Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీజనల్‌ వ్యాధులకు యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు : ఐఎంఏ

సీజనల్‌ వ్యాధులకు యాంటీబయాటిక్స్‌ అవసరం లేదు : ఐఎంఏ


హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులకు యాంటీబయాటిక్స్‌ ఔషధాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు సీజనల్‌ వ్యాధులకు యాంటీబయాటిక్స్‌ మందులు ఇవ్వొద్దని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు , వైద్య నిపుణులకు ఐఎంఏ సూచించింది. ఈ మేరకు ఐఎంఏ స్టాండిరగ్‌ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.ఐఎంఏ జారీ చేసిన ఆదేశాల మేరకు.. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమేనని పేర్కొంది. సీజనల్‌ జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని తెలిపింది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పింది. అయితే దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది. రోగులకు యాంటీబయాటిక్స్‌ ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది. లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్‌ అవసరం లేదని స్పష్టం చేసింది.‘ప్రజలు ఇప్పుడు అజిత్రోమైసిన్‌ , ఆమోక్సిసిలిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ఔషధాలను తీసుకుంటున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కొంచెం తగ్గినట్టు అనిపించగానే వాటిని ఆపేయాలి. లేదంటే యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్స్‌ అవసరం ఏర్పడినప్పుడు అవి సమర్థవంతంగా పనిచేయవు’ అని ఐఎంఏ తెలిపింది.అయితే సంబంధిత లక్షణాలు లేనప్పటికీ వైద్యులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ సూచిస్తుండటాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. డయేరియాకు కూడా వైద్యులు యాంటీబయాటిక్స్‌నే ఇస్తున్నారని తెలిపింది. 70 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు/అతిసారం) కేసులు వైరల్‌ వల్ల వస్తున్నవని పేర్కొంది. అమోక్సిసిల్లిన్‌, నార్‌ ఫ్లాక్సాసిల్లిన్‌, సిప్రోఫ్లాక్సాసిల్లిన్‌, ఓఫ్లాక్సాసిల్లిన్‌, లెవోఫ్లాక్సాసిల్లిన్‌.. వీటిని దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రస్తావించింది.వైరల్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ పనిచేయవని పేర్కొంది. ఇందు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రమణ నివారణకు స్వీయ నియంత్రణను పాటించాలని ప్రజలకు సూచించింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఐఎంఏ తన నోటీసుల్లో సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img