Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మియా కవిత్వం

తెలుగువాడే అయినా తెలుగునేలలో పుట్టలేదు. ఖరగ్‌ పూర్‌ లో పుట్టారు. బెంగాల్‌లో ఉన్నందువల్ల బెంగాలీ మీద పట్టు సంపాదించారు. తాను ఆస్వాదించిన దాన్ని ఇతరులూ ఆస్వాదించాలను కుంటారు. చాలామంది రచయితలు తమ రచనలను అమితంగా ప్రేమిస్తారు. ఇలా సంతృప్తి పడడంవల్ల అలాంటి వారికి సాహిత్య రంగంలోని భిన్న పార్శ్వాలు, రీతులు, సంప్రదాయాలు, మార్పులు తెలియకపోవచ్చు. తెలుసుకోవాలనీ అనుకోరు. కొత్త దారులు పడ్డా పట్టించుకోరు. ముకుంద రామారావు ఈ ధోరణికి పూర్తిగా విరుద్ధం.
తాను తిరిగిన చోట్లు, పెరిగిన చోట్లు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. చిన్ననాటే సాహిత్య గంధం అబ్బినందువల్ల వివిధ ప్రక్రియల్లో ఆయన గణనీయ మైన కృషే చేశారు. అనేక దేశాల కవిత్వాన్ని అనువదించారు (అదే ఆకాశం). ప్రపంచదేశాల కవిత్వ నేపథ్యం (అదే గాలి) తెలుగువారికి పరిచయం చేశారు. భారతీయకవిత్వ నేపథ్యాన్ని (అదేనేల) ఒడిసి పట్టుకున్నారు. మధ్యయుగాల భక్తి కవిత్వ నేపథ్యం ఏమిటో తరచి చూశారు. శతాబ్దాల సూఫీ కవిత్వ ఆనవాళ్లు వెతికిపట్టారు. నోబుల్‌ బహుమతులు అందుకున్న వారిని, వారి జీవిత విశేషాలను పరిచయం చేశారు. తనకు నచ్చిన జాతీయ అంతర్జాతీయ కవిత్వ విశేషాలను ఎత్తి చూపారు.
గత సంవత్సరం మరో కవిత్వ ధోరణిని తెలుగు వాకిట్లోకి తీసుకొచ్చారు. అదే మీయా కవిత్వం. ‘‘మియా కవిత్వం’’ అని కొన్ని కవితలను అనువదించి 2022 నవంబర్‌లో ప్రచురించారు. ఆ కవిత్వ ధోరణి ఆయనకు తారసపడిరది అంతకు రెండేళ్ల ముందే. ఆ తీగ పట్టుకుని డొంక లాగడం మొదలు పెట్టినప్పుడు బాగా నచ్చిన మియా కవితలను తెలుగు వారి దృష్టికి తీసుకురావాలనుకున్నారు. అదే ‘‘మియా కవిత్వం’’ సంపుటి.
ఈ గ్రంథంలో మియా కవిత్వ నేపథ్యాన్ని వివరంగా అందించారు. తాను సుదీర్ఘ ముందుమాట రాయడంతో పాటు, ప్రసిద్ధ కవి అశోక్‌ వాజపేయి తో చిన్న పీఠిక రాయించారు.
2019లో మియా కవిత్వ ధార గురించి నేను తెలుసుకున్నప్పుడు ఒక దినపత్రికలో ‘‘విద్వేష పంకంలోంచి మియా కెందామర’’ వ్యాసం రాశాను. ఈ వ్యాసం రాయడానికి ముందు సాహితీ మిత్రులను ఈ ధోరణి గురించి ఏమైనా తెలుసునా అని అడిగితే ఒక్కరు కూడా తెలుసు అనలేదు. కానీ 2022 లో ముకుంద రామారావు ఏకంగా మియా కవిత్వాన్ని అనువదించి అదే పేరుతో ప్రచురించారు. అంటాఎ వివిధ చోట్ల జరుగుతున్న పరిణామాలను పరిశీలించే లక్షణం ఆయనకు ఉందనేగా.
మియా కవితల్లో కొన్నింటిని అనువాదం చేసి ఊరుకున్నారు తప్ప ఒక సంపుటిగా ప్రచురించాలనే ధ్యాసే ఆయనకు రాయలేదు. మొత్తం మీద కొద్ది రోజులకు మియా కవిత్వం పుస్తకం వెలువడిరది.
అసలీ మియా కవిత్వం అంటే ఏమిటి? మియా అన్న మాటకు ఉర్దూలో చాలా అర్థాలు ఉన్నాయి. అత్యంత గౌరవభావంతో ఈ మాట వాడతారు. ఆ సంస్కారం గురించి పట్టించుకోని మన ప్రధానమంత్రి మోదీ లాంటి వారికి నిందార్థం మాత్రమే స్ఫురిస్తుంది. నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ ఆయనను ఎప్పుడూ ‘మియా ముషరఫ్‌’ అని నిందార్థంలోనే ప్రస్తావించే వారు.
దాదాపు 75 లక్షల జనాభా ఉన్న మియాలు ప్రధానంగా అస్సాంలో కనిపిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అస్సాంలో స్థిరపడిన వారు ఎక్కువ మంది. అలాంటి వారిలో మియాలు అధిక సంఖ్యాకులు. అస్సాంలో వ్యవసాయం అభివృద్ధి చేయడం కోసం బ్రిటిష్‌ వారు ప్రధానంగా బెంగాల్‌ నుంచి ముస్లింలను తీసుకొచ్చారు. ఆ తరవాత బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి అస్సాంలో స్థిరపడ్డ వారూ ఉన్నారు. స్థూలంగా పరాయి దేశమ్నుంచి వచ్చి అస్సాంలో స్థిరపడిన వారిని మియాలు అంటున్నారు. ఈ సమాజం నిరంతరం నిర్లక్ష్యానికి గురి అవుతూనే ఉంది. ‘‘ఈ సమాజంలోని ప్రజలను చంపినందుకు, హింసించినందుకు ఏ ప్రభుత్వం ఎవరినీ శిక్షించలేదు’’ అని ముకుంద రామారావు అంటారు. మియాలు అస్సామీలు కాకపోయినా ఒక్క సారి వచ్చి స్థిరపడిన తరవాత అస్సాం సంస్కృతిని, భాషను సొంతం చేసుకున్నారు. మియా కవుల్లో చాలా మంది రాసేదీ అస్సామీ భాషలోనే. అయినా చాలా మంది దృష్టిలో, ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలో పరాయి వారే.
అస్సామీ సమాజంతో తాము ఎంతగా కలిసిపోయినా వారు తమను తమ వారిగా అంగీకరించకపోవడంతో ఆవేదనకు గురై కవిత్వం రాసే అభిరుచి ఉన్న వారు అల్లిన కవిత్వానే మియా కవిత్వం అంటున్నారు. మియాలు శరణార్థులు మాత్రమే అయితే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండేదేమో. కాని వారు ముస్లింలు కూడా అయినందువల్ల మియాలు అనేక రూపాల్లో వివక్షకు గురవుతున్నారు. అసలైన అస్సామీలు ఎవరో తేల్చే క్రమంలో వీరిలో అభద్రతాభావం విపరీతంగా పెరిగింది. డా. హఫీజ్‌ అహమద్‌ అనే మియా కవి బాధ చూడండి…
అర్హులైన జాతీయపౌరుల జాబితా(ఎన్‌.ఆర్‌.సి.)లో
నా సంఖ్య 2000543
నాకు ఇద్దరు పిల్లలు
వచ్చే వేసవిలో ఇంకొకరు చేరబోతున్నారు
నన్ను అసహ్యించుకున్నట్టే వాడినీ అసహ్యించుకుంటావా?

నేను మియానని రాసుకో
బీడు భూముల్ని
పచ్చటి పైరు పొలాలుగా మారుస్తాను
మీకు తిండి కోసం
ఇటుకలు మోస్తాను
మీ మేడలకోసం…’’
…’’మీ మురుగు శుభ్రం చేస్తాను
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి
మీ సేవకోసమే సదా ఉన్నాను
అయినా మీకు సంతృప్తి లేదు
రాసుకో మియానని’’
రెజ్వాన్‌ హుస్సైన్‌ ఆవేదన ఇలా ఉంటుంది…
‘‘మమ్మల్ని తిట్టండి
తన్నాలనుకుంటే తన్నండి
సహనంతో మీ భవనాలను, వంతెనలను
కడుతూనే ఉంటాం
మీ అలసి బలిసిన చెమట శరీరాల్ని
సైకిల్‌ రిక్షాలో సహనంతో లాగుతూనే ఉంటాం’’
సొంతనేలను వదిలివచ్చి అస్సాంలో స్థిరపడ్డ మియాల బాధ ఈ సంపుటిలోని ప్రతి కవితలోనూ కనిపిస్తుంది. ముస్లింలు అయినందుకు వారి బాధ ఇతర శరణార్థుల బాధకన్నా అనేక రెట్లు ఎక్కువ. ఆ బాధనే ముకుంద రామారావు మనతో పంచుకున్నారు.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img