Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కమ్యూనిస్టుల పునరైక్యత అవశ్యం

. ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం
. రాజకీయ లబ్ధికే ప్రజల మధ్య చిచ్చు
. మోదీ సర్కారును సాగనంపేందుకు అందరూ ఏకం కావాలి
. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాజా ఉద్ఘాటన

కమ్యూనిస్టుపార్టీల పునరైక్యత అత్యంత అవశ్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. నియంతృత్వ, పాశవిక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాలాంధ్ర బ్యూరోవిశాఖపట్నం: కమ్యూనిస్టుపార్టీల పునరైక్యత అత్యంత అవశ్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. నియంతృత్వ, పాశవిక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశానికి అప్పులు తప్ప మిగిలిందేమీ లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టానుసారం తన అనుంగు మిత్రులకు ఉదారంగా కట్టబెడుతున్నారని నిశితంగా విమర్శించారు. విశాఖలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 27వ మహాసభలను పురస్కరించుకుని శనివారం ప్రతినిధుల సభను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలను వివరించారు. రష్యాఉక్రెయిన్‌ యుద్ధానికి దారితీసిన పరిస్థితులను, నాటో విస్తరణ వెనుక అమెరికా ప్రోత్సాహం, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ప్రజల తిరుగుబాటు వంటి అంశాలను వివరించారు. కోవిడ్‌ సంక్షోభాన్ని కమ్యూనిస్టుపార్టీ అధికారంలో ఉన్న క్యూబా, వియత్నాం లాంటి దేశాలు అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. భారత్‌లో మాత్రం ప్రధాని మోదీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఘోరవైఫల్యం చెందారని విమర్శించారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో వలస కూలీలు తినడానికి తిండి లేక, గమ్యం చేరుకోవడానికి మార్గం లేక వేలాది కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు చేరారని గుర్తు చేశారు. కరోనాతో మృతి చెందినవారి మృతదేహాలకు కనీసం దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని, గంగా నది ఒడ్డున శవాల గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ విమర్శకులు మోదీకి శత్రువులయ్యారని, నక్సలైట్లు, ఉగ్రవాదుల పేరుతో దారుణ హింసకు గురి చేస్తున్నారని ఆగ్రహంఒ వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపై దేశద్రోహ ముద్ర వేసి జైళ్లకు పంపుతున్నారని, ప్రత్యేకించి కమ్యూనిస్టులను మోదీ ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నారని విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నదని, ముస్లిం, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడుతోందన్నారు. రాజకీయ లబ్ధి కోసం మతాన్ని, కులాన్ని నిర్లజ్జగా వాడుకుంటోందన్నారు. మోదీ పాలన కార్పొరేట్లకు కాసుల పంట కురిపిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోందన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను కారుచౌకగా అదానీకి కట్టబెడుతోందని, చివరకు లాభాల్లో నడిచే విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో పేదలు మరింత పేదలుగా, సంపన్నులు కుబేరులుగా మారుతున్నారని అన్నారు. అందుకే మానవాభివృద్ధి సూచీలో భారత్‌ అట్టడుగు స్థాయికి పడిపోయిందని వివరించారు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి, గూడు, భూమి పేదలకు దక్కడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగ హామీని గాలికొదిలేశారని, తాజాగా అగ్నిపథ్‌ పేరుతో ఆరెస్సెస్‌, బీజేపీ వలంటీర్లకు ఉపాధి కల్పించే పనిలో పడిరదని ఆయన విమర్శల వర్షం కురిపించారు. రైతుల పొట్టకొట్టటానికి మోదీ సర్కార్‌ మూడు సాగు చట్టాలు తీసుకొచ్చిందని, వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం సుదీర్ఘ ఉద్యమం చేపట్టిందని, ఈ ఉద్యమ ప్రస్థానంలో దాదాపు 700 మంది రైతులు అశువులు బాశారని తెలిపారు. అంతిమంగా రైతు ఉద్యమానికి తలొగ్గి ఆ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న అన్నదాతల డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన కాంగ్రెస్‌ అంతర్గత సమస్యలతో సతమతమవుతోందని, ఇకనైనా కాంగ్రెస్‌ తన రాజకీయ వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడమే అందరి లక్ష్యం కావాలని, ఇది రాజకీయ నినాదం కాకుండా డిమాండ్‌గా మారాలని పిలుపునిచ్చారు. మోదీ సర్కారును ఓడిరచడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగల్గుతామని స్పష్టం చేశారు. ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని రాజా పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభకు అధ్యక్షవర్గంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, పి.హరినాథరెడ్డి, విమల, భీమారావు, అప్సర్‌ వ్యవహరించగా, వేదికపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, కార్యవర్గసభ్యులు అనీరాజా, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయకార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, అక్కినేని వనజ, ఈశ్వరయ్య, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మానం ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆశీనులయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img