Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉద్యోగాలు, నల్లధనంపై మాట్లాడరేం?

మోదీకి రాహుల్‌గాంధీ ప్రశ్న
హోషియార్పూర్‌: మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో నిరుద్యోగం, నల్లధనం గురించి నోరు విప్పడం లేదని చెప్పారు. రాహుల్‌గాంధీ సోమవారం ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ మోదీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలంతా ఇబ్బందులు పడితే ఇద్దరు, ముగ్గురు కోటీశ్వరులకు మాత్రం లబ్ధి చేకూర్చిందని రాహుల్‌ అన్నారు. దేశ సంపదను సంపన్నులకు దోచిపెట్టడానికే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీకి పేదరికం గురించి బాగా తెలుసునని చెప్పారు. పేదలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారుల కోసమే చన్నీ పనిచేస్తారని తెలిపారు. బిలియనీర్లకు దోచిపెట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. ‘మన ముందు పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. మీరు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. నేడు దేశంలోనూ, ప్రతిరాష్ట్రంలోనూ నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉద్యోగం, ఉపాధి లభించడం కష్టమైంది. దీనిని పరిష్కరించడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తాం’ అని రాహుల్‌ ప్రజలకు వివరించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసమే పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు నాడు మోదీ ప్రభుత్వం పదేపదే చెప్పిందని, కానీ ఆ పేరుతో చిన్నచిన్న వ్యాపారులు, రైతుల నుంచి డబ్బు లాక్కొని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లకు పంచిపెట్టిందని రాహుల్‌ విమర్శించారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తానని మోదీ తన ప్రసంగాల్లో చెప్పారని గుర్తు చేశారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారని, ఆ ఉద్యోగాలు మీకెవరికైనా వచ్చాయా అని ప్రజలను రాహుల్‌ ప్రశ్నించారు. ఇప్పుడు ఉద్యోగాల గురించి, నల్లధనం గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఆప్‌పైనా రాహుల్‌ విమర్శలు చేస్తూ పంజాబ్‌ గురించి ఆ పార్టీకి అవగాహన లేదన్నారు. రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడలేదని చెప్పారు. పంజాబ్‌ గురించి కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసునని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపే సత్తా కాంగ్రెస్‌కే ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేయదని, అలా చేసేదే అయితే పంజాబ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడదని చెప్పారు. తమ ప్రభుత్వలకు అనుకూలమైనదని, అందుకే వారికి అండగా నిలిచిందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img