Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అఫ్గాన్‌లో జర్నలిస్టుల పరిస్థితి దుర్బరం

కాబూల్‌ : అఫ్గాన్‌లో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అనేకమంది జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియాపై తాలిబన్‌ల ఆంక్షలు పెరగడంతో ఇప్పటికే చాలా సంస్థలు మూతపడ్దాడయని తెలిపారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు దేశాన్ని విడిచి పారిపోయారని చెప్పారు. ఒక వార్తపై రిపోర్ట్‌ చేసినప్పటికీ.. తాలిబన్‌లకు నచ్చితేనే వార్త వెలుగులోకి వచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. రిపోర్టింగ్‌ చేయడానికి వీలులేని విధంగా తాలిబన్‌ల నిబంధనలు ఉన్నాయని మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌డబ్ల్యు) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాలిబన్‌లకు సంబంధించిన సమాచారంపైనే కాకుండా ఇతర కేసుల్లో కూడా ఏకపక్ష నిర్బంధాలు, హింస కొనసాగుతున్నాయని వివరించింది. తాలిబన్‌ల నిబంధనలతో అఫ్గాన్‌ జర్నలిస్టులు కేసు కేసుకి భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇప్పటివరకు తాలిబన్‌లు తన విధుల్లో జోక్యం చేసుకోలేదని కాని వారు ఏ వివరాలను మీడియాకు తెలపడం లేదని, దీంతో తమ పని కష్టతరమౌతుందని తూర్పు అఫ్గాన్‌ ప్రావిన్స్‌లోని నంగర్‌హార్‌కి చెందిన జర్నలిస్ట్‌ ఒకరు తెలిపారు. నంగర్‌హార్‌లో అనేక పేలుళ్లు, హత్యలు జరుగుతున్నందున తాను కాబూల్‌కి వెళ్లానని.. తనకు నేరుగా బెదిరింపులు రాలేదని, జర్నలిస్టులు కూడా లక్ష్యం కావచ్చని చెప్పారు. తాలిబన్‌లకు వ్యతిరేకంగా, వారికి నచ్చని విధంగా వార్తలను రిపోర్ట్‌ చేయకూడదని నిబంధనల్లో సూచించారని ఇవి తమకు ఇబ్బందికరంగా మరాయని మరో జర్నలిస్ట్‌ తెలిపారు. తాను విదేశీ జర్నలిస్టులతో కలిసి పనిచేస్తున్నానని, దీంతో జిహాదీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నానంటూ తాలిబన్‌లు తన నివాసానికి వచ్చి తన తండ్రిని బెదిరించారని కునార్‌ ప్రావిన్స్‌కు చెందిన ఒక జర్నలిస్ట్‌ తెలిపారు. దీంతో తన కుటుంబసభ్యులు భయాందోళనలకు గురవుతున్నారనీ, తనని జర్నలిస్ట్‌ వృత్తి మానేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. మహిళా జర్నలిస్టులు కెమెరా ముందుకు రాకూడదని ఆంక్షలు విధించారని బదాక్షన్‌కి చెందిన మహిళా జర్నలిస్ట్‌ తెలిపారు. రేడియో జర్నలిస్టులుగా విధులు నిర్వహించేందుకు అనుమతించినప్పటికీ ఆ కార్యక్రమం పూర్తిగా మహిళలతోనే రూపొందించాలని ఆదేశించారని చెప్పారు. రేడియో స్టేషన్‌లోని సాంకేతిక సిబ్బంది మొత్తం పురుషులేననీ అటువంటప్పుడు పూర్తి కార్యక్రమం మహిళలే రూపొందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీంతో తమను విధుల నుంచి తొలగించారని తెలిపారు. తమ తప్పు లేకుండానే విధుల నుంచి బయటికి రావలిసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బదాక్షన్‌లో అనేక మీడియా సంస్థలు విదేశీ నిధులతో పనిచేస్తున్నాయనీ తాలిబన్‌లు స్వాధీనం చేసుకోవడంతో ఆ సంస్థలు మీడియాపై నిషేధం విధించాయని మరో జర్నలిస్ట్‌ తెలిపారు. అఫ్గాన్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు 32 మంది జర్నలిస్టులపై తాత్కాలిక నిషేధం విధించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యు తెలిపింది. కాబూల్‌కి చెందిన వార్తాపత్రికలోని ఇద్దరు జర్నలిస్టులపై దాడి చేసిందనీ ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపింది. తాలిబన్‌ల ఆక్రమణకు ముందు అఫ్గాన్‌లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదని హెచ్‌ఆర్‌డబ్ల్యు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img