Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మనిషి తప్పిపోయాడు

మనిషి తప్పిపోయాడు
వర్షం వెతుకుతూ వుంది
చిరునామావుంది శరీరం లేదు!
వర్షం ఉడీసెత్తిందంటూ
వరుణుణ్ణి నిందిస్తూ
ప్రజాక్షేమం మరిచిన
మనిషి తప్పిపోయాడు!
ఇన్నాళ్ళూ కురిసిన
వర్షదారను
అరచేతులైనా
అడ్డేసి అడ్డుకోని మనిసి
సముద్రానికి దత్తం చేశాడు!
వానకురువబోతుంది
ఒడిసి పట్టుకోమంటూ
తప్పిపోయిన మనిషికై
వర్షం దేవులాడుతుంది!
మనిషి మాయమయ్యాడు
ఓటు వెతుకుతూ వుంది
మార్పు రావాలంటూ
పరవంజానెక్కి మేధావి విమర్శలు!
మార్పుకు మూలవిరాటైన
పోలింగు బూతుకు
అతడు ముఖంచాటు!
చేతికందే దూరంలో
పోలింగు కేంద్రం పిలుస్తుంది
బద్దకం మేధావిని వదలదు
శీతలగది కదలనివ్వదు!
కోకిల కనపడటం లేదు
ఆరు ఋతువులు సమానమై
గున్నమామిడి గుబుర్లో వొదిగి
సంగీతం ఆలపిస్తూ
స్వర్గం సృష్టించిన కోకిల
హఠాత్తుగా అంతర్ధానమైంది
గాలింపుకు పోబిడీలేదు
మనసున పన్నీరద్దిన
సంగీత కచేరీలేదు!
మనిషి వేటగాడై
ఎక్కుపెట్టిన బాణం
మట్టుపెట్టిందని ప్రచారం!
మనిషి
మనీషిగా
మారటానికి
మానవత్వమే
దీర్ఘతపస్సు!
అడిగోపుల వెంకటరత్నమ్‌,
సెల్‌: 9848252946

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img