Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజలకు మహోపకారం చేసిన ‘నాటక సాహిత్యం’

ఈ వేళకే మనవారి అక్షరాస్యత ( అంటే చదవటం, రాయటం ) 40 శాతం దాటలేదు. నేటికి నూరేళ్లనాడు రెండు శాతమో, మూడు శాతమో అన్న మాట. బహుశా అందుకే గురజాడ ‘నాటకంతో’ ప్రారంభించాడు. నాటకం వేసే వాళ్లకు కుసింత చదువు కావాలేమో కాని చూసేవాళ్లకు అక్కర్లేదు కదా. అలాంటి ప్రేక్షక సమూహానికి పాండవోద్యోగ విజయాలు, హరిశ్చంద్ర, చింతామణి, వరకట్నం వంటి నాటకాలు ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించాయి. కాళ్లకూరి నారాయణరావు చింతామణిలోని సుబ్బిశెట్టి పాత్రపై డైలాగులు వదిలి సామాజిక జీవితం పై విమర్శలు కుప్పించేవాడు. కాళిదాసు కోటేశ్వరరావు ఆ పాత్రలో జీవించేవాడు. ‘చింతామణీనీవూ మీయమ్మా ఓ ట్రయినిగు స్కూలు పెట్టుకోకూడదూ లైసెన్సిప్పిస్తాఆడపిల్లలకు మగవాళ్లనెలా పడగొట్టాలో మీకు తెల్సినంతగా యీ కాంగిరేసు నాయకులక్కూడా తెలియదే!’ అనే డైలాగు నాటకంలో లేదు. కాళిదాసు సృష్టి. రాజకీయ నాయకులు కాళిదాసుని కలిసి ‘కోలేశ్వరరావు మమ్మల్ని వదిలేయవయ్యా. నీకు సన్మానం పెట్టుకుంటాం గదా’ అని ప్రాధేయపడేవాళ్లట! అలాగే పాలగుమ్మి పద్మరాజు ‘రక్త కన్నీరు’ చిన్న ప్రేమ వ్యవహారం. దానిని పుచ్చుకుని నాగభూషణం చిలవలు పలవలుగా తీర్చిదిద్ది, విమర్శలు కుప్పించి కమ్యూనిస్టు సభలకు ఆయుధంగా సమకూర్చేవాడు. వేలాది ప్రదర్శనలిచ్చేడు. జనాన్ని చైతన్యపరిచేడు. వినోదంతో పాటు వివేచన, విమర్శనాత్మక దృష్టి ప్రసాదించాడు. చివరి దశకంలో (1980) బొల్లిముంత శివరామకృష్ణ ‘అందరూ బ్రతకాలి’ నాటకాన్ని తీసుకుని అంతే విధంగా రక్తి కట్టించాడు. నిజమే, పౌరాణిక నాటకాలు శ్రీకృష్ణతులాభారం, పాండవోద్యోగ విజయాలు, భక్త ప్రహ్లాద, హరిశ్చంద్ర, బాలనాగమ్మ వంటి వాటిలో సాంఘిక విమర్శ సాధ్యపడదు. ‘రసపట్టు’ ను రాగంతోనూ డైెలాగులతోనూ సాధించేవారు. ‘‘ధర్మముధర్మ మంచిటు వితండ వితర్కములాడనేలా ఆ మర్మమునే నెరుంగదు..ఆంజనేయవానిదౌ కర్మను బాపగా గలుగు కర్తవు నీవొక మారుతాత్మజా’ అని శ్రీరామాంజనేయ యుద్ధంలో రాముడు ఆంజనేయుడితో అంటే ఆయన ‘‘రామచంద్రానా ప్రాణమునైనా వదిలెదనుకాని యయాతి కిచ్చిన మాట మాత్రము నాదికాదు దానిని త్రోసిరాజనుట నావల్లకాదునన్ను చంపి ఆనక ఆతని వధింపుము అంటాడు. నేటికీ ఆడిన మాట తప్పకూడదు. అన్నది నీతే కదా. ఈవేళ గూండా ముఠాలు సైతం ఒకసారి ఓ మాట యిస్తే తప్పరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటే మరింక అంతే. నిన్ను చచ్చిపోనివ్వరు. కేసుల్లో ఇరుక్కున్నాసరే. జైలుపాలైనాసరే..! రెండవ తరంలోని సాంఘిక నాటకాలు ఎటూ నీతుల కట్టలే గదా. చింతామణి, వరవిక్రయం చెప్పుకున్నాం గదా. వరకట్నం తప్పని గదా నాటకం చెప్పింది. భమిడిపాటి కామేశ్వరరావు, వారబ్బాయి రాధాకృష్ణ హాస్య నాటకాలలో సామాజిక రుగ్మతల్ని తూర్పారబట్టారు. గురజాడ నుంచి నడిచివచ్చిన యీ వైమర్శిక నీతిని వీరేశలింగం నాటకాలు, నాటికలుగా మలిచి ప్రదర్శనలిప్పించేవాడు. పైగా ఆయనది సంస్కర్త పాత్ర. గురజాడది రచయిత పాత్ర మాత్రమే. వీరేశలింగం తన నాటికల్లో ఆడపిల్లలు చదువుకోవాలి, అందరూ ఇంగ్లీషు నేర్చుకోవాలి, పాఠశాలల్లో ఇంగ్లీషు సబ్జెక్టు ఉండి తీరాలి, వితంతువులకు వివాహాలు జరిపించాలి. అనేవే గదా అంశాలు. వీటికే సంప్రదాయవాదులు ఆగ్రహించి కందుకూరిపై పలుమార్లు దాడులు జరిపారు. ఆయన భార్య రాజ్యలక్ష్మిని ఎవరూ ఇండ్లకు పేరంటానికి పిలిచేవాళ్లు కాదు. పొరపాటున పిలిస్తే ‘‘జాగ్రత్తమ్మోవ్‌..వెధవముండలకు బొట్టు పెట్టిన మాతల్లి..ఏమని దీవిస్తుందో అని వెటకారాలు పోయేవాళ్లట. ఆమె భయపడలేదు. భర్త మార్గం వీడలేదు. అనంతరం ప్రారంభమైన సామాజిక చైతన్యయుగంలో (1940) సందేశాలతో పాటు, విమర్శ అణవణువునా చోటు చేసుకుంది. అనిశెట్టీ, పినిశెట్టీ, పద్మరాజు, కొడాలి గాపాలరావు, ఆత్రేయలు నాటకాన్ని ప్రచార సాధనంగా మలిచారు. సామాజిక రుగ్మతలపై బాణాలుంటేనే ఆదరించేవాళ్లు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రీ, సోమసుందర్‌లు కూడా ఒకటో, రెండో నాటికలు రాయక తప్పలేదు. ఆధునిక నాటక ప్రదర్శనలకు నాయకుడు గరికిపాటి రాజారావు ‘కన్యాశుల్కాన్ని’ మార్పులూ చేర్పులతో ప్రదర్శించేవాడు. ‘మాభూమి’ నాటకాన్ని సామ్యవాద సాధనంగా తయారు చేశాడు. 196070 ప్రాంతాలను సామాజిక రాజకీయ నాటకాలను రసపోషణలుగా మార్చి విజ్ఞతను టీకాల్లా రక్తంలోకి ఎక్కించిన వారు డి.వి.నరసరాజు, భమిడిపాటి రాధాకృష్ణ, గణేష్‌పాత్రోలు. పాత్రో కుటుంబ నియంత్రణ తప్పనే ముసలివాడి భావనను ఎదిరించి ఆపరేషన్‌ చేయించుకున్న భార్య ( పావలా నాటిక!..) ఉదంతాన్ని రాసి ప్రదర్శిస్తే వందల ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. పాత్రో కూడా కొన్నిసార్లు నటించాడు. కె.వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, మిశ్రో, కళ్లు చిదంబరం యిత్యాదులు నటించారు. రస పోషణ భావధారగా మారి నీతులు నూరిపోసిందన్నమాట. ఆ కీర్తితో పాత్రో సినిమా రచయితగా మారి ఆత్రేయకు నంబర్‌టుగా ఎదిగాడు. అకాల మరణానికి గురికాకపోతే ఆంధ్ర నాటక సాహిత్యానికి ‘యింకెంత దోహదపడేవాడో అనుకున్నారు..! కొడాలి గోపాలరావు ‘దొంగవీరడు’ నాటకం కేవలం గ్రామీణ కుటుంబాల స్వార్థపరుల ఉదంతం. మా వూళ్లోనే జరిగిన ఓ బాలుడి ( తెనాలి తాలూకా చదలవాడ ) హత్య ఉదంతాన్ని యధాతథంగా రాస్తే, ఆ తొలి ప్రదర్శన మా వూళ్లో వేస్తే నేనే బాలుడిగా నటించాను. నేతి పరమేశ్వరశర్మ, గుమ్మడి కుటుంబరావులు దర్శకులు. బొల్లిముంత శివరామకృష్ణ పర్యవేక్షకుడు. ఆ నాటకం జిల్లాలో పలు ప్రదర్శనలకు కారణమైంది. భూస్వాముల దుర్మార్గాన్ని కొడాలి ఎంత బాగా రాసాడూ(!) అన్నది ప్రశంస. అనంతర దశలో మోదుకూరి జాన్సన్‌, కొలకలూరి ఇనాక్‌, రాచకొండ విశ్వనాథశాస్త్రి, గణేశపాత్రో లేని లోటును భర్తీ చేశారు. మిశ్రో నాటకాన్ని విశాఖ వీధుల్లో ఊరేగించాడన్నా దోషం లేదు. పోర్టు ఉద్యోగి ధవళ సన్యాసిరావు నాటకాలు గొప్ప చైతన్యాన్ని ప్రసరింప చేశాయి. పౌరాణిక నాటకాలు సినిమా తెరకు బదిలీ అయ్యాయి. కేవల హాస్య నాటికలు ‘నవ్వుల’ కు పరిమితమయ్యాయి. నిజం చెప్పాలంటే నటులూ, నటీమణులు తగ్గిపోయారు. వ్యాపార నాగరికతలో జీవనం యంత్రంలా పరుగెడుతుంటే, రోజూ నాలుగ్గంటల పాటు నెలరోజులు రిహార్సల్స్‌ వేసే వారెవ్వరు..అంత తీరిక లెక్కడున్నాయి?
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img