Friday, April 26, 2024
Friday, April 26, 2024

అసోం అసెంబ్లీలో ఫిరాయింపుల రగడ

ప్రజాస్వామ్యం ఖూనీ: విపక్షాల ఆగ్రహం
న్యూదిల్లీ: పార్టీ ఫిరాయింపులపై అసోం అసెంబ్లీ దద్దరిల్లింది. రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకోవడానికిగాను పాలక బీజేపీ తమ ఎమ్మెల్యేలకు వలవేస్తోందని, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పక్ష కాంగ్రెస్‌ ఆగ్రహం వెలిబుచ్చింది. అసెంబ్లీ నుంచి సోమవారం వాకౌట్‌ చేసింది. ఉదయం సభ సమావేశం కాగానే ప్రతిపక్ష నేత దేవవ్రత సైకియా మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ, పాలక బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని నియంత్రించడానికి స్పీకర్‌ విశ్వజిత్‌ దయమరి ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాలు కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ఆగలేదు. సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓటేస్తారని ముఖ్యమంత్రి ఆదివారం ప్రకటించారు. ఇది దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సైకియా ఆరోపించారు. కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఆరోపణలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ఎదురుదాడికి దిగారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడిరది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌, సీపీఎం, రాయ్‌జర్‌ దళ్‌లతో కూడిన ప్రతిపక్షమంతా వెల్‌లోకి దూసుకెళ్లింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని అంగీకరించం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి అంటూ నినదించారు. దీనికి ప్రతిగా బీజేపీ సభ్యులు భారత్‌ మాతాకీ జై, జై శ్రీరామ్‌ నినాదాలు చేశారు. ‘మీరు(ప్రతిపక్షం) కూర్చొండి. సమస్యను పరిష్కరిద్దాం. చర్చిస్తేనే గదా సమస్య పరిష్కారమయ్యేది. ఫిరాయింపులపై సభలో చర్చించడానికి ఎలాంటి సమస్య లేదు. రాజ్యసభ ఎన్నికలు నిబంధనల ప్రకారమే జరుగుతాయి’ అని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. అర్ధగంటకు పైగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిలబడి నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. చివరికి ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. అసోంకు సంబంధించి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ తమ అభ్యర్థిగా పవిత్ర మార్గరీటను అభ్యర్థిగా నిలిపింది. బలం లేకపోయినా రెండోసీటుకు దాని మిత్రపక్షం యూపీపీఎల్‌ వర్కిండ్‌ ప్రెసిడెంట్‌ రంగ్వారా నర్జరీని రంగంలో దింపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img