Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పేలుడు

. 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
. నలుగురి పరిస్థితి విషమం

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం/ కూర్మన్నపాలెం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శనివారం పేలుడు సంభవించింది. ఎస్‌ఎంఎస్‌- 2 లిక్విడ్‌ విభా గంలో పేలుడు జరగడంతో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్‌ కార్మికులు కాగా, ఐదుగురు ఒప్పంద కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్టీల్‌ ప్లాంట్‌ ఆసుపత్రి కి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. ఫ్లాగ్‌ యాష్‌ ను తొలగించే క్రమంలో వేడి ద్రవం పడడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరికి స్టీల్‌ ప్లాంట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులు వివరాలు ఇలా ఉన్నాయి: అనిల్‌ పహివాల, (డీజీఎం) జయ కుమార్‌, (సీనియర్‌ మేనేజర్‌) ఈశ్వర్‌ నాయక్‌, (టెక్సీనియర్‌ మేనేజర్‌) పాండా సాహో (చార్జ్‌ మాన్‌) బంగారయ్య (కాంట్రాక్ట్‌ వర్కర్‌) సూరిబాబు (కాంట్రాక్ట్‌ వర్కర్‌) అప్పల రాజు (కాంట్రాక్ట్‌ వర్కర్‌) శ్రీను (కాంట్రాక్ట్‌ వర్కర్‌) పోతయ్య (కాంట్రాక్ట్‌ వర్కర్‌). ఎస్‌ఎం ఎస్‌2 లో ప్రమాదం జరిగిన వెంటనే వీరిని విశాఖ జనరల్‌ హాస్పిటల్‌ కి పంపించి ప్రథమ చికిత్స అనంతరం వైజాగ్‌ సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్‌ కి తరలించారు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: సీపీఐ
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి విమర్శించారు. గాయపడిన వారిని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో, ప్రమాదంపై గాజువాక శాసనసభ్యుడు టి.నాగిరెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కార్మిక శాఖ తగిన పర్యవేక్షణ చేయడం లేదని అన్నారు. భద్రతాపరంగా మరింత కట్టుదిట్ట ఏర్పాట్లను చేయడంలో స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం విఫలమైందని విమర్శిం చారు. ప్రమాదాల్లో కార్మికులే ఎక్కువగా బలవుతున్నారని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ని ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రెండేళ్లుగా కార్మికులు దీనికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన పోరాటం చేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో స్టీల్‌ ప్లాంట్‌ లోని వివిధ విభాగాల్లో ఉత్పత్తి కూడా పెంచడం కార్మికుల సమర్థతకు నిదర్శనమని చెప్పారు. అలాంటి ప్లాంటును పరిరక్షించుకోవాల్సింది పోయి ప్రైవేటుపరం చేస్తామంటున్న కేంద్రం ధోరణి సరైనది కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img