతం ఓటింగ్‌ నమోదయింది. పశ్చిమ బెంగాల్‌లోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి దశలో ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, భూపేంద్ర యాదవ్‌, కిరెన్‌ రిజిజు, జితేంద్ర సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, సర్బానంద సోనోవాల్‌, కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్‌ గొగోయ్‌, డీఎంకే అభ్యర్థి కనిమొళి, తమిళనాడు బీజేపీ అధినేత కె.అన్నామలై ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ బలమైన మెజారిటీ కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పుంజుకోవాలని ఆశిస్తోంది. 18వ లోక్‌సభకు 543 మంది సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయి. ఫలితాలు జూన్‌ 4న ప్రకటిస్తారు.
మొరాయించిన ఈవీఎంలు
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య హింస చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు, చత్తీస్‌గఢ్‌లో గ్రనేడ్‌ దాడి జరగడంతో ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి అనేక చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. మణిపూర్‌లోని మొయిరాంగ్‌ కాంపులో దాదాపు వంద మందికి చెందిన సాయుధ గ్రూపుల పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి అక్రమ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలియడంతో ఆగ్రహించిన ఓటర్లు ఈవీఎంలను ధ్వంసం చేశారు.
ఉత్సాహంగా వృద్ధులు… కొత్త జంట సైతం…
కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్‌ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. అలాగే అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేసేందుకు వచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధ ఓటర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక నైనిటాల్‌లో నూతన వధూవరులు పెళ్లి బట్టలు ధరించి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాయత్రీ చందోల్‌, ఆమె భర్త నైనిటాల్‌లోని దైలియా పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేయడానికి తమ వివాహ దుస్తులలో వచ్చారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. గాయత్రికి గురువారం అర్థరాత్రి వివాహం జరిగింది. శుక్రవారం తన భర్తతో కలిసి అత్తమామల ఇంటికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆమె అంతకంటే ముందే ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఆమె బెంగళూరులో పని చేస్తుంది. ఆమె భర్త రవిశంకర్‌ త్రిపాఠి దక్షిణ నగరంలో నివాసి.
ఓటేసిన అండమాన్‌ గిరిజనులు… శ్రీలంక తమిళ శరణార్థి…
అండమాన్‌`నికోబార్‌లో ప్రజాస్వామ్య పండుగ జరిగింది. అండమానీ గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలాఉండగా, భారతదేశంలోని శరణార్థి శిబిరంలో జన్మించిన శ్రీలంక తమిళ వ్యక్తి మొదటి సారి ఓటు వేశారు. 1986లో రామేశ్వరం మండపం క్యాంపులోని శరణార్థుల కేంద్రంలో జన్మించి, ప్రస్తుతం తిరుచ్చి కొత్తపట్టులోని శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో నివసిస్తున్న నళాయిని కిరుబాకరన్‌ శుక్రవారం తొలిసారిగా ఓటు వేసినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ‘మొదటిసారి నేను ఓటు వేశాను. చాలా సంతోషంగా ఉన్నాను. 38 ఏళ్ల వయస్సులో నా కల నెరవేరింది. తమిళనాడులో శ్రీలంక శరణార్థుల శిబిరం నుంచి ఓటు వేసిన మొదటి వ్యక్తిని నేనే’ అని కిరుబాకరన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img