Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శవాల గుట్టలు

. 10వేలకు చేరిన భూకంప మృతులు
. టర్కీ, సిరియాలో కన్నీటిగాథలు
. భయానక పరిస్థితులు` హృదయవిదారక దృశ్యాలు
. సహాయక చర్యలకు ఆటంకంగా వాతావరణం
. సోమవారం నుంచి 300పైగా ప్రకంపనలు
. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు

అంకారా/డమాస్కస్‌: భూకంపం మిగిల్చిన విషాదంతో టర్కీ, సిరియా దేశాలు శవాల దిబ్బల్లా మారాయి. అక్కడి వాతావరణంలో మృత్యువు ఘోషిస్తోంది. ఎటు చూసినా శవాలు, భవనాల శిథిలాలు, అర్తనాదాలతో భయానక దృశ్యం ఆవిషృతమైంది. శిథిలాల నుంచి బయటపడిన వారి కన్నీటిగాథలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. సోమవారం నుంచి 300 సార్లకుపైగా భూ ప్రకంపనలు సంభవించాయి. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు, వర్షం ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సహాయక చర్యలకూ తీవ్ర ఆటంకం కలుగుతోంది. బుధవారానికి మృతుల సంఖ్య 10వేలకు చేరుకుంది. రెండు కోట్ల మంది బాధితులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ దేశాల చేయూతతో టర్కీ, సిరియా దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయిగానీ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద నుంచి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని సహాయక బలగాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రతిక్షణం విలువైనదిగా మారింది. అమల్యమైన ప్రాణాలను కాపాడేందుకు సమాయానికి ఎదురీదాల్సిన సమయం ఇదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సహాయక చర్యల్లో 25వేల మందికిపైగా పాల్గొన్నా సరిపోవడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న తమవారి కోసం స్థానికులు రోదిస్తుండటం కలిచివేస్తోంది. వారి హాహాకారాలతో అక్కడ పరిస్థితులు గుండెలను పిండేస్తున్నాయి. భూకంప బాధితుల కోసం సైన్యం తాత్కాలిక శిబిరాలను, క్షేత్రస్థాయి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. షాపింగ్‌ మాల్స్‌, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇస్కెర్‌డెరున్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌకాదళ నౌకను సమీపంలోని రేవుకు పంపించారు. రహదారులపై మంచు పేరుకుపోవడం, చలిగాలులకు అక్కడవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూకంపం కారణంగా మొత్తం 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని, వారికి ఆపన్నహస్తాన్ని అందజేయడానికి అన్ని దేశాలూ ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థించింది. ఇటువంటి కష్టకాలంలో సిరియాపై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించి, మానవత్వంతో ముందుకురావాలని సిరియా రెడ్‌ క్రెసెంట్‌ కోరింది.
మూడు నెలలుపాటు ఎమర్జెన్సీ
టర్కీలో టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ దేశంలోని పది ప్రావిన్సుల్లో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 119 ప్రకారం పది ప్రావిన్సుల్లో మూడునెలలు ఎమర్జెన్సి విధించాం. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడానికి సహాయక సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు’ అని ఎర్దోగన్‌ అన్నారు. దాదాపు 40వేల మందికి గాయాలయ్యాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మీడియా సమావేశంలో ఎర్దోగన్‌ వెల్లడిరచారు. భూకంప ప్రభావిత ప్రావిన్సులలో కహ్రమన్మరాస్‌, అదానా, అడియామాన్‌, ఉస్మానియే, హటే, కిలిస్‌, మలత్య, సాన్లియుర్ఫా, దియార్‌బాకిర్‌, గజియాంటెప్‌ ఉన్నాయని అధ్యక్షుడు తెలిపారు.
తమ్ముడు… నేనున్నా…
భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథిలాల కింద ఓ బాలిక, తన తమ్ముడితో పాటు ఇరుక్కుపోయింది. స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టుగా ఉండడంతో తమ్ముడి తలకు గాయం కాకుండా ఉండాలనే భావంతో గంటల తరబడి తన తన చేయిని అడ్డంపెట్టి రక్షించింది. నీకు నేనున్నాను.. నీకేం కాదని భరోసా కల్పించింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
తెలుగు రాష్ట్రాల కార్మికుల కుటుంబాల్లో ఆందోళన
తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం టర్కీకి వెళ్లిన వందలాది మంది కార్మికులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, కవిటి, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం నుంచి కార్మికులు వెళ్లినట్లు తెలుస్తోంది. వారి గురించి క్షేమసమాచారం అందక స్వస్థలాల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది.
కొందరు తాము క్షేమమని చెప్పడంతో కొందరు కుటుంబ సభ్యులు కాస్తంత ఉపశమనం పొందారు. సిరియా సరిహద్దుకు సుమారు 300 కి.మీ దూరంలో ఉన్న తుర్కియేలోని అదానా నగరానికి సమీపంలో ఉన్నామని శ్రీకాకుళం వాసులు కొందరు తమ కుటుంబాలకు క్షేమసమాచారాన్ని పంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img