Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజధాని అమరావతి పాదయాత్రకు సీపీఐ మద్దతు

బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి నాగాంజనేయులు

విశాలాంధ్ర`రేపల్లె : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్రలో పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, నాయకులు బాగస్వాములు కావాలని బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి పి. నాగాంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. న్యాయస్థానం-దేవస్థానం వరకు పాదయాత్ర తలదన్నేలా రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర 2ను విజయవంతం చేయడం ద్వారా అమరావతి ఏకైక రాజధాని అనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని ఈ నెల 12వ తేదీ నుంచి వెంకటాపాలెం నుంచి అరసవెల్లి వరకు 60 రోజులపాటు జరిగే రైతుల మహా పాదయాత్రకు సీపీఐ సంఫీుభావం తెలియజేస్తుందన్నారు. అమరావతి రాజధాని భవిష్యత్తును నాశనం చేయాలని కృత నిశ్చయంతో వైసీపీ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని అభివృద్ధి చేయాలని కాలపరిమితితో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ముళ్ళ కంపలను తొలగించి కంటి తుడుపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిరదని ఆరోపించారు. కోర్టు తీర్పును ధిక్కరించి మూడు రాజధానులను ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఆర్‌డీఏ చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాజధాని భూములలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామనడం సమంజసం కాదన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు రైతులు భూములు ఇచ్చారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మధ్య గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌ రెడ్డికి కనువిప్పు కలిగేలా పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, సహాయ కార్యదర్శి పడమట బిక్షాలు, రైతు సంఘ నాయకులు సజ్జా రాజు బాపయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img