Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రాయిదాడి కేసులో నిందితుడి అరెస్టు

. 14 రోజుల రిమాండ్‌
. సీఎం జగన్‌పై హత్యకు కుట్ర జరిగిందన్న పోలీసులు

విశాలాంధ్రబ్యూరో-అమరావతి: వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సతీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సతీశ్‌ ఏ1గా ఉన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెకాలనీకి చెందిన సతీశ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదోపవాదనల అనంతరం సతీశ్‌ కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అంతకుముందు సతీశ్‌కు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పోలీసులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కట్టుదిట్ట భద్రత నడుమ కోర్టులో న్యాయవాది ముందు ప్రవేశపెట్టారు. ఇదే కేసులో కొందరు యువకులను పోలీసులు విచారించారు. ఇందులో టీడీపీ సానుభూతి పరుడైన దుర్గారావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు సతీశ్‌కు ఈయన సహకరించినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దుర్గారావు వెనకున్న రాజకీయ నేపథ్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. అన్ని ఆధారాలు, కాల్‌ డేటా ఆధారంగా సతీశ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సీఎం జగన్‌ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని...అందుకే సున్నిత ప్రాంతమైన సీఎం కణితిని లక్ష్యంగా చేసుకుని పక్కా వ్యూహంతో దాడి చేశారంటూ రిమాండ్‌ రిపోర్ట్‌ లో తెలిపారు. లభ్యమైన ఆధారాలతో ఏ1గా సతీశ్‌ పై కేసు పెట్టి… 12 మంది సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశామని వివరించారు. ఈ నెల 13వ తేదీన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ వివేకానంద స్కూల్‌ దగ్గర బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరడంతో ఆయనకు కణితి వద్ద గాయమైంది. ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి సైతం గాయమైంది. దీంతో వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఎస్పీతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా ఏర్పాటు చేశారు. సీఎంపై దాడి జరిగిన ప్రాంత సమీపంలోని వివేకానంద స్కూల్‌, గంగానమ్మ గుడి దగ్గర నుంచి నమోదైన ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించి అధ్యయనం చేశారు. అంతకుముందు 15 రోజుల కాల్‌డేటాను కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వీడియో దృశ్యాలను తిలకించారు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రోన్లను ఎగురవేసి అధ్యయనం చేశారు. అనంతరం 50 మందికిపైగా స్థానికులను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, వారి నుంచి సమగ్ర సమాచారం సేకరించారు. కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారాన్ని దర్యాప్తులో క్రోడీకరించారు. దీంతోపాటు సీఎం దాడి కేసులో తగిన సమాచారం, ఆధారాలతో కూడిన వీడియోలు పంపిన వారికి రూ.2లక్షల బహుమతిని కూడా ఎన్టీఆర్‌జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ క్రాంతి రాణా నివేదించారు.
కోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
తొలుత పోలీసుల అదుపులో ఉన్న యువకుల తరపున వారి కుటుంబ సభ్యులు విజయవాడ కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేశారు. తమ కుమారుల ఆచూకీి తెలపాలని కోరారు. సీఎం జగన్‌పై రాయిదాడి కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం మూడు రోజుల క్రితం అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఈ యువకులను పోలీసులు తీసుకెళ్లారు. ఇంతవరకు వారిని ఇంటికి పంపకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ స్థానికులతో కలిసి నిరసనకు దిగారు.వివిధ పోలీస్‌స్టషన్లకు వెళ్లినప్పటికీ, ఎక్కడా వారి ఆచూకీ తెలియకపోవడంతో తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయానికి సతీశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే సతీశ్‌, దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో సీఎంపై రాయి దాడిని సతీశ్‌ చేయలేదని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img