Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శ్రామికుల కవి శ్రీశ్రీ

పి.సంజీవమ్మ, సెల్‌: 7569693239

తన కాలం నాటి సమాజాన్ని, దాని స్వభావాన్ని అర్థం చేసుకోగలిగిన రచయిత మేధావి అయిన రచయిత అవుతాడు. దాంతో పాటు భవిష్యత్‌ సమాజాన్ని కూడ దర్శించగలిగిన వాడు మహా మేధావి, క్రాంతదర్శి, స్రష్ట మాత్రమే కాదు ద్రష్ట అని అలాంటి వాళ్లను అంటాము. శ్రీశ్రీకి ఉన్న ప్రాపంచిక జ్ఞానానికిమార్క్సిస్టు దార్శనికత ఆ అవగాహన తోడై అతనికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇచ్చింది. అది మరో ప్రపంచం కోసం సామ్యవాద ప్రపంచం కోసం ఆయన ఆరాటపడేలా చేసింది. మన సంప్రదాయ సాహిత్యాన్ని మధించినవాడు శ్రీశ్రీ. అందువల్లనే ఆయనకు భాషా పటుత్వం అబ్బింది. అందులో పనికిరాని భావజాలం ధ్వంసరచన చేశాడు. సరికొత్త విలువల్ని ప్రతిపాదించి ఆధునిక కవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని, విప్లవ జీవితాన్ని సృజించగలిగాడు. నన్నయ నుండి విశ్వనాథ వరకు సాగిన సంప్రదాయ కవిత్వాన్ని అంచనా వేసుకున్నాడు. వెయ్యేళ్లు సమాజాన్ని వెనక్కు మళ్లించాలనే విశ్వనాథ భావజాలాన్ని, ఒక్క అడుగైనా ముందుకు నడిపించాలనే గురజాడ భావజాలాన్ని, ఆయన సాహిత్యాన్ని బేరీజు వేసుకున్నాడు. ఆకళింపు చేసుకున్నాడు. తన సొంత కవిత్రయాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ప్రాచీనుల్లో తిక్కన, మధ్య యుగాల్లో వేమన, ఆధునిక యుగంలో గురజాడ. వీళ్లు శ్రీశ్రీకి నచ్చడంలో ఎంతో అర్థం ఉంది. మరీ గురజాడకు పరోక్ష శిష్యుడే శ్రీశ్రీ. ఆయన చనిపోయిన సంవత్సరమే శ్రీశ్రీ పుట్టాడు. పెద్దయ్యాక ఆయన సాహిత్యాన్ని ఆపోశన పట్టాడు. ఎంతో ప్రభావితుడయ్యాడు. గురజాడ శ్రీశ్రీ పాలిటికి ఆధునిక విప్లవ కవే అయ్యాడు. ‘‘అడుగు జాడ గురుజాడని అది భావికి బాట…కామ్రేడ్‌ గురజాడ అని కూడ అన్నాడు శ్రీశ్రీ. ఆధునికుల్లో ఆధునికుడుఅత్యాధునికుడు గురజాడ అని రారా అన్నాడు. కులం, మతం, స్త్రీలు, దేవుడు, దేశభక్తి అంతర్జాతీయత (‘‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై...’’) ఈ అన్ని విషయాల్లో గురజాడ అత్యంత ఆధునికతను అభ్యుదయాన్ని ప్రదర్శించాడు. గురజాడ ఒకవ్యక్తి కాదు ఒక శక్తిఒక మహత్తర సాహిత్య శక్తి. వ్యక్తికి బహువచనం శక్తి. ఈ విషయాలన్నీ మనం శ్రీశ్రీకే అన్వయించవచ్చు. శ్రీశ్రీ మహా మనీషి, మహాకవి, ప్రజాకవి, యుగకవి, మరో ప్రపంచ కవి అంతర్జాతీయ కవి. ఖడ్గ సృష్టి చేసిన కవి. కార్మిక వీరుల, శ్రామిక వీరుల కవి. కార్మిక వీరుల ఘర్మ జలానికి, ధర్మ జలానికి విలువ కట్టే షరాబు లేడన్నాడు. గురజాడ ఆధునిక భావజాలాన్ని, గిడుగు పిడుగు వ్యావహారికి భాషా వాదాన్ని ఒంటబట్టించుకున్న వాడు శ్రీశ్రీ. భాషకుప్రజాభాషకు ఉన్న బలాన్ని పసికట్టిన వాడు. సాహిత్యాన్ని ప్రజాస్వామికం చేయడానికి దాని వాహిక భాష కూడ ప్రజలదై ఉండాలి అని గ్రహించినవాడు.
ప్రపంచ బాధను తన బాధగా స్వీకరించిన ఈ ప్రజాకవి కవిత్వాన్ని మనం విలువ కట్టలేము. అలాంటి గీటురాళ్లు లేవు. దాన్ని తూచడానికి తూకపు రాళ్లూ లేవు. అలాంటి కవి తెలుగు వాడైనందుకు మనం గర్విస్తున్నాం. ఒక భారతీయుడైనందుకు, ప్రపంచ మానవుడైనందుకు మనం గర్విస్తున్నాం. రవీంద్రనాధ్‌ ఠాగూర్‌కు నోబెల్‌ బహుమానం వచ్చింది. విశ్వకవి అయ్యాడు. గీతాంజలి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. శ్రీశ్రీ మహా ప్రస్థానం కావ్యానికి ఎన్ని నోబెల్‌ బహుమతులిచ్చినా తక్కువే. శ్రీశ్రీ సాహిత్యానికి జ్ఞానపీఠ్‌ అవార్డుఇచ్చినా అది తక్కువే. అయినా విశ్వనాథ సాహిత్యానికి జ్ఞానపీఠ్‌ అవార్డు ఇచ్చిన వాళ్లు శ్రీశ్రీ సాహిత్యానికి ఎలా ఇస్తారు? అయినా ముందుగానే చెప్పుకున్నాం కదా! ఆయన కవిత్వాన్ని విలువ కట్టే షరాబులు లేరని. కార్మిక వీరుల ఘర్మ జలానికి తన కవితను అంకితం చేసిన వాడు శ్రీశ్రీ. తన కవిత్వం కర్మవీరులకు ప్రేరణఇచ్చేదిగ ముందుక నడిపించే దిగ ఉండాలని కోరుకున్నాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చాటిన కవి, కళాకారుడు శ్రీశ్రీ. శ్రమలో సౌందర్యాన్ని గుర్తించి కీర్తించిన కవి.
ఆ శ్రమ వీరుల శ్రమ దోపిడీని గుర్తించి వారికి న్యాయం జరగాలని, అందుకు మరో ప్రపంచం సాధించాలని వారికి ప్రేరణ ఇచ్చాడు. నిజమైన ప్రజాస్వామ్యం సమభావం సామ్యవాదం కోసం తాను తపించి వారికి పిలుపునిచ్చాడు. అందుకే తన కవిత్వాన్ని ప్రజాపరం చేశాడు. వాళ్లను ఆలోచింపచేశాడు. వాళ్ల కోసం మనల్ని ఆలోచింప చేస్తున్నాడు. కార్యోన్ముఖుల్ని చేస్తున్నాడు. మరో ప్రపంచంసమ సమాజం రూపుదాల్చే వరకు శ్రమ శక్తికి విజయం చేకూరే వరకు శ్రీశ్రీ కవిత్వం మనకు అవసరం. అంత వరకూ మనం ఈ కవిత్వాన్ని పఠిస్తూనే ఉంటాం. ప్రేరణ పొందుతూనే ఉంటాం. శ్రీశ్రీ లాంటి మహాకవిఆయన కవిత్వం వచ్చేవరకు కవిత్వానికి ఇంత శక్తి, ఇంత సామాజిక ప్రయోజనం ఉంటుందా అని ఆశ్చర్యపోవటం మన వంతు అయింది. సామాజికమార్పునకు సాహిత్యం ఒకచలన సూత్రంగా ఎలాపనిచేస్తుందో మనం గమనించవచ్చు. (మహా ప్రస్థానం కావ్యం లక్ష కాపీలకు పైగా అమ్మకం జరిగింది. ముప్పది సార్లు పునర్ముద్రణ పొందింది.) ఈ 21 వ శతాబ్దిలో శ్రీశ్రీ సాహిత్యాన్ని దాని ప్రభావాన్ని అంచనా వేయటం అంత సులభం కాదు. సామాజిక చరిత్ర ప్రభావం వ్యక్తుల మీదా, వ్యక్తుల ప్రభావం చరిత్ర మీదా ఉంటుంది. అదే ద్వంద్వాత్మక ప్రభావం శ్రీశ్రీ సాహిత్యాన్ని విశ్లేషించడానికి, అంచనా వేయటానికి, ఆయన్ని ప్రభావితం చేసిన మార్క్సిజం ప్రభావం మనం గుర్తించాలి. నేటి ప్రపంచం ఏ స్థితిలో ఉందో, సామ్రాజ్య వాదం విజృంభించి మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ దిగజారి ప్రపంచ సంక్షోభానికి దారి తీసింది. ఈ చారిత్రక సందర్భంలో శ్రీశ్రీ కలలు కన్న మరో ప్రపంచం కాక ప్రత్యామ్నాయం ఏముంది? అందువల్లనే నేటికీ ఈ శతాబ్దిలో కూడ శ్రీశ్రీ సాహిత్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉత్తేజితుల్ని చేస్తూంది. ఆయన ఈ శతాబ్ది (20 వ) నాది అన్నాడు. అది అత్యుక్తి ఏమో అనుకున్నాం. కానీ, ఇప్పుడు అర్థమౌతూన్నది ఏమిటి? ఉద్యమాలున్నంత వరకు వాటి ఆవశ్యకత ఉన్నంత వరకూ శ్రీశ్రీ సాహిత్య ప్రభావం వాటి మీద ఉంటుంది. ఈ సాహిత్య అవసరం ఉంటుంది. అందువల్ల ఈ 21 వ శతాబ్ది కూడా ఆయనదే. శ్రీశ్రీ మహా ప్రస్థానం రాసిన కాలంలో (1934 ఏప్రిల్‌ 12) ఉద్యమాలు లేవు. తర్వాత వచ్చిన ఉద్యమాలకు ‘మహా ప్రస్థానం’ పతాకగ నిలిచింది. శ్రీశ్రీ ఉద్యమ కవి అయ్యాడు. ఉద్యమకారుడు కాదు కానీ, శ్రీశ్రీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. శ్రమ జీవులకు సింహాసనం వేసిన కవిత శ్రీశ్రీది. శ్రీశ్రీ అనంతరం ప్రపంచీకరణ నేపథ్యంలో దోపిడీ పీడన అవినీతి అసమానత అభద్రత హింస మరింత తీవ్రమైనాయి. ఈ సందర్భంలో పోరాటాలు పుట్టుకు వస్తాయి. ఉద్యమాలు వస్తాయి. వీటికి శ్రీశ్రీ సాహిత్యం వెన్నుదన్నుగా ఉంటుంది. సామ్యవాద సమాజం రూపుదాల్చే వరకు శ్రీశ్రీ కవిత్వానికి ప్రాసంగికత ఉంటుంది. మహాకవి అనే మాట ఆయనకు చాలదు అన్నారు (సి.వి) ఎందుకంటె తెలుగు కవిత్వానికి అంతర్జాతీయతను అద్దిన కవి, తెలుగు కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినవాడు కనుక. తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయి గనుక ఉండి ఉంటే మన గురజాడ, శ్రీశ్రీలు ప్రపంచ మహా కవుల వరుసలోమొదటివారుగ ఉండేవారు. మార్క్స్‌వాదాన్ని కవిత్వంలో శ్రీశ్రీ అంత అందంగా ఎవరు వ్యక్తం చేయగలిగారు? ఆ శైలి, ఆ భాష ఆ వూపు వస్తువుకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గకుండ పొదిగిన శిల్పంఆ కవితా శిల్పం ఎవరికి సాధ్యం? ఒక రాజకీయ భావజాలాన్ని కవిత్వంలో ఇమిడ్చి విజయ వంతంగ ఇమిడ్చి మహాకవి అనిపించుకున్న వాళ్లు ఎవరు? ఎవరున్నారు? మార్క్సిస్టు వ్యతిరేకులు సంప్రదాయవాదులూ కూడ శ్రీశ్రీని కవిగ మహాకవిగ అంగీ కరించారు. విశ్వనాథ లాంటి కరడుగట్టిన సంప్రదాయవాది కూడ ‘‘కవితా! ఓకవితా!’’ కవితను విని ఉప్పొంగి పోయి, ఈ ఆధునిక యుగంలో మహాకవి అనే వాడు ఎవరైనా ఉన్నాడు అంటేవాడు శ్రీశ్రీయే అనగలిగారు. శ్రీశ్రీ ఆయా సందర్భాల్లో ఎన్నో విలువైన మాటల్ని ఆలోచనల్ని అందించాడు మనకు. ఇది సామాన్య మానవుని యుగం. ప్రజాస్వామిక యుగం. ప్రజల భాషలోనే ప్రజాస్వామిక కవిత్వం ఉండాలన్నాడు. అందువల్లనే గిడుగు, గురజాడలను అంతగ మెచ్చుకున్నాడు. సమర్థించాడు. అనుసరించాడు. వచన కవిత్వం రాయడం అంత సులభం కాదన్నాడు. అందరికీ అర్థమయ్యే కవిత్వం రాసి మెప్పించడం కూడ కష్టం అన్నాడు. పద్యం రాసినంత మాత్రాన అది కవిత్వం కాజాలదన్నాడు. వచనానికి, వచన కవిత్వానికి ఉన్న స్థాయీ భేదం ఈనాడు ఎందరు కవులకు తెలుసు? అన్నాడు. నిత్య నూతన ప్రయోగాల వల్లే సాహిత్యం కూడ సైన్సులాగ అభివృద్ధి చెందుతుంది అన్నాడు. అలాంటి ప్రయోగాలు శ్రీశ్రీ దండిగ చేశాడు కూడ. పాత ప్రక్రియలనే పట్టుకు కూచుంటే లాభంలేదు. మనుషులే నా సంగీతం. మానవులే నా సందేశం అన్న శ్రీశ్రీ మానవతావాద కవి. కవిత్వం, సాహిత్యం సమాజ జీవితానికి వ్యాఖ్యానప్రాయంగా ఉండాలి. సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషింప చేయాలి. పాఠకులకు ఆలోచన కలిగించేదిగ ఉండాలి అన్నాడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎన్నిసార్లు ఎంతమందో విమర్శకులు శోధిస్తూనే ఉన్నారు. బేరీజు వేస్తూనే ఉన్నారు. అయినా అది తరగని గని. శ్రీశ్రీ మరణించలేదు.... ప్రజల్లో నిరంతరం ప్రకాశించే కవిత్వంగా మారిపోయాడు. శ్రీశ్రీ కంటె శ్రీశ్రీ సాహిత్యం గొప్పది. ఆయన వ్యక్తిగత బలహీనతలు తప్పులూ అన్నీ ఆయనతో పాటు పోతాయి. కానీ ఆయన గొప్ప సాహిత్యం మనకు మిగులుతుంది. ఆ మాటే అన్నాడు శ్రీశ్రీ కూడ. ఎందరు మహానుభావులకు వ్యక్తిగతమైన బలహీనతలు లేకుండా ఉన్నాయి? అయినా శ్రీశ్రీ నిజాయితీపాలు ఎక్కువైపోయి ‘అనంతం’ లో ఆయన మనసు తెరచిపెట్టాడు. తన సమకాలీన పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా ఎండగట్టడం కూడ ఆయన లక్ష్యం. ఆయన జీవితం ‘అనంతం’ ‘ఆత్మ చారిత్రాత్మక నవల’ అని కూడ అన్నాడు దాన్ని. అది కేవలం జీవిత చరిత్ర కాదు. ఆయన వచన సాహిత్యం దండిగ ఉంది. అనువాద సాహిత్యమూ చాల ఉంది. కవిత్వంలో ‘అధి వాస్తవికత’ ప్రయోగాలు చేశాడు. కథల్లో చైతన్య స్రవంతి శిల్పం ప్రయోగించాడు. మన ప్రాచీన సాహిత్యాన్ని మథించడంతో పాటు పాశ్చాత్య సాహిత్యాన్ని ఎంతో అధ్యయనం చేశాడు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, రష్యన్‌ సాహిత్యాలు ఆయా కవిత్వాలూ కల్పనా సాహిత్యంతోనూ గాఢ పరిచయం ఉంది. పాబ్లొ, నెరూడ, జేమ్స్‌ జాయిస్‌, చేగువేరా, మయకోవిస్కీ, గోర్కీ వంటి వారి రచనలు అధ్యయనం చేశాడు. శ్రీశ్రీ కవి మాత్రమే కాదు, వచన రచయిత, విమర్శకుడు కూడ. ఆయన అపారమైన జ్ఞాన సంపద అంతా ఆయన కవిత్వంలో కంటె వచనంలో నిక్షిప్తమై ఉంది. శ్రీశ్రీలోని ఆలోచనాపరుడు ఆయన వచన రచనల్లో కనిపిస్తాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని మెచ్చుకున్నంతగ విశ్లేషించి విమర్శించినంతగ విమర్శకులు ఆయన వచన సాహిత్యం జోలికి పెద్దగా పోలేదు. ఇది ఒకరకంగ నష్టం మనకు. దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చాలాకాలం అరసం అధ్యక్షడుగ, కొంతకాలం విరసం అధ్యక్షుడుగ, మరికొంతకాలం పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగానూ ఉన్నారు. 1934 ఏప్రిల్‌ 12 న మహా ప్రస్థానం గేయం రాశాడు. అప్పటికి ఆయనకు 24 ఏళ్ల వయసు. 1936 లో ‘ప్రతిజ్ఞ’ గేయం రాశాడు. 1940 నాటికి మహా ప్రస్థానం సంపుటిలోని కవితలన్నీ రాశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img