Friday, November 1, 2024
Friday, November 1, 2024

నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటీషన్‌పై విచారణ

ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత బెయిల్ పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. దీంతో, నేడు సుప్రీం లో జరిగే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే కవిత పిటీషన్ పై జస్టిస్ విశ్వనాధ్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారించనుంది. దాదాపుగా అయిదు నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15 వతేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. కవితకు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుధీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత ఆరోగ్యం జైలులో పూర్తిగా దెబ్బతినిందని, పదకొండు కిలోల బరువు తగ్గారని కూడా ఆమె తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. సిసోడియాకు బెయిల్ రావటంతో కవిత విషయంలో కోర్టు బెయిల్ ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో, సుప్రీం నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img