Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

విద్యుత్‌ ఉద్యోగుల రణన్నినాదం

దేశవ్యాప్తంగా విధుల బహిష్కరణ
ఉద్యోగులు, ఇంజినీర్ల ధర్నాలు, ప్రదర్శనలు
విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
ప్రైవేటుకు దోచిపెట్టడానికేనని ఏఐపీఈఎఫ్‌ విమర్శ

న్యూదిల్లీ: విద్యుత్‌ ఉద్యోగులు రోడ్డెక్కారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు`2022కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు సోమవారం పనులు నిలిపివేశారు. ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు చేపట్టారు. విద్యుత్‌ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని నినదించారు. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. విద్యుత్‌ బిల్లుపై ఉద్యోగులు, ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అఖిలభారత విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్‌) తెలిపింది. కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి ఆర్‌కే సింగ్‌ విద్యుత్‌ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై విస్తృత సంప్రదింపుల కోసం ఇంధనంపై పార్లమెంటరీ స్థాయీసంఘానికి పంపాలని స్పీకర్‌కు మంత్రి విన్నవించారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఏఐపీఈఎఫ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యుత్‌ వినియోగదారులకు సబ్సిడీలన్నీ ఎత్తివేయడానికి మోదీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఏఐపీఈఎఫ్‌ విమర్శించింది. రైతులు, పేదలు, అట్టడుగువర్గాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. బిల్లుపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి గతవారం సమాఖ్య లేఖ రాసింది. బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేసింది. ‘విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు విధులు నిలిపివేశారు. ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు’ అని ఏఐపీఈఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.
‘పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. విధులు బహిష్కరించారు. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా విద్యుత్‌ సవరణ బిల్లు తీసుకొచ్చింది’ అని ఏఐపీఈఎఫ్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే ఆ ప్రకటనలో విమర్శించారు. ప్రస్తుత రూపంలో ఉన్న విద్యుత్‌ సవరణ బిల్లు`2022ను ఉపసంహరించుకోవాల్సిందేనని విద్యుత్‌ ఇంజినీర్లు డిమాండ్‌ చేస్తున్నారని, ఒకవేళ మంకుపట్టుతో కేంద్రం బిల్లు తీసుకువస్తే…దానిని స్టాండిరగ్‌ కమిటీకి పంపాలని దూబే స్పష్టంచేశారు. బిల్లుపై భాగస్వాములందరితో ప్రత్యేకించి విద్యుత్‌ వినియోగదారులు, విద్యుత్‌ కార్మికులతో సంప్రదింపులు జరపాలని, అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం వారికి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు, ఇతర భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకుండా విద్యుత్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఐక్య కిసాన్‌ మోర్చాకు రాసిన లేఖలో హామీ ఇచ్చినట్లు విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య గుర్తు చేసింది. అయినా బిల్లుపై భాగస్వాములు, వినియోగదారులు, విద్యుత్‌రంగ ఉద్యోగ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు జరపలేదని విమర్శించింది. మోదీ ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిందని తెలిపింది. ఒకేప్రాంతంలో ఒకదానికన్నా ఎక్కువ విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు లైసెన్సులు కట్టబెట్టేలా విద్యుత్‌ సవరణ బిల్లులో నిబంధన ఉందని సమాఖ్య వివరించింది. దీనిద్వారా ప్రభుత్వరంగ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ప్రైవేట్‌ రంగానికి చెందిన కొత్త పంపిణీ కంపెనీలు విద్యుత్‌ సరఫరా చేస్తాయని పేర్కొంది. సామాన్యులు, రైతులకు నష్టం కలిగించే అనేక నిబంధనలు బిల్లులో పొందుపరిచారని, ప్రైవేట్‌రంగ విద్యుత్‌ సంస్థలకు లాభాలు కట్టబెట్టేందుకు మోదీ సర్కారు బిల్లు తీసుకొచ్చిందని విమర్శించింది. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి లాభదాయక పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని, ఇది కూడా ప్రైవేట్‌ కంపెనీల అభిష్టానికి అనుగుణంగానే ఉంటుందని తెలిపింది. బిల్లు ప్రకారం విద్యుత్‌ సరఫరా నిర్వహణ బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని, ఆదాయం మాత్రం ప్రైవేట్‌ కంపెనీలకు వస్తుందని విమర్శించింది. ఫలితంగా ప్రభుత్వ కంపెనీలు ఆర్థికంగా దివాలా తీస్తాయని వెల్లడిరచింది.
మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం సబ్సిడీలు, క్రాస్‌ సబ్సిడీలు రద్దవుతాయి. అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తారని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు 7.5 హార్స్‌ పవర్‌ పంపు సెట్‌ను రైతు ఆరు గంటలు ఉపయోగిస్తే నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గృహవినియోగదారులపైనా ఇదే విధంగా భారం పడుతుంది. ఈ బిల్లు వల్ల ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఇంజినీర్ల సమాఖ్య స్పష్టంచేసింది.
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని దూబె స్పష్టంచేశారు. బిల్లును అడ్డుకోవడానికి విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో పనులను బహిష్కరించారని, పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారని వివరించారు. హైదరాబాద్‌, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, విజయవాడ, లక్నో, పటియాల, డెహ్రాడూన్‌, సిమ్లా, జమ్ము, శ్రీనగర్‌, చండీగఢ్‌, ముంబై, కోల్‌కతా, పూనె, వదోదర, రాయ్‌పూర్‌, జబల్పూరు, భోపాల్‌, రాంచి, గువహతి, షిల్లాంగ్‌, పాట్నా, భువనేశ్వర్‌, జైపూర్‌ సహా అనేక కేంద్రాల్లో ఉద్యోగులు ఆందోళనలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img