Friday, April 26, 2024
Friday, April 26, 2024

అది వ్యక్తి దైవిక హక్కు కాదు..

కాంగ్రెస్‌ నాయకత్వంపై ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్య

న్యూదిల్లీ / కోల్‌కతా : కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం కీలకమే అయినప్పటికీ ఆ పార్టీ నాయకత్వం ఒక వ్యక్తి దైవిక హక్కు కాబోదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలన్నారు. పదేళ్లలో జరిగిన 90శాతం ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిని చవిచూసిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి విమర్శించారు. యూపీఏ లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ప్రశాంత్‌ కిశోర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. ‘ఇక్కడ ప్రస్తావించిన వ్యక్తి తన దైవిక కర్తవ్యాన్ని పోరాటం దిశగా నిర్వర్తిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి భారతీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నాడని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సైద్ధాంతిక కట్టుబాట్లు లేని వృత్తివారు పార్టీలు/ వ్యక్తులకు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలన్న దానిపై సలహాలు, సూచనలు చేయొచ్చుగానీ రాజకీయాల అజెండాను నిర్దేశించాలని అనుకోవడం తగదన్నారు. ‘23 గ్రూపు’లో ప్రధాన సభ్యునిగా ఉన్న కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌.. ప్రతిపక్ష ఐక్యతకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ లేని యూపీఏ ఆత్మలేని శరీరంతో సమానమని అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ కొద్దినెలల కిందట కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోవాలని భావించారు. రాహుల్‌ గాంధీతోనూ చర్చలు జరిపారుగానీ అవి ఫలించినట్లు లేవు. రెండు నెలల కిందట కూడా కాంగ్రెస్‌పై ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శలు గుప్పించారు. లఖింపూర్‌ ఘటన నేపథ్యంలో పురాతన పార్టీ నేతృత్వంలో ప్రతిపక్షం త్వరగా పునరుద్ధరిస్తుందని ఆకాంక్షించే వారికి నైరాశ్యం తప్పబోదని వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవర్‌తో ముంబైలో భేటీ అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఐక్యపోరుకు పిలుపు ఇచ్చారు. యూపీఏ లేదని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండి ఇక్కడ సాధించేది ఏమీ ఉండదంటూ రాహుల్‌నుద్దేశించి అన్నారు. ప్రస్తుతానికి నాయకత్వ సమస్య లేదని బీజేపీపై పోరాటానికి భావసారూప్యతగల పార్టీలన్నీ కలిసిరావాలని పవార్‌ అన్నారు. ఇటీవలి కాంగ్రెస్‌కు టీఎంసీ మధ్య సంబంధాలు చెడిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img