Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

50 శాతం పన్నుచెల్లించలేం

జీవో నంబర్‌ 5, 6 రద్దు చేయాలి
విజయవాడ ఏటీఏ అధ్యక్షుడు రాజనాల బాబ్జీ డిమాండ్‌
జవహర్‌ ఆటోనగర్‌ బంద్‌ విజయవంతం

విశాలాంధ్ర`విజయవాడ : నగరాల్లో ఉన్న ఆటోనగర్‌లను కమర్షియల్‌ ప్రాంతాలుగా గుర్తిస్తూ వ్యాపారులు 50 శాతం పన్ను చెల్లించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 5, 6 తక్షణమే రద్దు చేయాలని విజయవాడ జవహర్‌ ఆటోమొబైల్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌(ఏటీఏ) రాజనాల వెంకటరమణారావు(బాబ్జీ) డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తాము 50 శాతం పన్నులు చెల్లించలేమని ఆయన స్పష్టంచేశారు. జీవో నంబర్లు 5, 6 రద్దు చేయాలని కోరుతూ గురువారం నగరంలోని జవహర్‌ ఆటోనగర్‌ బంద్‌ నిర్వహించారు. ఆటోనగర్‌లోని వ్యాపారులు, కార్మికులు తమ కార్యకలాపాలు నిలిపివేసి బంద్‌ను జయప్రదం చేశారు. ఆటోనగర్‌లోని ఏటీఏ హాలు నుంచి ఏపీఐఐసీ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీగా వెళ్లి జీవో నంబర్లు 5, 6 రద్దు చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాబ్జీ, ఏటీఏ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆటోనగర్‌ ప్రారంభించినప్పుడు నగరానికి శివారు ప్రాంతంలోనే ఉందని చెప్పారు. ఇటీవల నగర విస్తరణ వల్ల ఆటోనగర్‌ కలిసిపోయిందని తెలిపారు. తాము ఉచితంగా స్థలాలు పొందలేదని, కొనుగోలు చేశామని, దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్నామని, క్రమంగా ఆటోనగర్‌ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అసియాలోనే ప్రసిద్ధి పొందిన జవహర్‌ ఆటోనగర్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది వరకు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రెండేళ్లుగా కరోనా వల్ల ఆటోనగర్‌లో పనులు లేక వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ తరుణంలో 50 శాతం పన్ను చెల్లించాలని ఆదేశించడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లేకపోతే 50 శాతం పన్ను చెల్లించలేక వ్యాపారాలు మూసివేసే ప్రమాదం ఉందని, కార్మికులు ఉపాధి కోల్పోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏటీఏ కార్యదర్శి రావి రామచంద్రరావు, ఐలా చైర్మన్‌ దుర్గాప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు, క్లచ్‌ అండ్‌ బ్రేక్‌ వర్కర్స్‌ యూనియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లంక దుర్గారావు, టైర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు బాబా హుస్సేన్‌ రిజ్వాన్‌, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img