Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

. నిరంతరం పర్యవేక్షణ ద్వారా మెరుగైన విద్య
. అంకితభావం కలిగిన గురువులు దైవంతో సమానం

విశాలాంధ్ర-రేపల్లె : ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షణ చెయ్యటం వలన మెరుగైన విద్య అందుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. పట్టణంలోని వినోబా భావే మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, శ్రీ సంజీవయ్య మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, త్రిబుల్ ఎస్ మున్సిపల్ హై స్కూల్ ను శనివారం తనికీ చేశారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. శ్రీ సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును పలు అంశాలను అడిగారు. ఉపాధ్యాయులు పాఠశాలలో అమలు చేయాల్సిన ఐదు ముఖ్య విషయాలు ఏమిటని ప్రశ్నించారు. సదరు ఉపాధ్యాయుడు సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నేను పంచ భూతాలుగా చెప్పిన ఐదు విషయాలను జాగ్రత్తగా అమలు చేయాలని సూచించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దీంతో ప్రవీణ్ ప్రకాష్ సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుని ఏ బ్యాచ్ అని అడిగారు. 2008 డీఎస్సీలో ఎంపికయ్యానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లు కూడా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించక పోతే మేము ఎవరితో మాట్లాడాలి, ఏ పని చేయించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని క్యాజువల్ గా సింపుల్ గా తీసుకుంటూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగం సాధించాం, జీవితం సెటిల్ అయ్యింది మాకు ఏంటి అనుకుంటున్నారా అని నిలదీశారు. రోజుకి 14 గంటలు చదివి కష్టపడి ఐఏఎస్ సాధించాను, సమాజా హితానికి నావంతు కృషి చెయ్యాలనే ఆశయంతో ఇప్పటికీ 14 గంటలు పని చేస్తున్నానాని తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులకు మేలు చేయాలని ప్రతి పాఠశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అనంతరం తాను పంచభూతాలుగా నామకరణం చేసిన ఐదు పనులు వివరించారు. జగనన్న విద్యా కానుకల కిట్లు విద్యార్థులకు సక్రమంగా అందించాలని, యూనిట్ టెస్ట్ పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలో రాసే విధంగా విద్యార్థులకు భోదించాలని, పాఠశాలకు స్మార్ట్ టీవీలు ఇస్తే వాటిని ఉపయోగించాలని, ఏ వారంలో పాఠ్య ప్రణాళికలు ఆ వారం లోనే పూర్తి చేయాలని, పిల్లలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని వివరించారు. అనంతరం ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ తరగతి గదిలోనే విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు. నేను మాథ్స్ లో టాపర్…ఐ ఏ ఎస్ టాపర్… నా పిల్లలకు మాథ్స్ నేను ఎంత ఈజీగా చెప్పినా అంతలా ఫీలవ్వరు. అదే వాళ్ళ టీచర్ చెబితే గొప్పగా ఫీలవుతారు. అందుకే గురువు దైవంతో సమానం అంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో బాధ్యత గా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, అర్ధం కాని అంశాలను పదే పదే భోదించాలన్నారు. ఆయన వెంట మండల విద్యా శాఖ అధికారులు నవీన్ కుమార్, శ్రీ హరి,రత్న శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ విజయ సారధి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img