Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సచివాలయ ఉద్యోగులకు షాక్‌ !

ఉచిత వసతి రద్దు చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ
24 గంటల్లో భవనాలు ఖాళీ చేయాలని ఆదేశం
అంతలోనే మరో రెండు నెలలు పొడిగిస్తూ సీఎంవో సర్క్యులర్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ఆ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు వివిధ ప్రాంతాల్లో నాటి ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పించింది. దానిని వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే అకస్మాత్తుగా రేపటిలోగా భవనాలు ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఖాళీ చేసిన ప్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. వాటికి ఎలాంటి నష్టం జరిగినా, మరమ్మతు చేసే పరిస్థితి ఉన్నా సంబంధిత ఉద్యోగులదే బాధ్యత అని ఉత్వర్వులు జారీ చేసింది.
మరో రెండు నెలలు పొడిగింపు
అకస్మాత్తుగా ఉచిత వసతిని రద్దు చేయడంతో పాటు ఈనెల 30వ తేదీలోగా భవనాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎంవో కార్యాలయం స్పందిస్తూ ఉచిత గృహ వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.
ఐదురోజుల పనిదినాలపై స్పష్టత కరవు
ఉచిత వసతిని అకస్మాత్తుగా రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వారికి గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న 5 రోజుల పనిదినాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాల విధానం 2017 నుంచి కొనసాగుతుంది. ఈనెల 27వ తేదీతో ఆ గడువు ముగిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉచిత వసతిని రద్దు చేసిన ప్రభుత్వం, పనిదినాలపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో జులై 2వ తేదీ శనివారం విధులకు హాజరు కావాలా? వద్దా ? అనే సందిగ్ధంలో ఉద్యోగులున్నారు. 24 గంటల్లో భవానాలు ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఏం చేయాలో అర్థంకాక సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img