Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మృత్యు విలయం

. టర్కీ, సిరియాలో 17వేలు దాటిన మరణాలు
. నీరు, ఆహారం లేక బాధితుల విలవిల
. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఐద్రోజులు బంద్‌ ` 24ఏళ్లలో తొలిసారి
. భారత్‌ ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ప్రారంభం

అంకారా: టర్కీ, సిరియాలో మృత్యు విలయం కొనసాగుతోంది. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 17,500 మందికిపైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 14,351 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల్లో 1200 మందికిపైగా చనిపోగా రెబల్‌ ప్రాంతాల్లో 1600 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 20వేలకు మించి ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే సంకేతాలివ్వగా అది నిజమనే అనిపిస్తోంది. విపత్కర పరిస్థితులతో టర్కీ, సిరియా దేశాల ప్రజలు గుక్కెడు నీరు లేక తినేందుకు తిండి లేక విలవిల్లాడిపోతున్నారు. భూకంపం ధాటికి ఇళ్లు కూలి నిలువనీడ లేకుండా ఉన్నారు. టర్కీలో 2,000 భవనాలు కుప్పకూలినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 10 ప్రావిన్సుల్లో ధ్వంసమైన భవనాల సంఖ్య 6,000కు పైనే ఉందని సమాచారం. కనిష్ట ఉప్ణోగ్రతలు, గడ్డకట్టే చలి, మంచు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి విలువైన 72 గంటల సమయం గడిచాయి. కొన్ని ప్రాంతాల్లో సహాయ సిబ్బంది చేరుకునేందుకు అవకాశం లేకపోవడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఎముకలు కొరికే చలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. భూకంపం అనంతరం ప్రభుత్వం ప్రతిస్పందనపై విమర్శలు రావడంతో ప్రభుత్వ లోపాలను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమేనన్నారు. ఇది శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన విపత్తని అన్నారు. ఇదిలావుంటే 24 ఏళ్లలో మొదటిసారి ఇస్లాంబుల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఐదు రోజుల కోసం మూతపడిరది. మరోవైపు ప్రపంచ దేశాల చేయూత అందుతోంది. భారతదేశం ఇప్పటికే ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ప్రారంభించింది. టర్కీకి 30 పడకల మొబైల్‌ హాస్పిటల్‌, నాలుగు సి-17 గ్లోబ్‌మాస్టర్‌ సైనిక రవాణా విమానాలలో ప్రత్యేక శోధన, రెస్క్యూ బృందాలను పంపింది. భారత వైమానిక దళానికి చెందిన సి-130జీ విమానంలో సిరియాకు సహాయక సామాగ్రినీ పంపింది. పేషెంట్‌ మానిటర్లు, అవసరమైన వైద్య పరికరాలు, మందులు పంపింది.
సిరియాపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి: ఈయూకు గ్రీక్‌ కమ్యూనిస్టుల డిమాండ్‌
బాధిత సిరియాపై ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని గ్రీస్‌ కమ్యూనిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లేఖను యూరోపియన్‌ కమిషన్‌ ఉర్సులా వోన్‌డేర్‌ లెయన్‌కు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ఎంఈపీలు కోస్టస్‌ పపాడకిస్‌, లెఫ్టరిస్‌ నికోలావో, అలవానోస్‌ పంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img