Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ప్రాంతాల మధ్య కాంగ్రెస్‌ చిచ్చు

పాలకుడిగా చన్నీ అర్హుడు కాదు
బీజేపీ కూటమిని గెలిపించండి
పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ

అబోహర్‌: ప్రాంతాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ చిచ్చు పెడుతోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఒక ప్రాంతం వారిపై మరో ప్రాంతం వారిని రెచ్చగొట్టి కొట్లాటకు ఆజ్యం పోస్తోందని మండిపడ్డారు. యూపీ, బీహారు, దిల్లీ వారిని రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలను మోదీ గురువారం తప్పుబట్టారు. ప్రజల ఇలాంటి విభజన భావాలు సృష్టించే వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని ప్రధాని అన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోదీ ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పంజాబ్‌లో బీజేపీ కూటమిని గెలిపించాలని ఓటర్లకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌, బీహారు, దిల్లీ వారిని పంజాబ్‌లోకి రాకుండా అడ్డుకోవాలని సీఎం చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తన స్వప్రయోజనాల కోసం రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలు సృష్టిస్తోందని మోదీ విమర్శించారు. చన్నీ వ్యాఖ్యలను దేశమంతా చూసిందని, చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆయన పక్కన గల ఆ పార్టీ నేత చప్పట్లు కొట్టడం అంతా చూశారన్నారు. ఇతరులను అవమానించేందుకే ఇలాంటి ప్రకటనలు చేశారని ఆరోపించారు. ‘బుధవారం గురు రవిదాస్‌ జయంతి చేసుకున్నాం. రవిదాస్‌ ఎక్కడ పుట్టాడో ఈ నాయకులకు తెలుసా? ఆయన పంజాబ్‌లో పుట్టారా? ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టారు. రవిదాస్‌ అనుచరులను ఇక్కడికి రానివ్వరా? రవిదాస్‌ పేరును మీరు తుడిపేస్తారా? మీరు ఏమి భాష మాట్లాడుతున్నారు?’ అని మోదీ ప్రశ్నించారు. అలాగే గురు గోవింద్‌సింగ్‌ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు.
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేసిందని ప్రధాని చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ద్రోహం చేసిన చరిత్ర అందరికీ తెలుసన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని ఏళ్ల తరబడి డిమాండ్‌ వస్తోందని, కానీ కాంగ్రెస్‌ దానిని ఏనాడు అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రంలో తాము అధికారం చేపట్టిన వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును ప్రారంభించామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలోనే రికార్డుస్థాయిలోనే ఆహారధాన్యాలు కొనుగోలు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. పంజాబ్‌లో ప్రతి వ్యాపారం మాఫియా గుప్పెట్లో ఉందని చన్నీ ప్రభుత్వాన్ని నిందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల కారణంగా పంజాబ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందుకు రావడం లేదన్నారు. బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని పంజాబ్‌ మొత్తం ఒకటే వాణి వినిపిస్తోందని, రెండిరజన్ల ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. రెండిరజన్ల ప్రభుత్వంతోనే సత్వర పురోగతి సాధ్యమన్నారు. రాష్ట్రం నుంచి ఇసుక మాఫియా, డ్రగ్స్‌ మాఫియాను తరిమికొడతామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, స్వయం ఉపాధిపై దృష్టి కేంద్రీకరిస్తామని హామీలు గుప్పించారు. ‘మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. డబుల్‌ ఇంజిన్ల ప్రభుత్వంతో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తాం’ అని మోదీ వేడుకున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అమరేందర్‌సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌కాంగ్రెస్‌, సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా నాయకత్వాన గల శిరోమణి అకాలీదళ్‌(సంయుక్త)తో బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img