Friday, May 3, 2024
Friday, May 3, 2024

భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్నాం : ఆర్మీ చీఫ్‌

న్యూదిల్లీ: చైనా, పాకిస్థాన్‌ నుంచి మన దేశ భద్రతకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన కొన్ని భాగాల(ట్రయిలర్స్‌)ను ఇప్పుడు చూస్తున్నామని భారత సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవనే చెప్పారు. గురువారం ఓ ఆన్‌లైన్‌ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ ఈ రెండు దేశాలు తమ వ్యూహాత్మక లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తాయని తెలిపారు. చైనా, పాకిస్థాన్‌ నుంచి మన దేశానికి ప్రత్యేకమైన, గణనీయమైన, బహుముఖ భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. దేశానికి ఉత్తర సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల ఆధారంగా మన దళాలు సర్వసన్నద్ధంగా, సామర్థ్యంతో ఉండవలసిన అవసరం ఉందని వెల్లడవుతోందని తెలిపారు. అణ్వాయుధ సామర్థ్యంగల పొరుగు దేశాలతో వివాదాస్పద సరిహద్దులు మన భద్రతా సాధనాలు, వనరుల పరిధిని విస్తృతం చేస్తున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు చేసేటపుడు ఆయన చైనా, పాకిస్థాన్‌లను నేరుగా ప్రస్తావించలేదు. ‘మనం భవిష్యత్తు సంఘర్షణలకు సంబంధించిన కొన్ని భాగాలను చూస్తున్నాం. సమాచార యుద్ధ రంగం, నెట్‌వర్క్స్‌, సైబర్‌స్పేస్‌లలో ఇవి రోజూ అమలవుతున్నాయి. అపరిష్కృత, క్రియాశీల సరిహద్దుల వెంబడి వీటిని అమలు చేస్తున్నారు’ అని జనరల్‌ నరవనే చెప్పారు. ఘర్షణలకు సంబంధించిన సూచనల ఆధారంగా మనం భవిష్యత్తు యుద్ధరంగం రూపురేఖలను అర్థం చేసుకోవాలన్నారు. ఎవరైనా ఒకసారి తన చుట్టూ జరుగుతున్నదేమిటో పరిశీలిస్తే, నేడు జరుగుతున్న వాస్తవాలేమిటో తెలుస్తాయని చెప్పారు. మన దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైనికులు సర్వసన్నద్ధంగా, సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో ఉండవలసిన అవసరం ఉన్నట్లు ప్రస్తుత ఉత్తర సరిహద్దుల్లోని పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు. మన దేశ శత్రువులు రాజకీయ, సైనిక, ఆర్థిక రంగాల్లో గ్రే జోన్‌ యాక్టివిటీస్‌ ద్వారా ఘర్షణకు తలపడతాయని తెలిపారు. మన శత్రు దేశాలు ఈ కార్యకలాపాలను ఒకదానితో మరొకటి కుమ్మక్కు అయి చేస్తాయన్నారు. 2020లో జరిగిన సంఘటనలు అన్ని రంగాల్లోనూ ఎదురయ్యే భద్రతాపర ముప్పులకు నిదర్శనాలని, ఎదురెదురుగా తలపడకుండా, గ్రే జోన్‌ యుద్ధం చేయడానికి సంబంధించిన సూచనలు కనిపించాయని చెప్పారు. మనం ఎదురెదురుగా తలపడటానికి, అదేవిధంగా ఎదురురెదురుగా తలపడకుండా యుద్ధం చేయడానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img