Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఏపీలో శృతి మించిన అప్పు..!

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ వెల్లడి
ప్రతిపక్షాల విమర్శలకు బలం
ఆర్థిక పరిస్థితిపై గందరగోళం
ఉద్యోగుల వేతనాలకూ ఆటంకం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అప్పులమయంగా మారింది. కొంతకాలం నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న ఈ వాదనలకు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడిరచిన గణాంకాలతో మరింత బలం చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పరిమితికి మించి నాలుగువేల కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంట్‌లో మంగళవారం ప్రకటించడం చర్చానీయాంశంగా మారింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల చిట్టాను తెలిపారు. ఏపీలో వివిధ సంక్షేమ పథకాల నిర్వహణతోపాటు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు వెరసి ఈ మితిమీరిన అప్పులకు కారణమైందనే అభియోగాలున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన రెండేళ్లలోనే భారీ స్థాయిలో అప్పులు తీసుకోవడం ఆందోళనకరంగా మారింది. 202021 ఆర్థిక సంవత్సరానికి రూ.54,369.18కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 202021 ఆర్థిక సంవత్సరానికి రూ.30,305కోట్లు, కరోనా కారణంగా మరో రూ.19.192 కోట్లు అప్పుతీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు ఆర్థికశాఖ వెల్లడిరచింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.49.497కోట్లు అప్పు పొందేందుకు అవకాశం కల్పించినట్లు పార్లమెంటులో నొక్కిచెప్పడంతో ఇంతకాలం..ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధవంతంగా మారాయి. ఇటీవల రాష్ట్ర హైకోర్టు సైతం అప్పుల అంశాన్ని వేలెత్తి చూపింది. ప్రభుత్వంలో అధికంగా ఉన్న సలహాదారులతోనూ ప్రభుత్వానికి భారంగా మారిందంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే. రాష్ట్రంలో కరోనా, ఇతరత్రా సాకుతో ప్రభుత్వం చేస్తున్న అప్పుల పరంగా ఖజానాకు భారీ గండిపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో ఆటంకాలు నెలకొనడం, దానిపై ఉద్యోగ సంఘాలు దఫాలుగా ఆర్థికశాఖకు విన్నవించిన ఘటనలున్నాయి. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ ఖజానా నుంచి రూ.41వేల కోట్ల జమాఖర్చులు అస్తవ్యస్తంగా మారిన విషయాన్ని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ గవర్నరుకు ఫిర్యాదు చేశారు. దాంతో మరోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెద్దఎత్తున చర్చ కొనసాగింది. ఈ క్రమంలో పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ సైతం మితిమీరిన అప్పులు తీసుకుందని ప్రకటించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై గందరగోళం నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img