Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ఉత్తరాఖండ్‌లో అవినీతిని అంతం చేస్తాం : ఆప్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో తమ పార్టీని అధికారంలోకి తెస్తే అవినీతిని అంతం చేస్తామని, అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన 11 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉత్తరాఖండ్‌లో వరుసగా కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రమే ప్రజలకు నిజాయితీ గల ప్రత్యామ్నాయాన్ని అందించగలదని అన్నారు. బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు గానీ మరో ఐదేళ్లు గడువు ఇస్తే తమ ఖజానాను నింపుకోవడమే తప్ప పరిస్థితి ఏమీ మారదని ఆయన అన్నారు. ‘ఈ ఎన్నికల్లో స్వచ్ఛమైన ఉద్దేశంతో పార్టీని ఎన్నుకునే అవకాశం మీకు ఉంది. గత 21 సంవత్సరాలుగా కాంగ్రెస్‌, బీజేపీలు ఇచ్చిన అవినీతి ప్రభుత్వాలకు ఆప్‌ మాత్రమే నిజాయితీగల ప్రత్యామ్నాయం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడిన కేజ్రీవాల్‌, ఉత్తరాఖండ్‌లో ప్రజలకు అందించిన మంచి రోడ్లు, పాఠశాలలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి వంటి వాగ్ధానాలను దిల్లీలో ఇప్పటికే నెరవేర్చామని చెప్పారు. దిల్లీలో మంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, ఇక్కడ కూడా చేస్తామని చెప్పారు. ఆప్‌ మేనిఫెస్టోలో ఉపాధి, నిరుద్యోగులకు భృతి, ఉచితంగా నిరంతర విద్యుత్‌, మంచి రోడ్లు, అయోధ్య, అజ్మీర్‌ షరీఫ్‌, కర్తార్‌పూర్‌ సాహిబ్‌లకు ఉచిత తీర్థయాత్ర, ఉత్తరాఖండ్‌ను ఆధ్యాత్మిక రాజధానిగా చేయడం, పదవీ విరమణ చేసిన సైనికులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్మీ, పోలీసు, పారామిలటరీ బలగాల అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పరిహారం పెంచడం వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img