Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతులకు నిరసన తెలిపే హక్కుంది

రోడ్ల దిగ్బంధనమే సరికాదు : సుప్రీం
రోడ్లను దిగ్బంధించలేదు..అవి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లే : రైతు సంఘాలు

న్యూదిల్లీ`ఘాజీపూర్‌ : సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపే హక్కు అన్నదాతలకు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే నిరసనల పేరుతో రోడ్లను నిరవధికంగా దిగ్బంధించకూడదని సూచించింది. కేంద్రం అన్యాయంగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని దిల్లీలోకి ప్రవేశించే హరియాణా, యూపీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల సరిహద్దుల్లోని రోడ్లపై టెంట్లు వేసుకుని గత ఏడాది కాలంగా తమ నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నదాతలు తమ ఆందోళనల పేరుతో రోడ్లను శాశ్వితంగా దిగ్బందించారని, ఘాజీపూర్‌ బార్డర్‌లోని రోడ్లపై నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం ఎం సుంద్రేశ్‌ల ధర్మాసనం గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అన్నదాతల సమస్యలకు మంచి పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వానికి సూచించారు. వ్యవసాయ చట్టాల విషయంలో దాఖలైన వివిధ పిటిషన్లు కోర్టుల్లో పెండిరగ్‌లో ఉన్నప్పటికీ తమకు జరుగుతున్న నష్టంపై నిరసన తెలిపే హక్కు రైతులకుందని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ రోడ్లను దిగ్బందించడం మాత్రం సరైన విధానం కాదని పేర్కొంటూ రోడ్ల దిగ్బంధనంపై మూడు వారాల్లో సమాధానం చెప్పాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా సంఘాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 7కు వాయిదా వేశారు.
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లే
సుప్రీం కోర్టు ఆదేశాల విషయంలో తమకు భిన్నాభిప్రాయాలు లేవని రైతు సంఘాలు ప్రకటించాయి. తాము సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని బీకూయూ ప్రతినిధి సౌరభ్‌ ఉపాధ్యాయ పీటీఐతో పేర్కొన్నారు. ఘాజీపూర్‌ వద్దనున్న నిరసన స్థలాల వద్ద దిల్లీ పోలీసులే బారికేడ్లను ఏర్పాటు చేశారని అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం దిల్లీ పోలీసులే ఆ బారికేడ్లను తొలగించాలని కూడా తాము డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, రైతులు ఎక్కడా రహదారులను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. రైతులకు బారికేడ్‌ చేసే అధికారం కూడా లేదని పేర్కొన్నారు. ఘాజీపూర్‌లోని దిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే వద్దనున్న రైతుల టెంట్లను తొలగిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొన్నారు. దిల్లీ వైపు ఉన్న సర్వీస్‌ లైన్‌లోని ఉన్న ఒక టెంట్‌ను మాత్రమే తాము తొలగించామని తెలిపారు. కేవలం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌లు మాత్రమే రోడ్లపై ఉన్నాయని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల హక్కు అని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సరిహద్దు నుంచి రైతులు ఎక్కడికీ వెళ్లరని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img