Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అఫ్గాన్‌ తాలిబన్ల వశం

భయభ్రాంతుల్లో దేశ ప్రజలు
ప్రతిఘటన లేకుండా లొంగిపోతున్న సైన్యం
అధ్యక్షుడు ఘనీ రాజీనామా..
తాలిబన్‌ కొత్త నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ?

కాబూల్‌: అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ తాలిబన్ల కంబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం తాలిబన్లు దేశ రాజధాని కాబూల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అఫ్గాన్‌లోని 34 ప్రావిన్స్‌లలో దాదాపు అన్నీ తాలిబన్ల వశమయ్యాయి. అధికార మార్పిడి కోసం చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలో భీకర వాతావరణం చోటుచేసుకుంది. రక్తపాతాన్ని నివారించేందుకు, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగిస్తామని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ సత్తార్‌ మిర్జక్వాల్‌ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా ఉంటుందని టోలో న్యూస్‌కు వెల్లడిరచారు. దేశంలో పరిస్థితులు క్షీణిస్తున్న వేళ..భయాందోళనకు గురైన ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి పారిపోతున్నారు. తెల్లారి లేచి చూసేసరికి తాలిబన్లు తెల్లజెండాలతో ఎటువంటి ప్రతిఘటనలు లేకుండా ఊళ్లోకి ప్రవేశించారని జలాలాబాద్‌కు చెందిన స్థానికుడు వాపోయాడు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీ స్వచ్ఛందంగా పాలనా పగ్గాలు అందించినట్లు ఈజిప్టు డెయిలీ న్యూస్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమకు బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము దాడులు చేయడం లేదని, శాంతియుతంగానే అధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు తాలిబన్లు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇళ్ల నుంచి బైటకు రావద్దని కోరారు. తాలిబన్లు రాజధానిలో కలకన్‌, కారాబాగ్‌, పాగ్‌మాన్‌ ప్రాంతాల్లో ఉన్నారు. బగ్రామ్‌ వైమానికి స్థావరం వద్ద 5000 మంది ఖైదీలు గల జైలులో అఫ్గాన్‌ దళాలు తాలిబన్లకు లొంగిపోయారని బగ్రామ్‌ జిల్లా చీఫ్‌ దర్వైష్‌ రౌఫీ తెలిపారు. ప్రభుత్వం తరపున చర్చలకు దేశ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, అఫ్గాన్‌ జాతీయ సయోధ్య కౌన్సిల్‌ ప్రతినిధి అబ్దుల్లా అబ్దుల్లా ఉన్నారు. రక్షణమంత్రి బిస్మిల్లా ఖాన్‌ వీడియో సందేశం ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదని తాలిబన్లు ప్రకటించారు. అత్యంత ఆధునిక ఆయుధాలన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భారీ ఆయుధాలు, శతఘ్నులతో నిండిన సైనిక వాహనాలతో సైనికులు లొంగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
దేశం విడిచి వెళ్లేందుకు ప్రజల ప్రయత్నం
కాబూల్‌ విమానాశ్రయం ద్వారా దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిమంది అఫ్గాన్‌ ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వేలాదిమంది అఫ్గాన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లారు. ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో భీకరవాతావరణం చోటుచేసుకుంది. వేలాదిమంది పౌరులు కాబూల్‌లోని పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img