Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు తప్పనిసరి

ఏర్పాటు చేసిన వారికి 30 శాతం ప్రభుత్వ రాయితీ
వాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత
ప్రైవేటు వాక్సిన్‌ కేటాయింపుపై కేంద్రానికి మరో లేఖ
కొవిడ్‌ సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి :
రాష్ట్రవ్యాప్తంగా 100 పడకల ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విధిగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. వాటి తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. వీటిని ఏర్పాటు చేసిన ఆసుపత్రులకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్‌ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ముఖ్యంగా అన్ని పీహెచ్‌సీల్లో కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని, ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్‌, ఏసీ రిపేర్‌, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ మెరుగుపడటంతోపాటు చాలామందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించిన సీఎం, ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,04,17,764 డోసుల వాక్సిన్లు వేయగా, వాటిలో సింగిల్‌ డోసు కింద 1,03,24,702 మందికి, 50,46,531 మందికి రెండు డోసుల వాక్సినేషన్‌ పూర్తయిందని అధికారులు వివరించారు. ఇక మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే వాటిలో కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎంకు తెలిపారు. దానిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ వాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వాక్సినేషన్‌ మరింత వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం చెప్పారు. వివిధ రాష్ట్రాలలో కేసుల సంఖ్య వాక్సినేషన్‌, వాక్సినేషన్‌ అనంతరం అక్కడి కొవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించి, అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలని చెప్పారు. అలాగే నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండిరగ్‌ ఉన్న చోట భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, వచ్చే సమావేశంలోగా కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 20,965 ఉండగా, డెయిలీ పాజిటివిటీ రేటు 2.51 శాతం, రికవరీ రేటు 98.25 శాతం ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతం సవాంగ్‌, స్టేట్‌ కొవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్టబాబు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img