Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అస్థిరంగానే పాకిస్తాన్‌

ప్రధాని ఇంటిపై దాడి
పీటీఐ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ ఖురేషి అరెస్టు
దేశ చరిత్రలో చీకటి అధ్యాయం: హింసపై సైన్యం ప్రకటన

ఇస్లామాబాద్‌/లాహోర్‌: పాకిస్తాన్‌ అస్తిరంగా ఉన్నది. తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో దేశం అట్టుడికిపోతోంది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు చెందిన లాహోర్‌ ఇంటిపై పీటీఐ కార్యకర్తలు దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. పెట్రో బాంబులతో విధ్వంసం సృష్టించారు. ప్రధాని ఇంటిపై దాడి జరిగిప్పుడు గార్డులు మాత్రమే ఉన్నారని, అక్కడి పోలీస్‌పోస్టుకూ నిరసనకారులు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు. మరోవైపు పీటీఐ నేతల అరెస్టులపర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఇమ్రాన్‌ ఖాన్‌కు సన్నిహితుడైన మహమ్మద్‌ ఖురేషీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టు దృశ్యాలను ట్విట్టర్‌లో పీటీఐ షేర్‌ చేసింది. మఫ్టీలో వచ్చినవారు ఖురేషీని తీసుకెళ్తుండటం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. తమ నాయకుడిని రహస్యంగా ఉంచారని పార్టీ ఆరోపించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ చౌధురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా హింసాత్మక పరిస్థితులను పాకిస్తాన్‌ సైన్యం తీవ్రంగా ఖండిరచింది. ఇది దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం అని అభివర్ణించింది. సైనిక ఆస్తులపై దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనలను ఉటంకిస్తూ పాకిస్తాన్‌ ఆర్మీ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడానికి అనుమతించబోం’ అని తేల్చిచెప్పింది. నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) ప్రకటనను ఉటంకిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టును సమర్థించింది. దేశ ప్రయోజనాల కోసం సైన్యం అత్యంత సంయమనాన్ని ప్రదర్శించి ఎంతో ఓర్పుతో పనిచేసిందని తెలిపింది. ‘వ్యూహం ప్రకారమే సైన్యం ప్రతిస్పందనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే పరిస్థితి సృష్టించారు. దీనిని అడ్డుకున్నాం. సైన్యంతో పాటు వ్యవస్థలపై దాడులు జరిగితే కఠినమైన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది. కాగా, హింసలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించగా అనేక మందికి గాయాలయ్యాయి. దాదాపు 2వేల మంది అరెస్టుకు గురయ్యారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు స్థానిక కోర్టు ఎనిమిది రోజుల రిమాండ్‌ విధించింది.
పాక్‌ పరిస్థితిని గమనిస్తున్నాం: బ్రిటన్‌
పాకిస్తాన్‌ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందిస్తూ ‘ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు ఆ దేశ అంతర్గత వ్యవహారం. అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టును అఫ్ఘాన్‌లో దౌత్యవేత్త జల్మే ఖలీల్జాద్‌ ఖండిరచారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని, కస్టడీలోనే చంపేస్తారన్న భయాందోళన పెరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img