Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి

క్యూబా డిమాండ్‌
హవానా : దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్య రహిత సూత్రానికి కట్టుబడి ఉండాలని అర్జెంటీనాలో గురువారం క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్‌ డిమాండ్‌ చేశారు. అర్జెంటీనాలో జరిగిన లాటిన్‌ అమెరికా కమ్యూనిటీ, కరేబియన్‌ దేశాలు (సెలాక్‌) యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ మంత్రుల 3వ శిఖరాగ్ర సమావేశంలో 50 దేశాల ప్రతినిధుల సమక్షంలో రోడ్రిగజ్‌ ప్రసంగిస్తూ తన ప్రాంతంలో సామ్రాజ్యవాద విధ్వంస ప్రభావాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రతిదేశం దాని రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల హక్కును ఆయన సమర్ధించారు. ‘‘మొన్రో సిద్ధాంతం ఆధారంగా అమెరికా తన విస్తరణవాద, జోక్యందారీ అత్యుత్సాహంతో మన దేశాలను తన పెరడుగా మార్చేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో సంపదను అమెరికా కొల్లగొట్టిన, సహజవనరులను దోచుకున్న సుదీర్ఘ చరిత్రను ఆయన గుర్తు చేశారు.
గడచిన 60 సంవత్సరాలుగా పైగా ఈ దీవిపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య దిగ్బంధనాన్ని తిరస్కరించినందుకు మరోపక్క ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అమెరికా అన్యాయపూరిత, చట్టవిరుద్ధ విధానం క్యూబా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే విధంగా ప్రజలను తీవ్రంగా దెబ్బతీసింది’’ అని ఆయన అన్నారు. ‘‘తీవ్రవాద పోషకులని ఆరోపిస్తూ అమెరికా విదేశాంగ శాఖ జాబితాలో క్యూబాను చేర్చడాన్ని’’ సెలాక్‌, విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానం యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ ఖండిరచడాన్ని రోడ్రిగజ్‌ గుర్తించారు. ‘‘నిబంధనల ఆధారంగా బహుళత్వవాదం, అంతర్జాతీయ వ్యవస్థ గురించి చర్చ జరిగినప్పుడల్లా, ప్రజాస్వామ్య అంతర్‌ ప్రభుత్వాల సంప్రదింపుల ప్రక్రియ లేకుండా సంపన్న దేశాలు అవాస్తవ భావ సమాహారాన్ని విధించడం పట్ల అతి పెద్ద కరేబియా దీవి విదేశాంగ మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ద్వంద్వ ప్రమాణాలు అనుమతించబడనివని కూడా ఆయన అన్నారు. సార్వభౌమత్వ సమానత్వం, జోక్య రహితం, ప్రతి దేశం తన వ్యవస్థను నిర్ణయించుకునే హక్కును అన్ని పరిస్థితులలో గౌరవించాలని కూడా రోడ్రిగజ్‌ ఉద్ఘాటించారు. మరోపక్క, ఉభయ ప్రాంతాలు, ప్రపంచ ప్రజల ప్రయోజనం కొరకు సెలాక్‌, ఈయూల మధ్య చర్చలు, సహకారం పటిష్టతకు క్యూబా సాధ్యమైనంత సహాయం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img