Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కెనడాలో ‘తెలుగు తల్లి’

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు... కెనడా దేశంలో వున్న తెలుగు వారు తెలుగు తల్లి దినపత్రిక నడుపుతూ తేనె లొలికించే తెలుగుదనాన్ని తెలుగు భాషను కెనడా  భావితరాలకు పరిచయం చేస్తూ 8 వసంతాలను పూర్తి చేసుకుంది. 1985 లో  సరోజ కొమరవోలు  తెలుగుతల్లి అనే పత్రిక ప్రారంభించి, కొద్ది సంవత్సరాల అనంతరం  నిలిపివేశారు. 2016లో ఒక తెలుగు పత్రిక స్థాపించాలని అభిలాష  కలిగిన  లక్ష్మి రాయవరపు  సరోజ  గౌరవార్థం అదే పేరుతో తెలుగుతల్లి కెనడా అనే పేరుని  లాభాపేక్ష  లేని సంస్థగా రిజిస్టరు చేశారు.   విమలా ప్రసాద్‌ గుర్రాల భారత దేశ కరస్పాండెంట్‌గా,   కళ పిళ్లారిశెట్టి,  గంగాధర్‌ సుఖవాసి,   విజయభాస్కర్‌ రెడ్డి పూడూరి మొదలైన వారు గౌరవ సభ్యులుగా ఈనాటి వరకూ సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.  
 సాహితీమాత  చల్లని ఆశీస్సులు పుష్కలంగా ఉండడం వల్ల చిన్న చిన్న అడుగులు వేస్తూ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంది  తెలుగుతల్లి కెనడా సంస్థ. పత్రికతో మొదలైన ప్రస్థానం సంగీత సాహిత్య కార్యక్రమాలతో రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ, దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజల ప్రతిభని చాటిచెప్పేందుకు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చే ప్రయత్నంలో  చాలావరకు సఫలీకృతం అయింది. పత్రిక పరంగా ప్రస్తుతం కెనడా నించి 50 శాతం రచనలు వస్తున్నాయి. ఈ శాతాన్ని ఏటేటా  పెంచాలన్నది వ్యవస్థాపకుల ముఖ్య ఉద్దేశం. ఈ నిష్పత్తిని 70% కి తేవాలని, తద్వారా కెనడాలో ఉన్న రచయితలని ప్రపంచానికి పరిచయం చెయ్యాలని వారి తపన. ప్రతి రచనని ప్రోత్సహించటం తెలుగుతల్లి కమిటీ నిర్ణయాలలో ఒకటి. వచ్చిన రచనలు తిప్పి పంపడంకాకుండా, కొత్త రచయితలకు తగిన సహకారం, ప్రోత్సాహం అందించి,  రచన నచ్చని పక్షంలో వారికి సూచనలిచ్చి, తిరిగి రాసి పంపమని కోరడం లేక చిన్న సవరణలు చెయ్యడం ద్వారా పత్రిక కొత్త రచయితలు తమ ప్రతిభని  మరింత మెరుగు పరచుకునే అవకాశమి స్తోందని నిర్వాహకులు సగర్వంగా తెలియచేశారు. 

పత్రికకి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకూ నాణ్యత మీద పూర్తి దృష్టి పెట్టారనీ, అనంతరం తెలుగుతల్లి కెనడా యూ ట్యూబు ఛానల్‌ ప్రారంభించారనీ వారు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా గాయకులు, నృత్య కళాకారులు, వాద్య కళాకారులు, రచయితలు, కవులు వారి ప్రతిభ కనబరుస్తూ ఉండగా, భగవద్గీత, పిల్లల కథలు మొదలైన వాటిలో పిల్లలు అద్భుతమైన ప్రజ్ఞ కనబరుస్తున్నారు. ఇవే కాకుండా హరికథ వంటి మరుగున పడుతున్న కళలని పరిచయం చేస్తున్నారు. అష్టావధానాలు తరచుగా నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారి కెనడా జాతీయ సదస్సు నిర్వహణ 2021 లో వంగూరి చిట్టెన్‌రాజు సహాయంతో మొదలై, రెండవ కెనడా జాతీయ సాహితీ సదస్సు 2023 డిసెంబర్‌లో నిర్వహించారు. తెలుగుతల్లి వివాహ పరిచయ వేదిక ద్వారా 4 జంటలు ఒక ఇంటివారయ్యారు. ప్రతి సంవత్సరమూ త్యాగరాజ, అన్నమయ్య ఆరాధనోత్సవాల నిర్వహిస్తున్నారు. త్యాగరాజ ఆరాధోత్సవాలలో భాగంగా సంగీతంలో ప్రతిభావంతులకి, జాతీయ సదస్సులలో భాగంగా సాహిత్యంలో ప్రతిభావంతులకి జీవన సాఫల్య పురస్కారాలు నెలకొల్పారు. 2023 లో పాడనా తెలుగు పాట అనే సినిమా పాటల రియాలిటీ కార్యక్రమము ఓంటారియో తెలుగు ఫౌండేషన్‌తో కలిసి నిర్వహించారు. తెలుగుతల్లి కెనడా సంస్థ పబ్లిషింగ్‌ ద్వారా ఇప్పటికి 10 పుస్తకాలు ప్రచురించారు. ప్రచురించిన పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. భారతీయ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా, ప్రతి ఏటా కొన్ని కొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. శ్రీవాణి ముప్పాళ్ల, వాణీ ఉప్పుల , రaాన్సీ గరిమెళ్ల, సౌమ్య లింగారెడ్డి, జ్యోతి రాచ, సూర్య ఉపాధ్యాయుల, సమత రాచమల్ల, శోభా వేదాంతం, షణ్ముఖ ప్రియ దేవరకొండ, హిమబిందు గుడుగుంట్ల , ప్రీతి ఎనుగంటి , హర్ష దీపిక రాయవరపు, భరణి పెండ్యాల, భాస్కర వర్మ ముదునూరు, సుప్రజహరి చల్లా , ఇందిర పమిడిఘంటం, సుజాత బలివాడ, రుక్మిణి మద్దులూరి, విజయలక్ష్మి సువర్ణ, కోరుకొండ ప్రవీణ్‌ , కోరుకొండ మానస, స్వామి నారాయణ మొదలైనవారు వివిధ కమిటీలలో సేవలు చేస్తుండగా, నిరంతరం నవ కల్పన జరగాలని తెలుగుతల్లి కమిటీ సభ్యుల ఆకాంక్ష.
శ్రీనివాస్‌, వి.వి., చాట్రాయి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img