Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘కరోనా’ కాలాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియచెప్పే తెలుగు సాహిత్యం

చలపాక ప్రకాష్‌, సెల్‌: 9247475975

‘కరోనా!’ ఈ పేరు అన్నది వింటామనిగాని, అసలు వినాల్సివస్తుందని గాని మనం కలలో కూడా అనుకోలేదు. 2020 సంవత్సరం నుండి యావత్‌ ప్రపంచాన్ని తన కబంధ హస్తాలలో పట్టిపీడిరచి వణికించింది ‘కరోనా’. ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి గడగడలాడిరచిన అతి సూక్ష్మ క్రిమి ‘కోవిడ్‌-19’ కరోనా పేరుతో అందరి నోళ్ళకి మాస్క్‌ బిగించేసింది. చేతులకి సానిటేజర్‌తో మాటిమాటికీ కడిగించేస్తుంది. మనిషి మనిషి ఆప్యాయంగా బంధాల అనుబంధాలతో కలిసుండాలనే లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఎంత గొప్పవారినైనా దూరంగా ఉండమని, కౌగిలింతలు, షేకేండ్లు వంటి అనుబంధాలమధ్య ‘సోషల్‌ డిస్టెన్స్‌’ అనే పేరుతో దూరం చేసేసింది. కోట్లాదిమందిని తన కబంధహస్తాలతో పీల్చి పిప్పిచేసింది. అంతకు ముందు వరకు కనిపించిన వ్యక్తులను క్షణాలలో కనుమరుగైయేలా లక్షలాది మంది ప్రాణాలని హరించేసింది. దీని బారినపడి కుటుంబాలకు కుటంబాలే నాశనమైపోయాయి. ఎందరో అనాధలైపోతే, మరెందరో భర్తలు కోల్పోయిన అభాగ్యులు, పిల్లల్ని కోల్పోయి శోకించిన హృదయాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రతి రోజు, ప్రతి పూటా ఏదో ఒక ప్రముఖుని చావువార్తను వింటూ, సోషల్‌ మాధ్యమాలలో, దినపత్రికలలో, వార్తా ఛానెళ్ళల్లో చూస్తూ బాధాతప్త హృదయాలతో ధ్రవించిన హృదయాలెన్నో. ఇవి కొన్ని మాత్రమే… ఇలాంటి విషాద మరణాలు, విషాద సందర్భాలు సాధారణ కుటుంబాలలో ఎన్నో… ఎన్నెన్నో.. ఉపాధి కోల్పోయినవారు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళిన వలస జీవులు ఎటూ వెళ్ళలేక మధ్యదారుల్లో ఇరుక్కుపోయిన సంఘటనలెన్నో…ఇటువంటి విషమ పరిస్థితులు రికార్డు పరచాలి. ఇలా జరగడానికి గల కారణాలు అన్వేషించి తద్వారా ఇలా జరగకుండా జాగ్రత్త పడమని తెలియచెప్పాలి. అలా చెప్పాలంటే ఈ కాలం చేదు జ్ఞాపకాలను మనం వాళ్ళకి తెలియచేయాలి. అందుకు తెలుగు సాహిత్యం మిగతా కాలాలను, పరిస్థితులను తమ కలాల ద్వారా సాహిత్య రూపంలో రికార్డు పరిచినట్లే, ఈ కరోనా కాలాన్నీ తమ సాహిత్యంతో రికార్డు పరిచి తన గొప్పతనాన్ని చాటుకుంది. అలా పుస్తక రూపంలో కరోనా కాల పరిణామాలను తమ సాహిత్యం ద్వారా అందించిన కొందరి రచయితల, కవుల, వ్యాసకర్తల రచనలు గురించి కొంత తెలుసుకుందాం!
ప్రపంచ చరిత్రలో ‘కరోనా’ అనే పదం పుట్టుక చైనాలో ప్రారంభమైనా, భారతదేశంలో ప్రవేశించే సరికి 2020 మార్చి నాటికి గాని తెలిసిరాలేదు. మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో మార్చి 21న ఒకరోజు లాక్‌ డౌన్‌ కేంద్రప్రభుత్వం విధించినప్పుడుగాని ‘లాక్‌ డౌన్‌’ అనే పదానికి అర్థం తెలిసిరాలేదు. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు తెలుగు కవులు, రచయితలు తమ రచనలలో… మొదటగా అనేక దిన, వార, మాస పత్రికలలో, వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ సోషల్‌ మీడియా మాధ్యమాలలో కరోనా పై చాలా కవితలు, మినీ కథలు వెలువడ్డాయి. పేపర్లలో, సోషల్‌ మీడియాల్లో వచ్చే రచనలు త్వరగా కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది, కాని పుస్తక రూపంలో వెలువడి భవిష్యత్‌ కాలానికి తెలియచెప్పే విధంగా భద్రపరిచే తీరు ఇక్కడ గమనించతగ్గ విషయం. అలా పుస్తకరూపంలో దాల్చినవాటిలో-మొట్టమొదటి సారిగా తెలుగులో ‘కరోనా’పై వచ్చిన సాహిత్యం… ఎస్‌.ఆర్‌.ఫృథ్వి రచించిన దీర్ఘ కవిత ‘కరోన’. అని చెప్పక తప్పదు. ఎందుకంటే మన దేశంలో మొదటి లాక్‌ డౌన్‌ మొదలుకొని మూడు నెలల కాలవ్యవధిలోనే అంటే జూన్‌ 2020లోనే ఈ దీర్ఘకవిత వెలువడి తొలి తెలుగు ‘కరోన’ సాహిత్యంగా చరిత్రలో రికార్డు కాబడినది. ‘‘వికారీ సంవత్సరమా ! ఏమిటీ వింత వికారం/ పోతా పోతా విషపు జల్లులేంటి?/ నేను కాదు నా ఊరు కాదు/ దేశ దేశాల ప్రజలు-1 విశ్వమంతా భయం గుప్పిట్లో! వణుకుతా ఉంది/ ఏక్షణం ఏమౌతాదో తెలియని అయోమయం’’ అంటూ ప్రారంభమై- ‘‘దాన కర్ణులను కన్న దేశం మనది/ కష్టంలో ఎవరున్నా సరే/ కన్నీరు పెడుతుంది-ప నా బోటివాడు వెయ్యిస్తే/ టాటా లాంటి వాళ్ళు/ కోట్లు, ప్రభుత్వ ఖజానా వెంట/ భరోసా…! ఏమైనా, కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థకీ వెన్నెముకలా! నిలుస్తున్న వారందరికీ జోహార్లు!! రోగ నివారణకు మందు, ఎప్పుడు/ లభిస్తుందో ఎవరికీ తెలియదు/ వ్యాధి అంతరించి కనుమరుగు అయ్యే వరకు/ ప్రజలందరం ఒకటై నిలుద్దాం’’ అని ఈ రచయిత ఇచ్చిన పిలుపుద్వారా ‘కరోనా’ ప్రారంభ దృశ్యాల్ని దీర్ఘ కవిత్వం ద్వారా లిఖించబడిరది. డా. ఎన్‌.గోపి ‘ప్రపంచీకరోనా’: ప్రపంచంలోనే ఏ దుర్ఘటన జరిగిన మొట్టమొదటగా చలించిపోయే హృదయమున్నవాడు మొదట కవి మాత్రమే. ప్రతి చిన్న, పెద్ద విషయానికీ కరిగి, కవిత్వంలో కలిగలిపి అందించేవారు ఆచార్య ఎన్‌.గోపి ఒకరు. వీరు 2020 మార్చి 23 నుంచి మే 5 నెలల మధ్య వెంటనే స్పందించి వివిధ పత్రికలలో రాసిన కరోనా కవితలతో ఈ ‘ప్రపంచీకరోనా’ సంపుటిగా వెలువడిరది. ‘‘ఒకప్పుడు విదేశీ యాత్రలు/ జ్ఞానాన్ని మోసుకొచ్చేవి/ ఇప్పుడు/ రోగాలను వెంట తెస్తున్నాయి’’ అంటూ విదేశాల నుండి వలస వచ్చిన కరోనా లక్షణాల్ని చెబుతూ’’నిన్నటిదాకా బయటి ప్రపంచం/ ఇల్లును నడి పేది/ ఇవాళ ఇల్లే లోకాన్ని ధిక్కరిస్తుంది’’ అంటూ ‘గృహమే కదా స్వచ్ఛందసీమ’ శీర్షికలో కరోనా కాలంలో గృహం యొక్క విశిష్టత తెలియచెప్పారు. డా. నాగభైరవ ఆదినారాయణ ‘కరోనా పై కవనం’: డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ రచించిన ‘కరోనా పై కవనం’ 10 సాహిత్య ప్రక్రియల్లో రచింపబడిన వినూత్న పుస్తకమిది. 2020 జూన్‌ 12 ఆవిష్కరింపబడిన తొలి కరోనా 10 ప్రక్రియల సంపుటిది. కరోనా జోకుల్లో ఒకటి- ‘‘మన ఊరికీ కరీనా వచ్చిందట చూసొద్దామా?’/ వచ్చింది కరీనా కాదు, కరోనా! తేడా ఏమిటీ?/ కరీనా అందాల తార- కరోనా ఒక మృత్యు కోర’’. నేతల ప్రతాప్‌ కుమార్‌ సంపాదకత్వంలో ‘ఐసోలేషన్‌వాడ’: కరోనా పై తొలి (దళిత) కవితా సంకలనంగా ఇది రికార్డులోకెక్కింది.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘నాకిది కొత్తేమీ కాదే’ శీర్షికలో దళితుల బాధల్ని కరోనా కాల పరిస్థితులతో పోల్చిచూపారు. పి.వి.భైరవన్‌ శర్మ ‘ఇప్పుడు తెలిసిందా’ శీర్షికలో ‘‘దూరం దూరం అన్నారు! దూరంగుండమన్నారు/ వదూరమంటే బాధకలుగుతుందా / దాని బాధ భారమేంటో అర్థమయ్యిందా..!’’ అంటూ నిలదీసారు. కాళంగి వసంత జెస్సెన్‌ ‘కరోనాకు అందరూ ఒకటే’ శీర్షికలో ‘‘దళితుడు ఇంటికొస్తే! వసుపు నీళ్ళు చల్లుకునే రోజులు పోయి…. ఎవ్వరైనా ఇంటికొస్తే/ సబ్బు నీళ్లు చల్లుకునే రోజులు వచ్చాయి/ ఇప్పటికైనా కళ్లు తెరవండి/ జనన,మరణాలకు… కుల మత విబేధాలు లేవని, ఇకనైనా మారండి..మానవత్వంతో జీవించండి’’ అని నిజం నిష్ఠూరంగా ఉన్నా వాస్తవాలను ఏమాత్రం మొహమాటం లేకుండా విడమరచి చెప్పారు. డా. నూనె అంకమ్మరావు రచన ‘కరోనా కోరల్లో’: డా. నూనె అంకమ్మరావు రచించిన ‘కరోనా కోరల్లో…’ సంపుటి 2020 నవంబర్‌ 29న ఆవిష్కరింపబడిరది.
‘‘నీ పుణ్యమాని చావు భయం చేత/ యిల్లు కదలకుండ వినయంగా ఉంటిమి!! ఇదే అదనుగా భావించిన భార్యామణీ/ బుర్రకు పదును పెట్టి ముగ్గులోకి దించె/ గారాలుబోయి బేరాలు ఆడి/ యింటిడి చాకిరికి రంగస్థలాన్ని సిద్ధపరచి/ బలిపీఠానికి వ్యూహ రచన జేసె/ ఇష్టమొచ్చిన రీతి!! అంతే సతీమణి చెంత నుండంగ! ఆమె చింత దీర్చాలని యెంచి/ అంటుగిన్నెల నన్ని కుప్పగ పోసి/ అరచేతులన్నీ అరిగేలా / సబ్బులేసి రుద్దంగ మసి మతి రెండు బోయె!’’ అంటూ హాస్యభరితంగా సాగింది కవిత. ఎంత కష్టకాలమైతే మాత్రం కాసింత సరదా పోషణ ఉండాలి కదా మరి. సింగంపల్లి అశోక్‌ కుమార్‌ ‘ఔరా! కరోనా!!’’: మినీ కవితలు రాయడంలో సిద్ధహస్తులైన శింగంపల్లి అశోక్‌ కుమార్‌ రాసిన ఈ ‘ఔరా! కరోనా!!’ నవంబర్‌ 2020లో వెలువడిరది. మిగతా కవులు కరోనా కాలాన్ని చవిచూసిన’ పరిస్థితులను కవితలుగా రాస్తే అశోక్‌ కుమార్‌ స్వయంగా కరోనాతో పోరాడి.. ఐసోలేషన్లో ఉండి అనుభవపూర్వకంగా రచించిన మినీ కవితల సంపుటి ఇది.
జయహో ‘సోనూసూద్‌’’ శీర్షికలో ‘‘ప్రభుత్వాలు చేతులెత్తేసిన/ వలసశ్రామిక కష్టాలకు చేయందించిన/ నీ మంచి మనసుకు జేజేలు!’ అంటూ ‘నువ్వు రీల్‌ స్టార్‌ వి కాదు- రియల్‌ హీరోవి!’’ అని సోనూసూద్‌ ను నిజజీవితంలో హీరోగా అభివర్ణించడం, అతని గొప్పతనాన్ని రికార్డు పర్చడం ఇందులో ప్రత్యేకత. హర్షవర్థన్‌- కోవిడ్‌ నానీలు: గతంలో ‘నానీల కెరటాలు’ వెలువరిచిన ఐఏఎస్‌ అధికారైన ఈ కవి, ఈ కరోనా నానీల్లో విషాదహాస్యం పండిరచడంలో కూడా సిద్ధహస్తులైయ్యారు. ‘‘ధూంధాం / పెళ్ళిళ్ళు వెళ్ళిపోయాయి! జూమ్‌ జూమ్‌ వివాహాలు/ జామ్‌ జామ్‌గా వచ్చాయి’’ అంటూ కరోనా కాలంలో పెళ్ళిళ్ళు కొంగొత్త పుంతలు తొక్కడాన్ని హాస్యంగా చెప్పారు. నిజంగా కోట్లాది రూపాయలని ఖర్చు చేసే పరిస్థితులనుండి, 20మంది అతి స్వల్ప సంఖ్యలో అతి పొదుపుగా పెళ్ళిళ్ళు చేసుకునే స్థితికి మారిపోవడం గమనార్హం. ఒకవిధంగా చెప్పాలంటే వృథాగా ఖర్చు అయ్యే దుబరా నుండి ఈ కాలం కాపాడిరదని చెప్పాల్సిందే. ‘కోవిడ్‌ కల్లోలం- వ్యాస సంకలనం: మే 2021న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడ వారు ప్రచురించిన ‘కళ్ళముందు కఠిన నిజాలు- వర్తమాన కరోనా చిత్రం పై వాస్తవిక సమాచారం’ ఉప పేరుతో కె.ఉషారాణి, వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాసాలు, సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఇంటర్వ్యూ, ఆరుంధతీరాయ్‌ లేఖ, టైమ్స్‌ నౌ జర్నలిస్ట్‌ ఆవేదన, స్ఫూర్తి కలిగించే కేరళ ప్రభుత్వ ఆక్సీజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కథనం, కరోనా గణాంకాలు వంటి ఎంతో ఉపయోగకరమైన, ప్రయోజకరమైన వ్యాసాలతో, 32 పుటల్లో ప్రచురించారు.
చలపాక ప్రకాష్‌- కరోనా నానీలు: గతంలో చలపాక నానీలు రాసిన ఈ కవి, కరోనా కాల విషమపరిస్థితులను కళ్లకు కట్టినట్లు నానీలలో రాయడంతో పాటు, వార్తా పత్రికలలో ప్రచురితమైన చిత్రాలతో సహా సాక్షీభూతంగా నిలిపారు ఈ ‘కరోనా నానీలు’లో. కరోనా గురించి భవిష్యత్‌ తరాలకు అందించాలనే తలంపుతో రాసిన ఈ సంపుటి జూలై 2021లో ప్రచురితమైనది. ‘‘ఈ వీధిన వెళ్ళిన/ అంబులెన్స్‌/ తిరిగి వస్తుందేమిటి/ మహాప్రస్థానమై’’. ‘కాలుతున్న కాలం’: డా. పాతూరి అన్నపూర్ణ, వడలి రాధాకృష్ణల సంపాదకత్వంలో వచ్చిన ఈ ‘కాలుతున్న కాలం’ కరోనా మినీకథా సంకలనం ఫిబ్రవరి 2021న విడుదలైంది. తొలుత ‘అక్షరం’ వాట్సాప్‌ గ్రూప్‌లో కరోనా మినీ కథలుగా ప్రచురింతమై పలువురి మన్ననలు పొందగా, కరోనా కాలంలో ప్రజలు పడ్డ కష్టాలను భవిష్యత్‌ తరాలకు తెలియచెప్పాలనే లక్ష్యంతో తర్వాత ‘కాలుతున్న కాలం’ అర్ధవంతమైన పేరుతో మినీ కథాసంకలనం తీసుకువచ్చారు సంపాదకులు. ఇలా అనేక మంది కరోనా కారణంగా ఇబ్బందులకు గురైనవారి జీవిత వ్యతలను ప్రతి ఒక్క కథలో ఒక్కో కోణంలో ఆవిష్కరింపబడ్డాయి. ‘కొత్త (కరోనా) కథలు-4’: వంశీ ఆర్ట్స్‌ థియేటర్‌ రూపొందించిన ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని జూలై 10, 2021న హైదరాబాద్‌లో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఇందులో 80మంది కథకులు కరోనా పై రాసిన 80 కథలున్నాయి. ‘కరోనాఏ లాక్‌ డౌన్‌.360’: జర్నలిస్ట్‌ అయిన కోడం పవన కుమార్‌ వినూత్నరీతిలో ఈ పుస్తకాన్ని రచించారు. డా. పత్తిపాక మోహన్‌ ‘లాక్‌ డౌన్‌’ కవితలు: ప్రముఖ కవి, బాలసాహితీవేత్త డా. పత్తిపాక మోహన్‌ తాజాగా వెలువరిచిన కరోనా కవితల సంపుటి ‘లాక్‌ డౌన్‌’. 2020 మార్చి 21 నుండి భారతదేశంలో కరోనా లాక్‌ డౌన్‌ ప్రారంభమైన కాలం నుంచి వివిధ పత్రికలలో ఇప్పటి వరకు రాసిన కరోనా కవితలతో ఈ సంపుటి భవిష్యత్‌ తరాలకొరకు రికార్డు కాబడాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చారు. ఈనాడు దినపత్రిక వారి కరోనా కవితల పోటీలలో బహుమతి పొందిన కవితలతో ఎఫ్‌.ఎం.రేడియోలో చాలామంది కరోనా కవితలు బహుళ ప్రాచూర్యంలోకి వచ్చాయి. ఇంకా జనసాహితి ప్రచురణలో జి.వి.కృష్ణయ్య ‘వలస భారతం’ దీర్ఘ కవిత, ఇంకా మరికొన్ని రచనలు వెలువడ్డాయి.
ఇవీ కరోనా కాలాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియచెప్పే ప్రయత్నంలో తెలుగు సాహిత్యం చేసిన గ్రంథస్థ రూపపు కృషి.తెలుగు సాహిత్య చరిత్రలో కరోనా కాలపు ఆనవాళ్లు అందించిన వీరి కృషిని అభినందిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img