Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉద్యమాలపై ఉక్కుపాదం

పార్లమెంటులో నిరసనలు, ధర్నాలపై నిషేధం
వర్షాకాల సమావేశాల ముందు రాజ్యసభ తాజా సర్క్యులర్‌
ప్రజాస్వామిక హక్కుల హరణ: విపక్షాల ఆగ్రహం

న్యూదిల్లీ: ‘అన్‌పార్లమెంటరీ’ వివాదం చల్లారకముందే మోదీ సర్కారు మరొక అస్త్రాన్ని విపక్షాలపై ప్రయోగించింది. పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను నిషేధించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌ శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈనెల 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో లోక్‌సభ సెక్రటేరియట్‌ అమర్యాదపూర్వక పదాల పేరుతో గందరగోళం సృష్టించగా రాజ్యసభ సెక్రటేరియట్‌ ఆందోళలను నిషేధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామిక, రాజకీయబద్ధ హక్కులను హరిస్తోందని, ప్రజాస్వామ్య గొంతుక నులిపివేస్తోందని విమర్శించాయి. తాజా సర్క్యులర్‌కు అనుగుణంగా ఎంపీలంతా సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోదీ పేర్కొనడం విపక్ష సభ్యులకు కోపం తెప్పించింది. ఒకవైపు నిరంకుశంగా ఆదేశాలు జారీచేస్తూ వాటికి సహకరించాలంటూ విన్నపాలా అని మండిపడ్డారు. పార్లమెంటులో వినియోగించకూడని పదాలంటూ సంకలనాన్ని లోక్‌సభ, ఇప్పుడు ధర్నాలపై నిషేధం అంటూ రాజ్యసభ ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ ప్రధాన విప్‌ జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ మాధ్యమంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘విశ్వగురు తాజా నాటకం ‘ధర్నా మనా హై (నిషేధం)’! అని వాఖ్యానించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ స్పందిస్తూ ‘ప్రజాస్వామ్య గొంతుకను, భారతదేశ ఆత్మను నలిపేస్తున్నారు’ అని ట్విట్టర్‌ ద్వారా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం ఎంత పనికిరానిదో దాని చర్యలు కూడా అంతే పనికిరానివిగా ఉన్నాయని, పాలకపక్షంలోని భయానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. నియంతృత్వంగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపడం ఎంపీలకు ఉన్న రాజకీయ హక్కు.. దీనిని హరించలేరని ఏచూరి హిందీలో మరొక ట్వీట్‌ చేశారు. ఈ సర్క్యులర్‌పై రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆర్జేడీ నేత మనోజ్‌ రaా డిమాండు చేశారు. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దీనిపై లోక్‌సభ, రాజ్యసభ సభాపతులు తక్షణమే జోక్యం చేసుకోవాలి’ అని ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. ‘ఇక పార్లమెంటులో ప్రశ్నలు అడగరాదంటారా? ఇలా అడగడం ‘అన్‌పార్లమెంటరీ’ (అమర్యాదపూర్వకం) కాదు కదా!’ అంటూ శివసేన నేత ప్రియాంక చతుర్వేది వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, ధర్నాలను ప్రతిపక్షాలు చేసే విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img