Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

ఏఐ రాజధానిగా అమరావతి

. సహకరించాలని సత్య నాదెళ్లకు లోకేశ్‌ వినతి
. యాపిల్‌ వైస్‌ చైర్మన్‌`అడోబ్‌ సీఈవోతోనూ చర్చలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృత్రిమ మేధ (ఏఐ) రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇందుకోసం ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సహకారాన్ని కోరారు. రెడ్‌ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయనతో మంత్రి సమావేశమయ్యారు. క్లౌడ్‌-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్‌ కోసం ఏఐ ఉపయోగించడం, సైబర్‌ భద్రతను మెరుగుపర్చడం, స్మార్ట్‌ సిటీ అభివృద్ధి వంటి డిజిటల్‌ గవర్నెన్స్‌ విధానాలకు మైక్రోసాఫ్ట్‌ సహకారాన్ని కోరుతున్నామని లోకేశ్‌ తెలిపారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని దేశానికి ఏఐ క్యాపిటల్‌గా తయారు చేస్తామని, ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్‌ టెక్‌ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేశ్‌ కోరారు. రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను పరిశీలించి, పెట్టుబడులకుగల అవకాశాలను పరిశోధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీలో డిజిటల్‌ ట్రాన్ఫర్మేషన్‌, ఏఐ రంగాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని సత్య నాదెళ్ల చెప్పారు.
అడోబ్‌ సీఈవోతో భేటీ
ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అడోబ్‌ సీఈవో శంతన్‌ నారాయణ్‌తో శాన్‌ ఫ్రాన్సిస్కోలో భేటీ సందర్భంగా లోకేశ్‌ కోరారు. ఏపీలో అడోబ్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, యువతను డిజిటల్‌ నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫారంలను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్‌ సహకారాన్ని కోరారు. డాక్యుమెంట్‌ ప్రొడక్టివిటీ, ఏఐ పవర్డ్‌ టూల్స్‌లో అడోబ్‌ నైపుణ్యం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని మంత్రి లోకేశ్‌ అన్నారు.
యాపిల్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
యాపిల్‌ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్‌ సందర్శించారు. ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ‘ఏపీలో ఉన్న నాలుగు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో మీకు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించండి. మీరు కోరుకున్న చోట తయారీ కేంద్రం స్థాపనకు అన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్‌ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధితో యత్నిస్తున్నాం. ఇందుకు మీ సంస్థ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లోకేశ్‌ అన్నారు. లోకేశ్‌ వెంట ప్రతినిధి బృంద సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్‌ వర్మ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img