Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వాయిదాల పర్వం

. ఈఏపీసెట్‌ ఇక్కట్లు!
. కౌన్సెలింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తం
. తుదివిడత సీట్ల భర్తీలో గందరగోళం
. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీ ఈఏపీసెట్‌2022 తుది విడత కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకుండా ఈనెల 26నుంచి ఈరోజు, రేపు అంటూ కొనసాగిన వాయిదాల పర్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహనాన్ని పరీక్షించింది. ముందుగా ప్రకటించినట్లుగా ఈనెల 26వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ల కేటాయింపు ప్రకటించాల్సి ఉండగా దానిని 27వ తేదీకి వాయిదా వేశారు. అది కూడా 26వ తేదీ అర్థరాత్రి వరకూ సీట్లు కేటాయింపు ఉంటుందనే ఆశతో విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండగా, చివరి నిమిషంలో వాయిదా వేసినట్లు ప్రకటించారు. 27వ తేదీ కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. రోజంతా విద్యార్థులు ఎదురు చూస్తుండగా, చివరి నిమిషంలో 28వ తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం కూడా మధ్యాహ్నానికి సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. దీంతో మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురయ్యారు. కౌన్సిలింగ్‌ నిర్వహణలో అధికారుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 75వేల మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌కు 30వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఖాళీలున్నట్లు సమాచారం. ఇదే తుది విడత కౌన్సెలింగ్‌ కావడంతో అభ్యర్థులకు ఆశించిన కళాశాల/బ్రాంచీలో సీటు దక్కుతుందా?, లేదా? అనే ఆందోళనతో ఉన్నారు. సీటు రాకుంటే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. తెలంగాణ కంటే, ఏపీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో చాలా మంది ఏపీకి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. వారిలో కొంత మంది ఏపీలో నిర్వహించే రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు వస్తే, అక్కడి సీట్లు రద్దు చేసుకుని ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా మంచి ఇంజినీరింగ్‌ కాలేజీ, బ్రాంచి లభించని విద్యార్థులంతా తుది విడత కౌన్సెలింగ్‌పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఈ సీట్ల పంపిణీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంలో అధికారులు ఘోరవైఫల్యం చెందారు. మూడు రోజులపాటు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ విద్యార్థుల సహనాన్ని పరీక్షించారు. తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు సకాలంలో ముగిసినప్పటికీ, సీట్లు కేటాయింపు, విద్యార్థులకు జాయినింగ్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఆది నుంచి ఉన్నత విద్యామండలి ఇదే ధోరణితో ఉందనే విమర్శలున్నాయి.
కాల్‌ సెంటరుకు వెల్లువెత్తిన ఫోన్‌ కాల్స్‌
ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు జాప్యంతో గురువారం ఉదయం నుంచి ఏపీఈఏపీసెట్‌ కన్వీనర్‌కు విద్యార్థులు పెద్దఎత్తున ఫోన్లు చేశారు. వాయిదా పడిన సీట్ల కేటాయింపు ఎన్ని గంటల తర్వాత ఉంటుందనే దానిపైనా అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
తొలుత ఉదయం 11గంటల తర్వాత సీట్ల కేటాయింపు వివరాలను వెబ్‌సైట్లో పెడతారని విద్యార్థులు ఎదురుచూసి కంగుతిన్నారు. మళ్లీ కాల్‌ సెంటరుకు ఫోన్లు చేయగా, సాయంత్రం 6 గంటల తర్వాత వెబ్‌సైట్లో పొందుపరుస్తామని బదులిచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు వేలాది మంది విద్యార్థులు వెబ్‌సైట్‌ను వీక్షించినా ఫలితం లేదు. ఆ సమయంలో వెబ్‌సైట్‌లో ఎలాంటి తాజా సమాచారం ఇవ్వలేదు. ఏపీఈఏపీసెట్‌ కన్వీనర్‌ సిబ్బంది వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం సర్వర్ల్ల సమస్యతో సిబ్బంది దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇంజినీరింగ్‌ తరగతులు జాప్యం
ఏపీఈఏపీసెట్‌ మలి విడత కౌన్సెలింగ్‌ జాప్యం కారణంగా, సీట్లు పొందిన అభ్యర్థులకు ఇంజినీరింగ్‌ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. రెండో విడత సీట్లు కేటాయించాక, అభ్యర్థులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేసేందుకుగాను తొలుత ఈనెల 26 నుంచి 31వరకు కన్వీనర్‌ గడువు విధించారు. షెడ్యూలు ప్రకారం సీట్ల కేటాయింపు జరగనందున, రెండు రోజులపాటు ఆలసమ్యమైంది. దీంతో రిపోర్టింగ్‌ తేదీలను పొడిగించాల్సి ఉంది. దాని ప్రకారం 2వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమవ్వడం సాధ్యమవ్వదు. దీనికి ఏపీ ఈఏపీసెట్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఉన్నత విద్యామండలి అధికారులు స్పందించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img