Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఆత్మరక్షణలో మోదీ సర్కారు

నాకు కులం ఆపాదిస్తారా?
నారాయణ ఆగ్రహం
అమర్‌రాజాపై కక్షసాధింపు తగదు : రామకృష్ణ

తిరుపతి : మోదీ సర్కారు ఆత్మరక్షణలో పడిరదని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఉపఎన్నికల నిర్వహణపై అభిప్రాయ సేకరణ పేరుతో నాటకాలు ప్రారంభించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వస్తున్న వ్యతిరేకత నుండి బయటపడడానికి కేంద్రం అనేక కుయుక్తులు పన్నుతోందని, ఇందుకు ఎన్నికల సంఘానికి నిస్సిగ్గుగా ఉపయోగించుకుంటున్నదని నారాయణ విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో డొల్లతనం కనిపిస్తోందన్నారు. రైతులకు సబ్సిడీలు తీసివేసి డబ్బులు బ్యాంకు ఖాతాలో వేశానంటూ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో విచారిస్తే లొసుగులు బయటకు వస్తాయన్నారు. రాజకీయ పోరాటానికి సైతం కులాన్ని ఆపాదించడం సిగ్గుచేటని వైసీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన రాజకీయ ప్రస్థానం గురించి భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు తెలుసునని, కుల రాజకీయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో కలిసి అనేక ఉద్యమాలు సాగించి నాడు టీడీపీని ఓడిరచింది తాము కాదా అని ప్రశ్నించారు. 16 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న అమర్‌ రాజా ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేయడం ద్వారా మూసివేతకు ప్రయత్నించడం దారుణమన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పడలేదన్నారు. అమర్‌ రాజా ఫ్యాక్టరీని కాలుష్యం పేరుతో వేధించడం, మూసివేయాలనుకోవడం వైసీపీ ప్రభుత్వ మూర్ఖత్వమన్నారు. ఏ ప్రభుత్వమైనా కొత్త పరిశ్రమల కోసం ఆరాటపడుతుందని, సీఎం జగన్‌ అందుకు భిన్నమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు..ఎంపీలను కూడా గెలిపించండి..విభజన హామీలు సాధిస్తామన్న సీఎం జగన్‌…కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి ఎందుకు పోరాటం సాగించలేదని ప్రశ్నించారు. ఒక్క ఎంపీ కూడా ప్రధాని మోదీని నిలదీసిన సందర్భం లేదన్నారు. రాష్ట్రంలో మద్యనిషేధం అని చెప్పి మద్యం మొత్తాన్ని టోకుగా అమ్మేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ కల్పనలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి పేరుతో వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 17వ తేదీన జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, గురవయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img