Monday, December 5, 2022
Monday, December 5, 2022

సృజనాత్మక సాహిత్య శకటం!

సుప్రసిద్ధ తెలుగు కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, అనువాదకుడు, భావ విప్లవ కారుడు కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యంలో ‘‘వాస్తవ జీవితం’’, ‘‘జీవిత వాస్తవా’’ల చిత్రణ మధ్య తేడా గురించి ఏనాడో నిర్దిష్టంగా నిర్వచించారు. సమాజంలో జరిగింది జరిగినట్లు రాయడం వాస్తవ జీవిత చిత్రణ మాత్రమే అవుతుందనీ, ఆ వాస్తవం వెనక వుండే కార్యకారణ సంబంధాన్ని చిత్రించడమే జీవిత వాస్తవ చిత్రణ కాగలుగుతుందనీ కొ.కు. వివరించారు. ఈ రెండిరటినీ కలిపి వాస్తవంవాస్తవికత పేరిట అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఒక అభివర్గంగా ప్రకటించి వివరించారు. వాస్తవానికి, ఈ భేదం గురించి వివరించడమెంత తేలికో దాన్ని శిల్పసమన్వితంగానూ, సృజనాత్మకంగానూ చిత్రించడం అంతకష్టం! వాస్తవంవాస్తవికతల గురించినవిమర్శ సిద్ధాంతాలు పాశ్చాత్యదేశాల్లో పందొమ్మిదో శతాబ్ది అంత మయ్యాకా మరి వెలువడకపోవడం ఓ విశేషం కాగా, దాదాపు అదే సమయంలో ప్రాచ్య దేశాల్లో ఈ అవగాహన మొలకెత్తడం మరో విశేషం!
ఇంగ్లిష్‌లో రాసిన భారతీయ రచయితలు ముఖ్యంగా ముల్క్‌రాజ్‌ ఆనంద్‌, రాజారావ్‌, ఆర్కే నారాయణ్‌ 1930 దశకంలో మాత్రమే ఈ సామాజిక వాస్తవికతను తరతమ భేదాలతో చిత్రించే ప్రయత్నం మొదలుపెట్టారు. వాళ్లకన్నా ముందే బంగాలీ భాషలో రబీంద్రనాథ్‌ టాగూర్‌, ఒడియాలో ఫకీర్‌ మోహన్‌ సేనాపతి, తమిళంలో సుబ్రహ్మణ్య భారతి, వి.వి.ఎస్‌ అయ్యర్‌, హిందీలో ప్రేమ్‌చంద్‌ లాంటివాళ్ళు ఈ ధోరణికి ప్రాచుర్యం తెచ్చిపెట్టిన మాట చారిత్రక వాస్తవం! మధ్యలో కొంతకాలం పాటు ముఖ్యంగా అరవైడెబ్బై దశకాల్లో కేవలం కాలక్షేప సాహిత్యమే అటు ఇంగ్లిష్‌లోనూ, ఇటు ప్రాంతీయ భాషల్లోనూ కూడా రాజ్యమేలిన మాట కూడా చారిత్రక వాస్తవమే! 80-90 దశకాల్లో మాత్రమే తిరిగి జీవిత వాస్తవ చిత్రణ ఓ సాహిత్య ధోరణిగా పునర్జన్మ ఎత్తింది. అంతవరకూ దాదాపు అర్ధ శతాబ్ద కాలం అభ్యుదయ సాహిత్య దృక్పథం వున్నవాళ్ళే ఈ సాహిత్య ధోరణిని, ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో, పెంచి పోషించారు. ఆ తరానికి చెందినవాళ్ళలో అగ్రణ్యుడు ఘండికోట బ్రహ్మాజీరావు. ఇరవయ్యో శతకం ఇరవై దశకం మొదట్లో 1922లో పుట్టి, నలభై దశకంలో కలంపట్టిన బ్రహ్మాజీరావు అనేక ప్రక్రియల్లో ఆరితేరినవారనిపించుకున్నారు.
వృత్తిరీత్యా సాంకేతిక నిపుణుడు కావడం వల్ల కావచ్చు, ఆయన రచనల్లో ‘‘నిర్దిష్టత’’ కొటొచ్చినట్టు కనిపిస్తుంది. కథకుడిగా, నవలా రచయితగా, అనువాదకుడుగా, కథానికా సాహిత్యం రూపురేఖలను వివరించివిశ్లేషించిన విమర్శకుడిగానూ కూడా బ్రహ్మాజీరావు విశిష్ట పాత్ర పోషించారు. ప్రత్యేకించి, జీవితకాల పర్యంతం ఆయన సృజనాత్మక సాహిత్యాన్నిశిల్ప సంపన్నంగాసృష్టిస్తూనే వుండడం పెద్ద విశేషం. పాఠకులూ, పత్రికలూ, విమర్శకులూ, సాటి రచయితలూ కూడా బ్రహ్మాజీరావు కృషిని సాదరంగా స్వాగతించడం చెప్పుకోదగిన విశేషం. బ్రహ్మాజీరావుగారు రాసిన దాదాపు పాతిక నవలల మీద అయిదు పీఎచ్డీ పరిశోధనలు, ఆయన కథల మీద రెండు పీఎచ్డీ పరిశోధనలు జరిగాయట. ఇక, కథానిక స్వరూప స్వభావాలూ చారిత్రక పరిణామాల గురించి ఆయన రాసిన రెండు పుస్తకాలు, విమర్శకుడిగా బ్రహ్మాజీరావు గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘‘కథానిక కమామిషు’’అనే పుస్తకంలో ఆధునిక సాహిత్య రూపంగా కథానిక పరిణామాన్ని అంతర్జాతీయ ప్రాతిపదికపై బ్రహ్మాజీరావు విశ్లేషించారు. ఇక, ‘‘ప్రాచీన భారతంలో కథ’’ అనే పుస్తకంలో మన దేశంలో కథచెప్పే సంప్రదాయం ఎలా మొదలయి, కథాకావ్యాల ఆవిర్భావానికి దారితీసి, అది ఆధునిక కథానిక కల్పనకు ఎలా దోహదం చేసిందో ఆయన విశ్లేషించారు.
సాహిత్య శిల్పానికి ముఖ్యంగా సంభాషణలకు ప్రప్రథమ ప్రాధాన్యమిచ్చే బ్రహ్మాజీ రావు, తన నవలల్లోనూ, నవలికల్లోనూ, కథానికల్లోనూ కూడా సుపరిచితమయిన జీవితాన్నే చిత్రించే ప్రయత్నం చేశారు. అంతకుమించి, రచనల్లో ఎదురయ్యే సమస్యలకు సాహిత్యపరమయిన పరిష్కారాలనే తాను సూచించానని బ్రహ్మాజీరావు చెప్పడంగమనార్హం. దాన్నే తాత్విక వాస్తవికతలేదా, సాహిత్య వాస్తవికత అంటారు. సమస్యలను పరిష్కరించడం రచయితల పనికాదనీ, వాటిని ప్రముఖంగా చూపించి వదిలేస్తే, సమాజమే సమస్యలను పరిష్కరించుకుంటుందనీ కొందరు వాదిస్తుంటారు. బ్రహ్మాజీరావు ఆలోచన వారికి భిన్నమయింది సమస్యలను పరిష్కరించడం రచయితల పని కాదని వారికీ తెలుసు. అసలు ఒకానొక సమస్య పరిష్కారం గురించి ఏ ఆలోచనా లేనట్లయితే, అది రచయిత దృష్టిని ఆకర్షించడంలో అర్థమేమిటి? ఇతరుల జీవితాల్లోకి చాటుమాటుగా తొంగిచూసే పీపింగ్‌ టామ్‌కీ, రచయితకూ తేడా వుండి తీరాలి! సమస్యల పరిష్కారం విషయంలో ఓ అభిప్రాయం సూచించడం ద్వారా రచయిత తన రచనలో తాను సంలీనమవ్వాలి. ఇరవయ్యో శతాబ్దిలో అత్యధిక భాగం కొనసాగిన ఈ ఆలోచనరీతికి సన్నిహితంగానే వుంది బ్రహ్మాజీరావుగారి దృష్టికోణం.
ఘండికోట బ్రహ్మాజీరావు రచనలన్నింటిలోకీ విశిష్ట మయింది ‘‘శ్రామిక శకటం’’ అనే నవల. ఖడ్గపూర్‌ రైల్వే వర్క్‌షాప్‌లో పనిచేసేరోజుల్లో తనకు ఎదురయిన అనుభవాలనే అందులో ఇతివృత్తంగా తీర్చిదిద్దానని ఆయనే చెప్పారు. 1980దశకం మొదట్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన నవలల పోటీలో ఈ నవలకు ప్రథమ బహుమతి లభించడంలో వింతేం లేదు. ఈ నవలకు కథానాయిక రాజ్యలక్ష్మి అనే పాత్ర. స్వానుభవం ప్రాతిపదిక మీదే ఆమె సమస్యలకు పరిష్కారం సూచించానని ఢంకా బజాయించి చెప్పారు బ్రహ్మాజీరావు. ఆ నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం రచయితల ఆత్మ గౌరవంలో భాగంగా ఉండాలి. వాస్తవ జీవితంలోని సంఘటనల ప్రాతిపదికగా, జీవిత వాస్తవం ప్రతిపాదించడం రచయితలకు అతిపెద్ద సవాలు! ఎందుకంటే, సర్వసాక్షి అంటే, రచయితే జరిగే కథలో ఓ పాత్ర కాకపోవచ్చు కానీ, అందులో అవిభాజ్య భాగంగానే వుంటాడు. సర్వసాక్షి అలీనంగా వుండగలగడం తార్కికంగా సాధ్యమే కానీ, వాస్తవానికి అది అసాధ్యమనే చెప్పాలి. అసలు, ఆ కథతో అంత అలీనంగా వుండగల వ్యక్తి దాన్ని ఎలా రాయగలడు? కవిత్వంలో ఉన్నంత వాచ్యంగా వుండకపోవచ్చు కానీ, కథానికల్లోనూ నవలల్లోనూ కూడా రచయితలు వకాలత్‌ తీసుకుని తీరుతారు. పరస్పర విరుద్ధమయిన పాత్రల తరఫున వకాలత్‌ తీసుకుని వాదించే రచయితలూ వుంటారు. ‘‘జీవితాదర్శం’’లో చలం, ‘‘హిమజ్వాల’’లో చండీదాస్‌ అలా చేసిన మాట నిజమే! అలంకార శాస్త్ర పరిభాషలో దాన్ని ‘‘విడంబన’’ అంటారు. అది పాత్రలపాఠకుల విచక్షణ జ్ఞానాన్ని ఉపహసించడమే అనిపిస్తుంది. బ్రహ్మాజీరావు అలా చెయ్యరు కథలో లీనమయిపోయి, ఒకానొక సాహిత్యపరిష్కారం సూచిస్తారు. ఉదాహరణకు ‘‘తాబేళ్ళు’’ కథలో చీఫింజినియర్‌ మనసు కలతపడి, తాబేళ్ళ మాంసంతో చేసిన సూప్‌ను పక్కన పెట్టేశాడని రాయడం అలాంటి ‘‘సాహిత్య పరిష్కారం’’ మాత్రమే! వాస్తవజీవితంలో అలా జరిగే అవకాశం లేకపోవచ్చునని ఆయనకు తెలుసు. అందుకు పూర్తి విరుద్ధంగా జరిగే అవకాశం కూడా వుందని మనమూ గ్రహించాలి. అలా జరిగితే బావుండుననేది రచయిత ఆకాంక్ష మాత్రమే! అలాంటి ఆకాంక్ష లేని వాళ్ళు తెల్లకాయితాన్ని నల్లబరచగలరే కానీ, సాహిత్య సృజన చెయ్యలేరనిపిస్తుంది. ఈ లక్షణం, ఘండికోట బ్రహ్మాజీరావుగారిని మంచి రచయిత స్థాయి నుంచి అభ్యుదయ రచయిత స్థాయికి తీసుకుపోతుంది!!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img