Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

జగన్‌ పాలనలో అప్పుల ఊబిలోకి రాష్ట్రం

విశాలాంధ్ర`నరసరావుపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు విమర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం క్లస్టర్‌ బాద్యుడు వసంత ఎల్లమంద ఆధ్వర్యంలో యూనిట్స్‌, బూత్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చదలవాడ మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు వంద శాతం రాయితీతో జిప్సమ్‌, జింకు ఇచ్చారని, డ్రిప్పులు పరికరాలు వచ్చాయని, టీడీపీ హయాంలో రెండు పంటలు పండిరచారని చెప్పారు. ప్రస్తుతం అధిక ధరలు, పన్నులతో సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించటం లేదన్నారు. ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉందన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. డబుల్‌ ఎంట్రీ ఓటర్లు, డబ్బులు ఉన్నాయని 175 సీట్లు వస్తాయని సీఎం భావిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బటన్‌ నొక్కి తగిన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కష్టపడి పార్టీ విజయానికి పనిచేయాలన్నారు. 25 వేల ఓట్లు ఒక క్లస్టర్‌గా, 5 వేల ఓట్లు ఒక యూనిట్‌గా, వంద ఓట్లు ఒక బూత్‌గా చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండరుపల్లి విశేశ్వరవు, సంగం డెయిరీ డైరెక్టర్‌ మక్కెన ఆంజనేయులు, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పులిమి వెంకట్‌ రామిరెడ్డి, వాసిరెడ్డి రవి, కావూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img