Friday, April 26, 2024
Friday, April 26, 2024

హెల్త్‌వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరే ఉంచాలి

. జగన్‌ ప్రభుత్వ నిర్ణయం అవగాహన రాహిత్యం
. పథకాలన్నింటికీ వైఎస్సార్‌, జగన్‌ పేర్లేనా?
. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే
. ఏఐఎస్‌ఎఫ్‌, ఐఎంఏ రౌండుటేబుల్‌ సమావేశంలో వక్తలు
. రాజకీయ, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఖండన
. గవర్నరు, రాష్ట్రపతికి అఖిలపక్షం ఆధ్వర్యంలో విన్నవించాలని నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును యథాతథంగా కొనసాగించేలా ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటే అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో కలిపి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. విజయవాడ బాలోత్సవ్‌భవన్‌లో ఆదివారం ఏఐఎస్‌ఎఫ్‌ఐఎంఏ అధ్వర్యంలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి స్వాగతం పలకగా, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ… సమాజంలో చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, దేశం కోసం త్యాగాలు చేసిన వారున్నారని, వారిని స్మరిస్తూ ప్రభుత్వం పేర్లు పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. ప్రతిదానికీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌ పేర్లను పెట్టుకుంటూ పోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకుపోతే ఎలా అని నిలదీశారు. రాష్ట్రంలోని పథకాలను పరిశీలిస్తే 55 పథకాలకు వైఎస్సార్‌ పేర్లు, మరో 20పథకాలకు జగన్‌ పేర్లు పెట్టారని పేర్కొన్నారు. జగన్‌ సొంత డబ్బులతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఇంత అధ్వాన్నంగా లేదని గుర్తుచేశారు. ఆయన సీఎంగా ఉండగా, తనతోపాటు సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ చేసిన విజ్ఞప్తి మేరకు కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు ఈశ్వరరెడ్డి, ప్రకాశంజిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేర్లు పెట్టారన్నారు. విదేశీ విద్యా దీవెన పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు ఉండగా… జగన్‌ అధికారంలోకి వచ్చాక దానికి జగన్‌ పేరు పెట్టుకున్నారని, ఇంతకంటే నీచమైన పని ఏదైనా ఉంటుందా? అని ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎక్కడ?, నీవెక్కడ ఎక్కడ?, ఏమైనా పోలిక ఉందా? అంటూ ప్రశ్నించారు. ప్రపంచ మేథావి అంబేద్కర్‌ చదివిన పుస్తకాల అట్టలను సైతం జగన్‌ చూసి ఉండరని ఎద్దేవా చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం సరికాదని, ఇప్పటికైనా జగన్‌ విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. అమరావతి ఉద్యమానికి కుల రాజకీయాలు ఆపాదించడాన్ని తప్పుపట్టారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. ఇది జగన్‌ ప్రభుత్వ అవగాహన రాహిత్యమని, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ దిశగా వ్యవహరించిందన్నారు. ఎన్టీఆర్‌ ఒక లెజెండ్‌గా నిలిచారని, తెలుగుజాతి ఘనతను దిల్లీ వరకు తీసుకెళ్లారని కొనియాడారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పెడతామంటూ ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారని, ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చితే ఎలా అని నిలదీశారు. ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ఉద్యమం కొనసాగించే పరిస్థితులు లేవని, అణచివేత ధోరణి కొనసాగుతోందన్నారు. పొరుగునున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ చేస్తున్న కార్యక్రమాల్ని సైతం సీఎం జగన్‌ గమనించాలని సూచించారు. స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుల పేర్లను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. అసలు ప్రజా సమస్యల అజెండాను పక్కదారి పట్టించేందుకే ఈ పేర్ల మార్పిడికి ప్రభుత్వం తెరదీసిందని విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ… నాడు వైద్యరంగాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ హయాంలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇది దేశంలోనే తొలి విశ్వవిద్యాలయమని వివరించారు. ఒక మంచి ఉద్దేశంతో ఆ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టారని, ఇవాళ జగన్‌ అర్ధరాత్రి ఆర్డినెన్స్‌ తెచ్చి దానికి పేరు మార్చడం తగదన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ… జగన్‌ ఎవ్వరికీ భయపడబోరనీ, ఆయన భయపడాలంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావాల్సిందేనన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగించి, వైఎస్‌ఆర్‌ పెట్టడం ఏమిటని నిలదీశారు. గవర్నర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్చుతూ వచ్చిన బిల్లును నిలిపివేయాలని కోరారు. లేకుంటే అన్ని పక్షాలతో ఐక్యంగా ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ… నాడు రాజకీయాల్లో ఎంతో విలవలు, విశ్వసనీయత ఉండేదని, ఇవాళ రాజకీయాలు కులం, మతం, భాషా తత్వంతో కొనసాగుతున్నాయన్నారు. అన్ని పథకాలకు జగన్‌ పేర్లు పెట్టడం సముచితం కాదని, వాటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోతిన వెంకట రామారావు మాట్లాడుతూ… దేవాలయాల లాంటి విశ్వవిద్యాలయాలకు పేర్లు మార్చడం తగదన్నారు. సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయాల కులపతులు విజ్ఞతను కోల్పోయి, అధికార పార్టీకి దాసోహంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.450కోట్ల నిధులను జగన్‌ ప్రభుత్వం తీసుకుని, స్నాతకోత్సవానికి సైతం నిధులు లేకుండా చేసిందన్నారు. డీఎంఈని అడ్టుపెట్టుకుని బదిలీల పేరిట కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమావేశం తీర్మానించింది. ఎన్టీఆర్‌ పేరు యథాతథంగా కొనసాగించాలని గవర్నరుకు అఖిలపక్షం విన్నవించాలని నిర్ణయించింది. గవర్నరు స్పందించకుంటే దిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి కలవాలని సమావేశంలో తీర్మానించారు.. సమావేశానికి అధ్యక్షత వహించిన జాన్సన్‌బాబు మాట్లాడుతూ… వైద్యరంగాభివృద్ధికి కీలకంగా ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిలిచిందని, ఇప్పుడు దానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌గా పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రమణ, ఐఎంఏ విజయవాడ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రషిక్‌ సాంగ్వీ, విజయవాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ కె.రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పేరు యథాతథంగా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, ఏఐఎస్‌ఎఫ్‌ విజయవాడ నగర కార్యదర్శి సాయికుమార్‌, అయ్యప్ప, మధు, చందు, ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ నగర అధ్యక్షుడు సోమేశ్వరరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు చరణ్‌సాయి, శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్‌, ఇఫ్ట్యూ నుంచి రవీంద్ర, తెలుగు యువత నుంచి నాగూర్‌, ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాకేష్‌, వివిధ విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img