Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మణిపూర్‌ ఆక్రందన

మహెజబీన్‌, 9866587919
కుకీ అమ్మాయి, లే!
కళ్ళు తుడుచుకో
నీ వంటికి అంటిన మట్టి దులుపుకో
ఆ దుస్తులు తీసుకో
అదే, వాళ్ళు విప్పి పడేసిన నీ దుస్తులు
దుస్తులు మాత్రమే నీవి
దేహం నీది కాదు
ఆ నగ్నత్వం నీది కాదు
నువ్వెందుకు బాధ పడతావు
నగ్నంగా ఊరేగించిన నీ దేహం మాతృభూమిది
ఈ మాతృభూమి నీది, నాది, వాళ్ళది కూడా
నీ ఆక్రందన ప్రపంచాన్ని తాకింది
అది ప్రశ్నయి వాళ్లకు గుచ్చుకుంటుంది
కుకీ అమ్మాయి, విను!
మనం వంచనకు గురైన వాళ్ళం
వస్త్రాపహరణ సమయాన చీర ఇవ్వడానికి
ఇప్పుడు కృష్ణుడు లేడు
నీ దుస్తులు నువ్వు తీసుకో
కుకీ అమ్మాయి,
వెళ్ళు, వెళ్లి స్నానం చేయి
పూసల హారాలతో అలంకరించుకో
కొండ మీద పూసిన పూలతో సింగారించుకో
మణిపూర్‌ కొండలమీద పాటలు పాడుకుంటూసాగిపో !

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img