Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆరు రోజులు `400 మంది దాతలు

అవయవ దానానికి ఆదర్శంగా కేరళ గ్రామం

పఠానమ్మిట్ట : కేరళ, పఠానమ్మిట్ట జిల్లాలోని అదూర్‌ తాలూకాలోని థంగమామ్‌ గ్రామంలో వేర్వేరు రకాల పంటలు పండుతాయి. పాడి పరిశ్రమ ఉంది. ఈ గ్రామం ఇప్పుడు అవయవ దాతల ఊరుగా మారింది. ఈనెల 13వ తేదీ ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఈ సందర్భంగా థంగమామ్‌కు చెందిన 55 మంది యువకులు.. జిల్లా వైద్య కార్యాలయం, నెహ్రూ యువకేంద్ర (ఎన్‌వైకే) సహకారంతో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్కువ సమయంలోనే గ్రామంలోని వందల మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆరు రోజుల్లో 400 మంది అవయవాల దాతల జాబితాలో చేరారు. గ్రామంలో 500కుపైగా కుటుం బాల్లో 1500 మంది ఉంటున్నారని, తమ ప్రచారానికి ఇంతటి ఆదరణ లభిస్తుందని ఊహించలేదని 23ఏళ్లుగా థంగమామ్‌లో కళలుక్రీడల క్లబ్‌ నిర్వహిస్తున్న ఫ్రెండ్స్‌ సమస్కారికా వేది అధ్యక్షులు అను సి థంగమామ్‌ అన్నారు. అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారిలో 18 నుంచి 55 మధ్య వయస్సు వారున్నట్లు తెలిపారు. అవయవ దానానికి ఉన్న ప్రాధాన్యత గ్రామస్తులకు తెలుసన్నారు. ఇప్పటివరకు గ్రామంలో అవయవాలను దానం చేసిన దాఖలాలు లేవని చెప్పారు. ఆ దిశగా తమ ప్రచారమే తొలి అడుగు అని, ఇప్పటికే 400 మంది తమ మరణానం తరం అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారని అను తెలిపారు. మూఢనమ్మకాలు, అంథ విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లను పక్కకు పెట్టి ప్రాణాలను కాపాడాలంటూ వారికి పిలుపునిచ్చామని, ఇంటింటి ప్రచారం నిర్వహించామని, గ్రామీణుల సందేహాలనూ నివృత్తి చేశామని ఎన్‌వైకే జిల్లా యూత్‌ అధికారి సందీప్‌ కృష్ణన్‌ వెల్లడిరచారు. తమ సంస్థ, జిల్లా వైద్య కార్యాలయం సంపూర్ణ మద్దతిస్తోందని అను చెప్పారు. గ్రామంలో నూటికి నూరుశాతం జనాభా దాతలవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఉద్దేశం నెరవేరేలా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు నాటికి 1855 మధ్య వయస్కుల్లో దాదాపు అందరూ తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు సిద్ధమవుతారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందుకు అంగీకరించిన వారి ఫొటో, వివరాలను సేకరించి వాటిని మృతసంజీవని వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇది ఉందన్నారు. బయట గ్రామాలకూ తమ సందేశాన్ని పంపే కసరత్తు జరుగుతున్నట్లు వెల్లడిరచారు. తమ క్లబ్‌ వ్యవస్థాపక సభ్యుడు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల సూత్రధారి జయకుమార్‌ చంద్రాలయం (45) కోవిడ్‌ సోకడంతో గతేడాది జూన్‌లో మరణించారు. తన మరణానికి ముందు అవయవ దానం క్యాంపెయిన్‌ నిర్వహించాలన్న తన ఆలోచనను క్లబ్‌ వర్గాలతో పంచుకున్నారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకు క్లబ్‌ సభ్యులంతా ఇందుకు నడుం బిగించారు. జయకుమార్‌ కలను సాకారం చేసేందుకు వేర్వేరు కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తమ లక్ష్యం దిశగా ముందుకు వెళుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img