Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హోదాపై మోదీ మోసం

. చంద్రబాబు, జగన్‌ పాలనలో రాష్ట్రం అథోగతి
. విభజన హామీల సాధనలో విఫలం
. అనంత సభలో మల్లికార్జున ఖడ్గే విమర్శ
. బీజేపీ, టీడీపీ, వైసీపీని ఓడిద్దాం: షర్మిల

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం : ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా విమర్శించారు. ఇండియా కూటమిలో భాగంగా అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన న్యాయసాధన సభకు ఖడ్గే, షర్మిల, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు, మాజీమంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఖడ్గే మాట్లాడుతూ ఐదేళ్లు చంద్రబాబు, మరో ఐదేళ్లు జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారని, ఇద్దరూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించడంలో ఘోరంగా విఫల మయ్యారని విమర్శించారు. హోదా ఇవ్వక పోవడంతో పరిశ్రమలు రాలేదని, దీంతో నిరుద్యోగం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌ బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాకు చరమగీతం పాడారన్నారు. హోదాతోపాటు విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కడప స్టీల్‌ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ వంటి హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం జగన్‌, చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని అసహనం వెలిబుచ్చారు. బీజేపీకి టీడీపీ, వైసీపీ తొత్తులుగా మారాయన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతుంటే…జగన్‌ లోపాయికారిగా అండగా నిలుస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే…రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదని చెప్పారు.
షర్మిల మాట్లాడుతూ ఒక్క రాజధాని కట్టలేని సీఎం జగన్‌ మూడు రాజధానులు కడతానని నమ్మబలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యపానం నిషేధం హామీ ఇచ్చిన జగనన్న…ఆ మాట మరిచి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. కల్తీ మద్యం తాగి 25 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో ఓ వైపు అభివృద్ధి…మరో వైపు సంక్షేమం పరుగులు తీశాయని, జగనన్న పాలనలో అవి మచ్చుకు కూడా కనిపించడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా రాజశేఖర్‌రెడ్డి పాలన సాగిందని షర్మిల గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పేదరిక నిర్మూలన ప్రధాన అజెండాగా పాలన సాగిస్తుందని, ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీ అని, ఇందిరమ్మ అభయమని ప్రజలకు హామీ ఇచ్చారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రాజ్యాన్ని కూల్చేయాలని, రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ, టీడీపీ, వైసీపీలను తరిమికొట్టాలని, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సభలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, వేలసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img