Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

భానుడి భగభగ

. అసాధారణరీతిలో పెరిగిన ఉష్ణోగ్రతలు
. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
. మరో మూడురోజులు వడగాలులు
. వాతావరణశాఖ హెచ్చరిక

విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంది. ఏప్రిల్‌ గడవకుండానే రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సూర్య తాపానికి విలవిల్లాడిపోతున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిరచారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. అలానే కోస్తా తీరానికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతాయని, వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. బుధవారం వైఎస్సార్‌ కడప జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో గురువారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒంటిపూట బడికి వెళుతున్న విద్యార్థులు నీరసిస్తున్నారు. పాఠశాలల్లో ఫ్యాన్లు లేక… ఉన్నా వేడి గాలికి చిన్నారులు తరగతి గదుల్లో ఉండలేక పోవడంతో పాటు మధ్యాహ్నం వేళ పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేసరికి సొమ్మసిల్లిపోతున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే వారు ముఖానికి రుమాళ్లు కట్టుకుని… టోపీలు ధరించి వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడే వారు, గర్భిణులు ఎండలకు అల్లాడిపోతున్నారు. నవజాత శిశువుల సంరక్షణ క్లిష్టంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి జనరల్‌ వార్డులో రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. బీపీ, సుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు నోరు తడారి పోవటంతో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇంతలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందున్నారు. ఎండల కారణంగా మజ్జిగ, చెరుకు రసం, పండ్ల రసాలు, , కొబ్బరి బొండాలు, ఐస్‌క్రీమ్‌లు, ఇతర శీతల పానియాలకు గిరాకీ పెరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేడిగాలి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆరు గంటల తరువాత పిల్లల్ని బయటకు తీసుకువచ్చి సోడాలతో ముఖం కడిగి, శీతల పానీయాలు తాగిస్తున్నారు. ఎండలకు అన్ని వ్యాపారాలు అంతంతమాత్రంగానే నడుస్తున్నారు. ఎండలకు కూరలు పాడైపోతాయని తక్కువ మొత్తంలో తయారు చేస్తున్న కారణంగా కర్రీపాయింట్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకే మూసేస్తున్నారు. కోడిగుడ్లు, పాలు, ఇంధనాలు రవాణా చేసే వాహనాలు మధ్యాహ్నం వేళ రోడ్లపైకి రావడంలేదు. గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు ఎండకి తట్టుకోలేకపోతున్నారు. కంపెనీల్లో మధ్యాహ్నం షిప్టుల్లో విధులకు వెళ్లే కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమితో అధిక విద్యుత్‌ వినియోగం కారణంగా షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి తరుచు అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇళ్లల్లో ఏసీలు వేసుకున్న వారు విద్యుత్‌ లోడ్‌ పెరిగి తరచూ ట్రిప్‌ కావటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల కారణంగా ఏదైనా అనార్యోగం సంభవిస్తే తాత్కాలిక ఉపశమం కోసం చిట్కాలు పాటించినా… వైద్యుల సలహామేరకు నడుచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారంపై ఎండల ప్రభావం అధికంగా ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభించి పది గంటలకు ప్రచారం ముగిస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు ఎక్కడ నీడ కనబడితే అక్కడ కాసేపు ఆగుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇళ్లల్లో పనులు చేసుకునే సమయం, తాగునీరు సరఫరా అయ్యే సమయం కావటంతో ప్రజలు అభ్యర్థులకు ముక్తసరిగా సమాధానం ఇస్తున్నారు. ఠీవీగా ఖద్దరు దుస్తులు ధరించి ప్రచారంలో పాల్గొంటున్న నాయకులు ఎండలో చెమటోడ్చాల్సి వస్తోంది. రోడ్లపైకొచ్చిన కొద్దిసేపటికే ఎండ వేడికి వీరి రూపురేఖలు మారిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img