Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మరో కీలక వ్యక్తి కోసం గాలింపు

. విశాఖ కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు
. తిరుమల ఆస్పత్రి యజమాని సహా ఆరుగురి అరెస్టు
. సీసీ కెమెరాలు ఆపేసీ కిడ్నీ తొలగింపు
. పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం:
విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ వైద్యుడు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. డాక్టర్‌ పరమేశ్వరరావు, దళారులు కామరాజు, శ్రీను, శేఖర్‌, ఎలీనా, కొండమ్మ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుందని వివరించారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సీఎం త్రివిక్రమ్‌ వర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిరచారు. విశాఖపట్నంలోని తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ ఆపరేషన్లు జరిగాయని, ఇటీవల రెండు ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. వినయ్‌ కుమార్‌, వాసుపల్లి శ్రీనివాసరావుకు ఆపరేషన్‌ జరిగిందని, కిడ్నీ రాకెట్‌ కేసులో ఆపరేషన్‌ చేసిన వైద్యులపై దృష్టిసారించామన్నారు. కిడ్నీ సర్జరీలు చేసిన వైద్యుల్లో నార్ల వెంకటేశ్వరరావు కీలక సూత్రధారి అని, ఆయన గతంలో కిడ్నీ రాకెట్‌ కేసులో జైలుకు కూడా వెళ్లాడని సీపీ వెల్లడిరచారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశముందని, నిందితులపై ఐపీసీ 307, 326, 420 కేసులు పెట్టినట్లు తెలిపారు. కిడ్నీ ఇస్తే రూ.8.5లక్షలిస్తామని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాంబే కాలనీకి చెందిన కారు డ్రైవర్‌ వినయ్‌కుమార్‌ను ముఠా సంప్రదించడం, అడ్వాన్సుగా రూ.2.5లక్షలు ఇచ్చి… కిడ్నీ తీసేశాక మిగతా డబ్బులిచ్చేందుకు వెనుకాడడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన మడకా కామరాజు, బి.ఎలీనా, మర్రా కొండమ్మ, మర్రా శ్రీను (భార్యభర్తలు), ల్యాబ్‌ టెక్నీషియన్‌ శేఖర్‌ అనే వ్యక్తులు పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రి యజమాని డాక్టర్‌ పి. పరమేశ్వరరావును కలిసి విషయం చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కారు డ్రైవర్‌ వినయ్‌కుమార్‌ కిడ్నీ తొలగించేందుకు నిర్ణయించారు. ఆ కిడ్నీని చత్తీస్‌గఢ్‌కు చెందిన చౌహాన్‌ అనే వ్యక్తికి అమర్చేందుకు బేరం

కుదుర్చుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నార్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిది కడప జిల్లాగా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం బృందాలు గాలిస్తున్నాయి. వాస్తవానికి 2019లో వెలుగుచూసిన శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ కేసులో కూడా వెంకటేశ్వరరావు ఏ`4గా ఉన్నారు. జైలులో 40రోజులు గడిపిన తర్వాత మళ్లీ అదే పని చేస్తూ పేదల్ని బలి చేసినట్టు తేలింది. తాము కూడా ఈ ముఠా చేతిలో బలయ్యామని కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు సీపీ త్రివిక్రమ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే డాక్టర్‌ పరమేశ్వరరావు రుణాలు, అనుమతుల కోసం చూస్తున్న సమయంలో ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్‌ను వేరే వైద్యులకు ఓ రోజుకు రూ.60వేలకు అద్దెకిచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వైద్యులు వినయ్‌కుమార్‌కు కిడ్నీ తొలగించి చౌహాన్‌కు అమర్చారు. అయితే ఆ ఇద్దరు వైద్యుల ఆచూకీ కూడా తేలాల్సి ఉందని సీపీ తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇదంతా జరిగిందని, డాక్టర్‌ పరమేశ్వరరావు పాత్రపైనా ఆరా తీశామన్నారు.
కిడ్నీ ఎంతకు విక్రయించారు, అనుమతుల్లేకుండా కిడ్నీ తొలగింపు అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. కాగా, ఆస్పత్రిని ఇప్పటికే వైద్యాధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినయ్‌ను ఆయన బంధువులు బలవంతంగా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లిపోయారు. ఈ విషయమై కేజీహెచ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ సాక్ష్యాల ఆధారంగా సీసీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నామని సీపీ తెలిపారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి మరీ కిడ్నీ తొలగించినట్టు తేల్చారు. ఈ సమావేశంలో డీసీపీ-2 ఆనంద్‌ రెడ్డి, వెస్ట్‌ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img