Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇంటర్‌ వెయిటేజీతో ఈఏపీసెట్‌కు గిరాకీ

. ఐఐటీ, నిట్‌లో సీటు రాకుంటే వెనక్కి
. ప్రైవేట్‌ వర్సిటీ ఇంజినీరింగ్‌ సీట్లపై దృష్టి
. మే 15 నుంచి ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ పరీక్షలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీ ఈఏపీసెట్‌కు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈఏపీసెట్‌)2023 ర్యాంకింగ్‌లో రెండు సంవత్సరాల (ప్రథమ, ద్వితీయ) ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని నిర్ణయించింది. దీంతో ఇంటర్‌ ద్వితీయ విద్యార్థులంతా పరీక్షలలో వారి మార్కుల సాధన కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత ఈఏపీసెట్‌లో మార్కుల సాధన కోసం ప్రయత్నిస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌లో ర్యాంకులు సాధించి ఐఐటీ, నిట్‌లలో సీట్లు రాని వారంతా డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్‌ సీట్లపైనే కన్నేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలను రాస్తున్నారు. కరోనా కారణంగా రెండు విద్యా సంవత్సరాలపాటు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించారు. పూర్తి స్థాయి సిలబస్‌తో పరీక్షలు సజావుగా జరగకపోవడం, దానికితోడు విద్యార్థులు పూర్తిగా సిలబస్‌పై దృష్టి కేంద్రీకరించనందున మార్కులను మినహాయించారు. 202324 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో చేరే కన్వీనర్‌ కోటా విద్యార్థులందరికీ ఈఏపీసెట్‌2023 తప్పనసరిగా అర్హత సాధించాలి. ఈఏపీసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతంతో అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు.
ఐఐటీ, నిట్‌ రాకుంటే… ఈఏపీసెట్‌ వైపే
జేఈఈ(మెయిన్స్‌), అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి, ఆ తర్వాత ఐఐటీ, నిట్‌లలో సీట్లు సాధించలేక పోయిన వారంతా ఏపీ ఈఏపీసెట్‌పైనే దృష్టి పెడుతున్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలోని నాలుగు పేరొందిన ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్‌ ద్వారా కన్వీనర్‌ కోటా కింద 35 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. ఈ సీట్లను పూర్తిగా ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కన్వీనర్‌ కోటా ద్వారా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన అర్హులైన వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. దీంతో నాలుగు ఐఐటీ, నిట్‌లో సీటు సాధించని వారంతా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలపై మొగ్గు చూపుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి జేఈఈ (మెయిన్స్‌) సెకండ్‌ సెషన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 18 వరకు వాటిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు ఏపీ నుంచి దాదాపు లక్షా 50 వేల మంది హాజరవుతున్నారు. రాష్ట్రంలోని 25 పట్టణాల్లో ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తున్నారు.
నాలుగేళ్ల నుంచి కౌన్సెలింగ్‌ ఆలస్యమే
నాలుగేళ్ల నుంచి ఏపీలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ఆలస్యంగా పూర్తవుతోంది. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు ఏపీ అభ్యర్థులు తరలిపోతున్నారు. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యాక… గత ఏడాది జులై తర్వాత ఏపీలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఫార్మసీ, అగ్రికల్చర్‌ ప్రవేశాలు ఇంకా ఆలస్యమయ్యాయి. ఈ జాప్యంతో అప్పటికే కొంత మంది విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ ద్వారా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సీట్లు పొందారు. మరికొందరు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో యాజమాన్య కోటాలో సీట్లు కైవసం చేసుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌ జాప్యంతో విద్యార్థులు తీవ్ర నష్టానికి గురయ్యారు. వేలాది ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోవడంతో అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి నష్టం వాటిల్లింది.
15 వరకు ఏపీఈఏపీసెట్‌ దరఖాస్తులు
ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీతో ముగియనుంది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్షలను వరుస వారీగా ఈనెల 15వ తేదీ నుంచి 23 వరకు జరుగుతాయి. ఓసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 చొప్పున నిర్దేశించారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30వ తేదీ వరకు, రూ.1000 అపరాధ రుసుముతో మే 5 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు ఏపీఈఏపీసెట్‌కు దరఖాస్తులు స్వీకరణకు గడువు విధించారు.
మే 15 నుంచి 23 వరకు ఏపీఈఏపీసెట్‌ పరీక్షల షెడ్యూలు ఉంది. ఆ తర్వాత ఫలితాలు వచ్చేసరికి మరో రెండు వారాలు పడుతుంది. జూన్‌ వరకు ఈఏపీసెట్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరమూ జూన్‌`జులైలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబోయే విద్యా సంవత్సరానికి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img