Friday, May 3, 2024
Friday, May 3, 2024

బెంగాల్‌ హింసపై ఆగని రాజకీయ రగడ

బెంగాల్‌ గవర్నరును తొలగించండి
అమిత్‌షాకు తృణమూల్‌ ఎంపీల డిమాండ్‌

న్యూదిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్‌ జిల్లాలో 8 మంది సజీవదహనంపై పార్లమెంటు లోపలా, బయటా పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర గవర్నరు జగ్‌దీప్‌ ధంకర్‌ను తక్షణమే తొలగించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఈ మేరకు విన్నవించింది. లోక్‌సభ చివరి వరుసలో కూర్చున్న బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్‌ దూకుడుగా వెల్‌లోకి దూసుకెళ్లి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహంతో విమర్శలు చేశారు. పోడియం ముందు కూర్చున్నారు. ఉగ్రవాద కేంద్రంగా బెంగాల్‌ మారిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ కూడా మమత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఘటనా స్థలికి వెళ్లకుండా తమ పార్టీ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరిని అడ్డుకుందని మండిపడ్డారు. హింస జరిగిన ప్రాంతానికి 90 కిలోమీటర్ల దూరంలో రంజన్‌ చౌదరిని పోలీసులు అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని పేర్కొన్నారు. అమిత్‌షాతో సమావేశం గురించి టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ వివరించారు. ఈ అంశంపై రాజకీయాలు మంచిది కాదని అమిత్‌షా చెప్పారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారన్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత బందోపాధ్యాయ విలేకరులతో మాట్లాడుతూ గవర్నరును తొలగించాలని తమ పార్టీ డిమాండ్‌ చేసిందన్నారు. గవర్నరు రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గవర్నరు నుంచి పార్లమెంటరీ వ్యవస్థకే ముప్పు ఏర్పడిరదని చెప్పారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నరుకు ఘర్షణాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. బిర్భూమ్‌ హింసపై గవర్నరు మరోసారి రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను మమత తిప్పికొట్టారు. లోక్‌సభలో తృణమూల్‌, బీజేపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. పరస్పరం నిందించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img