Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైసీపీ దూకుడుకు కళ్లెం !

ఏకగ్రీవం ఖాయమన్న దశలో టీడీపీ ట్విస్ట్‌

. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న యోచనలో టీడీపీ
. అసంతృప్తివాదులపై అధికార పార్టీ నిఘా

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీల ఎన్నికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఏకపక్షంగా ఈ ఎన్నికలు సాగుతాయని అధికారపార్టీ భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీకి సన్నద్ధమైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికకు టీడీపీ నుంచి అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది. ఈ విషయంపై గురువారం పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చించారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థిని నిలిపే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీ తరపున 23 మంది శాసనసభ్యులు ఉండగా, వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్‌ జారీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. విప్‌ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని టీడీపీ భావిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ వరకు తుది గడువు. ఇప్పటివరకు టీడీపీకి అవసరమైన శాసనసభ్యుల బలం లేనందున ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా భావించారు. ఆ పార్టీ అధిష్ఠానం కూడా అదే ఆలోచనతో ఉంది.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరపున ఎవరూ నామినేషన్‌ వేయకపోతే 16వ తేదీన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. టీడీపీ పోటీ చేస్తే 23న పోలింగ్‌ జరుగుతుంది. అదే జరిగితే వైసీపీ తమ పార్టీ రెబెల్‌ శాసనసభ్యుల బెడదను ఎదుర్కోవల్సి వస్తుంది. వీరంతా విప్‌ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే పార్టీలో తిరుగుబాటు ఎక్కువయ్యే ప్రమాదముందని వైసీపీ భయపడుతోంది. ఎన్నికల సందర్భంగా వైసీపీ కూడా విప్‌ జారీ చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదవీ త్యాగానికి సిద్ధపడి విప్‌ను ధిక్కరించే అవకాశం లేకపోలేదన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణ రాజుతోపాటు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వంటి వారు బహిరంగంగానే వైసీపీ అధిష్ఠానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే బాటలో మరికొందరు శాసనసభ్యులు అధిష్ఠానంపై అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగే పోలింగ్‌ను ఇటువంటి అసమ్మతివాదులైన వైసీపీ శాసనసభ్యులు సద్వినియోగం చేసుకుంటే రాజకీయ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని వైసీపీ అధిష్ఠానం ఆందోళన వ్యక్తంచేస్తోంది.
తాజా పరిణామాల క్రమంలో వైసీపీ అసమ్మతివాదుల కదలికలపై ఇంటిలిజెన్స్‌ యంత్రాంగం నిఘా పెంచినట్లు సమాచారం. శాసనమండలి సభ్యులు నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీకాలం ఈనెల 29న ముగియనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img