Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

యశ్వంత్‌కు మద్దతుపై కేటీఆర్‌ వివరణ ఇదీ!

న్యూదిల్లీ/హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు తెలంగాణలో పాలక టీఆర్‌ఎస్‌ సోమవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు స్పష్టంచేశారు. యశ్వంత్‌సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో ఐటీ మంత్రి కూడా అయిన కేటీఆర్‌ పాల్గొన్నారు. కేటీఆర్‌ వెంట ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు, ఇతర నాయకులు ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హాకు మద్దతివ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయించారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తమ పార్లమెంటు సభ్యులతో పాటు తాను కూడా యశ్వంత్‌సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల రక్షణ కోసం తాము యశ్వంత్‌సిన్హాకు మద్దతిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ రావాల్సిందిగా సిన్హాను ఆహ్వానించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న 8 ప్రభుత్వాలను కూల్చివేసిందని మండిపడ్డారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ప్రశ్నించగా ‘నాయకురాలిగా ఆమెను మేము గౌరవిస్తాం. అయితే, 2006 జనవరి 2న ఆమె మంత్రిగా ఉన్నసమయంలో ఒడిశాలోని కళింగనగర్‌లో 13మంది గిరిజనులను దారుణంగా చంపారు. ఆ సమయంలో కనీసం ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని గుర్తు చేశారు. తెలంగాణలో గిరిజనులకు సంబంధించిన అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి ఆమె మద్దతిస్తారా అని ప్రశ్నించారు. గిరిజనులకు ఇప్పుడు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరుతూ స్వయంగా తాము అసెంబ్లీలో చట్టం చేశామని, రాష్ట్ర ప్రతిపాదనకు ఓ గిరిపుత్రిక మద్దతు ఇస్తారా నిలదీశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి తాము ఎంతో ఇచ్చామని, తమకు కేంద్రం ఏమిచ్చిందో స్పష్టంచేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని ఒక్క హామీ అమలు చేయాలని విమర్శించారు. బీజేపీని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. గిరిజన యూనివర్శిటీని ఎందుకివ్వలేదని మోదీ సర్కారును ప్రశ్నించారు. తామిచ్చిన దానికన్నా కేంద్రం తమకు పైసా ఎక్కువ ఇస్తే మంత్రి పదవికి ఇక్కడే రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కేంద్రం దేశాన్ని మోసం చేస్తోందన్నారు. అంబేద్కరు రాజ్యాంగం కన్నా మోదీ రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తున్నారని విమర్శించారు.

(Story: యశ్వంత్‌కు మద్దతుపై కేటీఆర్‌ వివరణ ఇదీ!)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img