Friday, May 3, 2024
Friday, May 3, 2024

పరీక్షలను పండుగలా జరుపుకోవాలి

విద్యార్థులతో మోదీ
న్యూదిల్లీ: విద్యార్థులు పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దిల్లీలోని తాలక్‌టోరా స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ-2022 కార్యక్రమంలో విద్యార్థులను కలుసుకోవటం తనకు ఎంతో ప్రత్యేకమని మోదీ అన్నారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన కళాకండాల ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ‘సమయాభావం వల్ల విద్యార్థుల ప్రశ్నలన్నింటికి ఈ వేదికపై సమాధానం ఇవ్వలేం. వీడియో, ఆడియో, సందేశాలు, టెక్ట్స్‌రూపంలో నమో యాప్‌ ద్వారా అందిస్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో తొలిసారి పరీక్షలకు హాజరవుతున్నవారెవరూ లేరు. అనేకమార్లు పరీక్షలకు హాజరైనందున వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఒక మెట్టు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండాలి. స్నేహితులను అనుకరించకూడదు. నీకు వచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. మీరంతా పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా జరిగిందో.. ఆన్‌లైన్‌లోనూ అదే జరుగుతుంది. ఇక్కడ మీడియం ముఖ్యం కాదు. మాధ్యమంతో సంబంధం లేకుండా, విషయాన్ని లోతుగా పరిశోధిస్తే, అర్థం చేసుకోవటంలో తేడా ఉండదు’ అని మోదీ పేర్కొన్నారు.
విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నప్పుడు తాము సమయాన్ని చదువుకోసం కేటాయిస్తున్నామా, సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
ఆకాంక్షలు, కలలు పిల్లలపై రుద్దొద్దు
మోదీ మాట్లాడుతూ… తమ కలలు, ఆకాంక్షలను పిల్లలపై రుద్దవద్దని తల్లిదండ్రులను, టీచర్లను మోదీ కోరారు. ఆన్‌లైన్‌ విద్యకు ఆధారం విజ్ఞానాన్ని సంపాదించడమనే సిద్ధాంతమని తెలిపారు. ఆ విజ్ఞానాన్ని పటిష్ఠం చేసుకోవడం, ఆచరణలో వర్తింపజేయడానికి సంబంధించినది ఆఫ్‌లైన్‌ విద్య అని చెప్పారు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలని, దానిని ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 21 శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చుతుందన్నారు. ఇది భారత దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తుందన్నారు. ఈరోజుల్లో విజ్ఞానం మాత్రమే సరిపోదని, నైపుణ్యాన్ని కూడా సాధించాలని సూచించారు. విజ్ఞానం, నైపుణ్యాల సమాహారంపై నూతన విద్యా విధానంలోని సిలబస్‌ దృష్టి పెట్టిందన్నారు.
బాలల సత్తా గుర్తించాలి
బాలల నిజమైన సామర్థ్యాలు, ఆకాంక్షలను మనం అర్థం చేసుకుని, శ్రద్ధగా ప్రోత్సహించనంత వరకు వారు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని తెలుసుకోలేరన్నారు. ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతారని చెప్పారు. మనం ఆ సత్తా, సామర్థ్యాలను గుర్తించాలని చెప్పారు. విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవాలా? తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలా? అనే సందిగ్ధంలో ఉంటారని చెప్పారు. దీంతో వారు అంతులేని అయోమయంలో కొట్టుమిట్టాడుతారని చెప్పారు. తమ పిల్లలకు దేనిమీద ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలని, వారి బలాలను వారు తెలుసుకోవడానికి సాయపడాలని అన్నారు.
కాలంతో పాటు మారాలి
20వ శతాబ్దంనాటి కాలం చెల్లిన భావాలు, విధానాలు 21వ శతాబ్దంలో అభివృద్ధికి మార్గదర్శకం కాబోవని మోదీ అన్నారు. కాలంతోపాటు మనం కూడా మారాలన్నారు. సానుభూతి కోసం ఎన్నడూ చూడవద్దని చెప్పారు. ‘మీ సమస్యలపై మీరే ఆత్మవిశ్వాసంతో పోరాడాలి… మీ జీవితం నుంచి ప్రతికూలతను నిర్మూలించడానికి సవాళ్లను ఎదుర్కొనాలి’ అని చెప్పారు. స్వీయ ప్రేరణ కోసం ఓ సరదా మార్గం ఉందన్నారు. అన్ని బాధలతో ఓ లేఖను రాయాలని చెప్పారు. మనసు పక్కదారి పట్టడం, నైరాశ్యానికి లోనవడం వంటివాటిని అర్థం చేసుకోవడానికి స్వీయ పరిశీలన అవసరమని చెప్పారు. పరీక్షల సమయంలో ప్రగతి దిశగా తీసుకెళ్లగలిగే ప్రేరణ అవసరమని తెలిపారు.
పరీక్షల కోసం చదవడం తప్పు
విద్యార్ధులు పరీక్షల కోసం చదవకూడదని, ఇలా చేయడం తప్పుడు వైఖరి అవుతుందని మోదీ చెప్పారు. పరీక్షల కోసం చదివితే నేర్చుకోవడంపై కాకుండా ఉత్తీర్ణత సాధించడం, మార్కులను పొందడంపై మాత్రమే మన దృష్టి ఉంటుందని చెప్పారు. పోటీల వల్ల జీవితం ప్రగతి సాధిస్తుందని తెలిపారు. గతంలో పెళ్లయిన తర్వాత బాలికలు స్థిరపడతారని అనుకునేవారని, వారి విద్యను నిర్లక్ష్యం చేసేవారని చెప్పారు. ఇది మారుతుండటం మంచి పరిణామమని తెలిపారు. మహిళా శక్తి లేకపోతే దేశం అభివృద్ధి సాధించదని మన తరానికి తెలుసునన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img